
- ఈసారి ఆసక్తి చూపించని అక్కడి వ్యాపారులు
- ఫీజు పెంచడంతోనూ తగ్గిన దరఖాస్తులు
- రూ.4 వేల కోట్ల ఆదాయ టార్గెట్ చేరుకునేందుకు
- ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు
- గడువు పొడిగింపుతోనైనా దరఖాస్తులు పెరిగేనా!
హైదరాబాద్, వెలుగు: ఏపీలో తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీ.. తెలంగాణలో వైన్స్ టెండర్లపై తీవ్ర ప్రభావం చూపింది. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించగా, ఈ నెల 18 నాటికి 89,344 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతంలో వైఎస్ జగన్ సర్కార్ హయాంలో ఏపీలో మద్యం ధరలు చాలా ఎక్కువగా ఉండడం, అక్కడ కొన్ని -బ్రాండ్ల మద్యం మాత్రమే అందుబాటులో ఉండటంతో.. ఏపీ సరిహద్దు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు భారీ సంఖ్యలో తెలంగాణ వైన్స్ టెండర్లలో పాల్గొనేవారు.
అందులో భాగంగా 2023లో తెలంగాణలో మద్యం దరఖాస్తుల సంఖ్య రికార్డు స్థాయిలో 1.32 లక్షలకు చేరింది. అయితే గతేడాది ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్త మద్యం పాలసీలో భాగంగా తెలంగాణ మాదిరి అప్లికేషన్లు స్వీకరించి, లాటరీ పద్ధతిలోనే దుకాణాలను కేటాయించింది. దీంతో పాటు మద్యం ధరలను తగ్గించి, ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లను ఏపీలో అందుబాటులోకి తీసుకురావడంతో పరిస్థితి తలకిందులైంది. ఏపీలో వ్యాపారం లాభదాయకంగా మారడంతో అక్కడి వ్యాపారులకు తెలంగాణలో వైన్స్ పెట్టాల్సిన ఆసక్తి, అవసరం తగ్గింది. దీంతో తెలంగాణలో వైన్స్లకు వచ్చే దరఖాస్తుల సంఖ్య భారీగా పడిపోయింది. ప్రధానంగా సరిహద్దు జిల్లాల నుంచి వచ్చే దరఖాస్తుల తగ్గినట్టు తెలుస్తున్నది.
పెరిగిన ఫీజు భారం..
ఏపీలో మద్యం ధరలు తగ్గడంతో తెలంగాణ సరిహద్దులోని ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. కొన్ని ప్రముఖ బ్రాండ్లు తెలంగాణ కంటే ఏపీలోనే తక్కువ ధరకు దొరుకుతుండటంతో.. సరిహద్దులోని తెలంగాణ వాసులు కూడా ఏపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణం లైసెన్స్ కోసం దరఖాస్తు ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. ఈ నాన్-రిఫండబుల్ ఫీజు పెంపు అనేది చిన్న వ్యాపారులపై అదనపు ఆర్థిక భారాన్ని మోపి, దరఖాస్తు చేయడాన్ని పరిమితం చేసింది. దీంతో ఈసారి దరఖాస్తులు లక్ష లోపే వచ్చాయి. కేవలం 89 వేల దరఖాస్తులే రావడంతో ఎక్సైజ్ శాఖ అనుకున్న రూ. 4 వేల కోట్ల ఆదాయ టార్గెట్‌ను చేరుకోవడంపై ఆందోళన నెలకొంది. దరఖాస్తు ఫీజు ద్వారా రూ.2,700 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ఎక్సైజ్ శాఖ దరఖాస్తుల గడువును ఈ నెల 23 వరకు పొడిగించింది. బీసీ బంద్, బ్యాంకుల సెలవులతో దరఖాస్తు చేసుకోలేకపోయిన ఔత్సాహికుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ తెలిపారు. ఈ గడువు పొడిగింపుతోనైనా ఇన్‌కమ్ టార్గెట్ చేరువయ్యేలా దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందేమో చూడాలి. కాగా, దుకాణాల కేటాయింపు కోసం ఈ నెల 27న కలెక్టర్ల సమక్షంలో డ్రా నిర్వహించనున్నారు.
పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ..
జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే పట్టణ, మెట్రోపాలిటన్ ప్రాంతాల్లోనే ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి. అత్యధికంగా శంషాబా ద్‌లో 8,110, సరూర్‌నగర్‌లో 7,595, మేడ్చల్‌లో 5,203 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 89,344 దరఖాస్తులు వస్తే.. కేవలం ఈ మూడు ప్రాంతాల నుంచే 20 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇక రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరా లు, ఉమ్మడి జిల్లాల కేంద్రాలైన మల్కాజ్‌గిరిలో 4,879, నల్గొండ 4,620, సంగారెడ్డి 4,190, ఖమ్మంలో 4,094 అప్లికేషన్లు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల వంటి ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో గతం కంటే దరఖాస్తులు తగ్గాయని అధికారులు పేర్కొన్నారు. తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన జిల్లాల్లో కొమ్రంభీమ్ ఆసిఫాబాద్ 622, వనపర్తి 676, ఆదిలాబాద్ 711, జోగులాంబ గద్వాల 723 ఉన్నాయి.