
పెండ్లికి నెల ముందే కార్డులు అచ్చు వేయించి, పంచుతరు. ఇంటింటికీ పోయి వాయినం ఇచ్చి మరీ పెండ్లికి పిలుస్తరు. చుట్టాలకి, దోస్త్లకి.. వాట్సాప్‌లోనూ పెండ్లి పిలుపులు పంపుతరు. వెడ్డింగ్ ఇన్విటేషన్ పేరుతో ప్రత్యేకంగా వీడియోలు కూడా తీస్తున్నరు ఈ మధ్య. అయితే ఇట్ల పెండ్లి పిలుపుల్లో కాలంతో పాటు ఎన్ని మార్పులొచ్చినా.. ఈ ఊళ్ళలో మాత్రం గోడలపై పెండ్లి పిల్ల, పిలగాడి పేర్లు రాస్తున్నరు. అదే మా పెండ్లి పిలుపు అంటున్నరు. ఈ కథేందో తెలుసుకోవాల్నంటే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్న ఈ ఊళ్ళకి పోవాల్సిందే.
పెండ్లంటే.. పది కాలాలు గుర్తుండిపోవాలన్నది అందరి మాట. అందుకే చుట్టాలు, తెలిసినోళ్లు, దోస్తులు.. అందర్నీ పిలిచి ఘనంగా చేసుకుంటరు. ఆ తతంగాన్ని ఫొటోలు, వీడియోలు తీయించి భద్రంగా దాచుకుంటరు కూడా. అయితే తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో పెండ్లి పిలుపు గోడలపై కనిపిస్తది. లగ్గం చేసుకునే పిల్ల, పిలగాడి పేర్లు ఇంటి గోడలపై రంగులతో అందంగా రాయిస్తరు ఇక్కడ. ఇది పెండ్లి పిలుపే కాదు.. ఫొటోలు, వీడియోల మాదిరే ఓ జ్ఞాపకం అంటున్నరు ఆ ఊళ్లలోని జనాలు. వందల ఏండ్ల నుంచి వస్తున్న ఆచారమని చెప్తున్నరు.
బాజాభజంత్రీలతో...
ఇంతకుముందు చాలా చోట్ల పెండ్లి పిలుపు పేరిట ఇంటి గోడలపై పేర్లు రాయించేటోళ్లు. అయితే, పెండ్లి కార్డులు, ఇన్విటేషన్ వీడియోలు వచ్చాక.. చాలామంది ఈ ఆచారాన్ని పక్కనపెట్టేసిన్రు. కానీ, మహారాష్ట్ర, కర్నాటక బార్డర్ని ఆనుకొని ఉండే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని ఊళ్ళలో మాత్రం ఇప్పటికీ ఈ ఆచారం కనిపిస్తది. ఇక్కడ ఎవరింట్ల లగ్గం జరిగినా రంగురంగులతో అందంగా ‘పెండ్లి పిలుపు’ పెయింటింగ్‌లు గోడల మీదకు ఎక్కుతయ్. ముఖ్యంగా జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, పెద్దకొడప్గల్, కోటగిరి.. మండలాల్లో ఏ గ్రామానికెళ్లినా.. పెండ్లి పిల్ల, పిలగాడి పేర్లు, బాజాభజంత్రీల బొమ్మలు గోడలపై కనిపిస్తయ్. మహారాష్ట్ర, కర్నాటకకి దగ్గరగా ఉండటం వల్ల ఈ ప్రాంతంలో తెలుగుతో పాటు మరాఠి, కన్నడ కూడా మాట్లాడతారు. అందుకే పెండ్లి పిలుపుని మూడు భాషల్లో గోడలపై రాయిస్తున్నరు. కొందరైతే హిందీ, ఇంగ్లీషులో కూడా రాయిస్తున్నరు.
తరతరాలుగా...
ఈ గ్రామాల్లో ఉన్నోళ్లు, లేన్నోళ్లు.. అని లేకుండ అందరూ ఈ ఆచారాన్ని పాటిస్తరు. లగ్గం కుదిరాక ఇంటికి సున్నం, రంగులు వేసి.. ఇంటి ముందు గోడ మీద అందంగా లగ్గం పిలుపు రాయిస్తరు. ఆ ఇంట్లో లగ్గం ఉన్నట్లు నలుగురికి చెప్పడమే ఈ ఆచారం వెనకున్న ఉద్దేశం. దీనివల్ల వేడుకలకు ఇతర ఊర్ల నుంచి వచ్చే చుట్టాలు, దోస్తులు ఈజీగా ఇల్లు గుర్తుపడతరని చెప్తరు. అదొక్కటే కాకుండా ఇదొక జ్ఞాపకంగా కూడా ఉంటుందని చెప్తున్నరు. ఈ లగ్గం పిలుపు రాసేందుకు పన్నెండొందల నుంచి నుంచి మూడువేల రూపాయల వరకు ఖర్చు చేస్తరట.
అందరికి తెలుస్తది
కొన్నేండ్ల కిందట నా కొడుకుకి లగ్గం అయింది. ఇంటికి కొడుకు, కోడలు పేర్లతో లగ్గం పిలుపు రాయించిన. గిట్ల రాయించుడు ఎందుకంటే మా ఇంట్లో లగ్గం ఉన్నట్లు అందరికి తెలుస్తది. మా తాత, ముత్తాల నుంచి మా ఏరియాల్లో రాయిస్తున్రు. మిగతా ఏరియాల్లో మర్చిపోవచ్చు కానీ మా జుక్కల్ ఏరియాలో మాత్రం ఇంకా ఈ ఆచారం ఉంది. మా పిల్లలు కూడా ఈ ఆచారాన్ని పాటించేటట్టు చేస్తం.
- సుర్ణార్ మల్లారి, జుక్కల్
ఎప్పట్నించో ఉన్నది
ఎవరింట్లో లగ్గం అయినా పెండ్లి పిల్ల, పిలగాడు, ఆ ఇంటి వాళ్ల పేర్లు గోడలపై రాయించటం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. వీళ్లు, వాళ్లని కాదు అందరం రాయిస్తం. మళ్లీ ఆ ఇంటికి సున్నం వేసే దాక అయి అట్లనే ఉంటయ్. నా లగ్గమప్పుడే కాదు, నా తర్వాత మా ఇంట్ల నాలుగు లగ్గాలు అయితే కూడా గిట్లనే రాయించినం.
- సాయేంవార్ వీరన్న, పెద్ద ఎడ్గి
- వాడికారి గంగాధర్, కామారెడ్డి , వెలుగు