ఇబ్రహీంపట్నం ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్

ఇబ్రహీంపట్నం ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిని జాతీయ మహిళా కమిషన్ సందర్శించింది. గత నెలలో 34మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయగా..అందులో నలుగురు చనిపోయారు. ఈ ఘటనపై.. జాతీయ మహిళ కమిషన్ కార్యదర్శి ఆధ్వర్యంలో IASల బృందం ఇవాళ ఇబ్రహీంపట్నం ఆస్పత్రిని సందర్శించారు. ఆపరేషన్లు చేసిన థియేటర్లను పరిశీలించి డాక్టర్లు, సిబ్బందిని విచారించారు. తర్వాత మృతుల కుటుంబసభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చాక.. సంబంధిత డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని జాతీయ మహిళ కమిషన్ కార్యదర్శి మీటా రాజీవ్ లోచన్ తెలిపారు.

ఎక్కడో తప్పు జరిగింది..

ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ల ఫెయిల్యూర్ ఘటనలో స్టెరిలైజేషన్‌లోనే ఏదో పొరపాటు జరిగిందని, మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌, డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ఆగస్టు 25న డీపీఎల్ ఆపరేషన్లు జరిగిన ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌ను శ్రీనివాసరావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ శుక్రవారం సందర్శించింది. ఆపరేషన్లు జరిగిన థియేటర్‌‌, అక్కడ ఉన్న పరికరాలను కమిటీ సభ్యులు పరిశీలించారు. డీపీఎల్ క్యాంపు డ్యూటీలో ఉన్న సుమారు 30 మంది స్టాఫ్‌ను కమిటీ ప్రశ్నించింది. ఆ రోజు ఏం జరిగిందో వివరాలు సేకరించింది. తర్వాత అక్కడే డీహెచ్ మీడియాతో మాట్లాడారు. ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఆయన అన్నారు.

స్టెఫలో కోకస్ బ్యాక్టీరియా వల్లే మృతులంతా ఇన్ఫెక్షన్​కు గురయినట్టు గుర్తించామని తెలిపారు.శనివారం నాటికి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. అయితే, ఆగస్టు 25న ఇబ్రహీంపట్నంలో సర్జరీలకు వినియోగించిన పరికరాలతోనే, ఆ తర్వాత రోజు చేవెళ్లలో 60 మందికి, 27న సూర్యాపేటలో వంద మందికి డీపీఎల్ సర్జరీలు చేశారని డీహెచ్ తెలిపారు. వాళ్లలో ఎవరికీ ఏమీ కాలేదన్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ల సమయంలో వాడిన కాటన్‌‌‌‌, బ్యాండేజ్, ప్యాడ్స్‌‌‌‌ స్టెరిలైజేషన్‌‌‌‌లో ఏమైనా పొరపాటు జరిగిందేమోనన్న అనుమానాన్ని డీహెచ్ వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.