గోమూత్రం సాక్షిగా మంత్రి ప్రమాణం

గోమూత్రం సాక్షిగా మంత్రి ప్రమాణం

ఓ మంత్రి ప్రమాణం.. 29 మందితో కర్నాటక కొత్త కేబినెట్ 

బెంగళూరు:  కర్నాటక కొత్త మంత్రులు ట్రెడిషన్ కు భిన్నంగా కొత్త పద్ధతిలో ప్రమాణ స్వీకారం చేశారు. దేవుళ్లు, గోమూత్రం, రైతులు, నాయకుల సాక్షిగా అంటూ.. ప్రమాణం చేశారు. కర్నాటక కొత్త సీఎం బసవరాజ్ బొమ్మై 29 మంది మంత్రులతో కేబినెట్ ను ఏర్పాటు చేశారు. బుధవారం మధ్యాహ్నం బెంగళూర్ లోని రాజ్ భవన్ వద్ద గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ సమక్షంలో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ నుంచి బీజేపీలో చేరిన ఆనంద్ సింగ్.. విజయనగర విరూపాక్ష, థాయీ భువనేశ్వరి (నదీ దేవత) సాక్షిగా ప్రమాణం చేశారు. ప్రభు చౌహాన్.. గోమూత్రం సాక్షిగా, లింగాయత్‌‌ నేత మురుగేశ్‌‌ నిరానీ.. దేవుళ్లు, రైతుల సాక్షిగా ప్రమాణం చేశారు. కర్నాటక నేతలు ఇలా ట్రెడిషన్ కు భిన్నంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు తమిళనాడు సీఎంగా స్టాలిన్ మనస్సాక్షిగా, కేరళ సీఎం విజయన్, ఆయన కేబినెట్ మంత్రులు రాజ్యాంగం సాక్షిగా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేబినెట్ లోని మంత్రి గోపాల్ రాయ్ స్వాతంత్ర్య సమరయోధుల సాక్షిగా ప్రమాణం చేశారు.   
23 మంది పాతవాళ్లే.. 
గత సీఎం యడియూరప్ప కేబినెట్ లో మంత్రులుగా ఉన్న 23 మంది నేతలకు బొమ్మై కేబినెట్ లో మళ్లీ చాన్స్ దక్కింది. వీరితో పాటు ఆరుగురు కొత్త వాళ్లకు బొమ్మై అవకాశం ఇచ్చారు. అయితే యడియూరప్ప కొడుకు, బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బీవై విజయేంద్రకు మంత్రి పదవి దక్కలేదు.  యడియూరప్ప కేబినెట్ లో ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉండగా, తాజాగా ఈ పదవులనూ బొమ్మై పక్కన పెట్టారు. బీజేపీ హైకమాండ్ నిర్ణయం మేరకు యడియూరప్ప రిజైన్ చేయగా, కొత్త సీఎంగా బొమ్మై జులై 28న ప్రమాణం చేశారు. . కేబినెట్ విస్తరణకు ముందు బొమ్మై మీడియాతో మాట్లాడారు. హైకమాండ్ ఆదేశాల మేరకు.. తన కేబినెట్ లోకి 29 మందిని మంత్రులుగా తీసుకుంటున్నానని, డిప్యూటీ సీఎంలను నియమించడం లేదని చెప్పారు. అలాగే బీవై విజయేంద్రను కూడా కేబినెట్ లోకి తీసుకోవడంలేదని వెల్లడించారు. 
కులాలవారీగా పదవులు.. 
కొత్త కేబినెట్ లో లింగాయత్ లకు 8, వొక్కలిగలకు 7, ఓబీసీలకు 7, ఎస్సీలకు 3, బ్రాహ్మణులకు 2, ఎస్టీలకు 1, రెడ్డీలకు 1, మహిళలకు 1 చొప్పున మంత్రి పదవులు దక్కాయి. 2019 ఎన్నికల్లో జేడీయూ నుంచి బీజేపీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చిన హామీ ప్రకారం, కొత్త కేబినెట్ లోనూ మంత్రి పదవులు కట్టబెట్టారు.