కొత్త మెడికల్ కాలేజీలు టెంపరరీ బిల్డింగుల్లోనే

కొత్త మెడికల్ కాలేజీలు టెంపరరీ బిల్డింగుల్లోనే
  • పర్మనెంట్ భవనాల నిర్మాణానికి టైమ్ సరిపోదన్న ఆర్ అండ్ బీ
  • కాలేజీలకు అనుబంధంగా ఆయా జిల్లాల హాస్పిటళ్లు
  • వాటిలో బెడ్ల సంఖ్య పెంపుపై ఆరోగ్యశాఖ కసరత్తు

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆరోగ్యశాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. వచ్చే ఏడాది కల్లా కాలేజీలు అందుబాటులోకి తేవాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వచ్చే ఏడాది కాలేజీలను ప్రారంభించాలంటే, పర్మిషన్ కోసం ఈ ఏడాది అక్టోబర్ లో నేషనల్ మెడికల్ కమిషన్‌‌‌‌ (ఎన్ఎంసీ)కు దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్‌‌/డిసెంబర్‌‌‌‌ లో ఎన్‌‌ఎంసీ ప్రతినిధులు వచ్చి కాలేజీ బిల్డింగ్, సౌలతులు, స్టాఫ్, అనుబంధ హాస్పిటళ్లు, అక్కడి సౌకర్యాలు పరిశీలించి మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇవ్వాలో? లేదో? నిర్ణయిస్తారు. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వానికి మరో 4 నెలల టైమ్ మాత్రమే ఉంది. ఇంత తక్కువ టైమ్ లో కాలేజీల అవసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో బిల్డింగులు నిర్మించడం సాధ్యం కాదని ఆర్‌‌‌‌ అండ్ బీ అధికారులు ఇటీవల ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ఫస్ట్ ఇయర్ క్లాసులు టెంపరరీ బిల్డింగుల్లో నిర్వహించాలని హెల్త్ డిపార్ట్‌‌మెంట్ నిర్ణయించింది. వాటి నిర్మాణానికి ఒకట్రెండు రోజుల్లోనే టెండర్లు పిలవనున్నట్టు ఆఫీసర్లు తెలిపారు.

జిల్లా ఆస్పత్రుల అభివృద్ధి
మెడికల్ కాలేజీకి పర్మిషన్‌‌ రావాలంటే, దానికి అనుబంధంగా కనీసం 330 బెడ్ల ఆస్పత్రి ఉండాలి. ప్రభుత్వం నాగర్ కర్నూల్, వనపర్తి, మంచిర్యాల, జగిత్యాల, సంగారెడ్డి, మహబూబాబాద్, కొత్తగూడెంలలో కొత్త కాలేజీలు ఏర్పాటు చేయనుంది. వీటిలో సంగారెడ్డి జిల్లా హాస్పిటల్‌‌లో మాత్రమే 330 బెడ్లు ఉన్నాయి. మిగిలిన హాస్పిటళ్లలో బెడ్ల సంఖ్య పెంపునకు ఆఫీసర్లు ప్రతిపాదనలు రూపొందించారు. కొత్త బెడ్లు, ఇతర పరికరాల కొనుగోలుకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. 

ఎయిమ్స్‌‌ తరహాలో..  
ప్రతిదీ రూల్స్‌‌ ప్రకారం ఉంటే తప్పా.. కొత్త కాలేజీలకు ఎన్‌‌ఎంసీ పర్మిషన్ ఇవ్వదు. ఒకేసారి 7 కాలేజీలు ఏర్పాటు చేస్తుండడం, తక్కువ టైమ్ ఉండడంతో పనుల పర్యవేక్షణ బాధ్యతలను ఇప్పటికే ఉన్న కాలేజీలకు అప్పగించాలని మెడికల్ ఆఫీసర్లు నిర్ణయించారు. ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్స్‌‌ ఏర్పాటు చేసే సమయంలో వాటికి ఇప్పటికే ఉన్న కాలేజీలను మెంటర్ ఇనిస్టిట్యూట్‌‌లుగా ఏర్పాటు చేస్తారు. కొత్త కాలేజీలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే వరకు మెంటర్ ఇనిస్టిట్యూట్‌‌ల స్టాఫ్, ఆఫీసర్లు సాయం చేస్తారు. ఇదే పద్ధతిని కొత్త కాలేజీల విషయంలో అనుసరించాలని అధికారులు నిర్ణయించారు. కొత్తగూడెం, మహబూబాబాద్ కాలేజీలకు సూర్యాపేట మెడికల్ కాలేజీని.. నాగర్‌‌‌‌కర్నూల్‌‌, వనపర్తి కాలేజీలకు మహబూబ్‌‌నగర్ మెడికల్ కాలేజీని మెంటర్ ఇనిస్టిట్యూట్‌‌లుగా నిర్ణయించారు. జగిత్యాల, సంగారెడ్డి కాలేజీలకు మెంటర్ ఇనిస్టిట్యూట్‌‌లను నిర్ణయించాల్సి ఉండగా.. మంచిర్యాల, రామగుండం కాలేజీలకు సిద్దిపేట కాలేజీని మెంటర్ ఇనిస్టిట్యూట్‌‌గా పెట్టే చాన్స్ ఉంది.

సింగరేణి రెడీ.. 
సింగరేణి ఆధ్వర్యంలో రామగుండంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయనున్నారు. దీనికి అనుబంధంగా గోదావరిఖనిలోని సర్కారు ఏరియా ఆస్పత్రిని చూపించాలని నిర్ణయించారు. అక్కడే సింగరేణి ఏరియా హాస్పిటల్ ఉన్నా, అది మెడికల్ కాలేజీకి సరిపోదని హెల్త్ ఆఫీసర్లు తేల్చారు. సర్కార్ దవాఖాననే సింగిరేణి కాలేజీ కోసం వాడుకోనున్నారు. సింగరేణి సంస్థకు మెడికల్ కాలేజీలను నిర్వహించిన అనుభవం లేకపోవడంతో..  కాలేజీ, ఆస్పత్రి నిర్వాహణ బాధ్యతలు ఆరోగ్యశాఖకే అప్పగించనున్నట్టు తెలుస్తోంది. సింగరేణి హాస్పిటళ్లలో కార్మికులు, ఉద్యోగులకే ట్రీట్‌‌మెంట్ ఇస్తారు. ఈ హాస్పిటల్‌‌లో ప్రజలకూ ట్రీట్‌‌మెంట్ వెసులుబాటు కల్పించనున్నారు. పల్మనాలజీ, ఆర్థోపెడిక్‌‌, సైకియాట్రి, న్యూరాలజీ డిపార్ట్‌‌మెంట్లలో ఎక్కువ బెడ్లు, ఎక్కువ మంది డాక్టర్లను నియమించాలని భావిస్తున్నారు.