
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం గురువారం నుంచి అమలులోకి రానుంది. మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ‘ధరణి’ పోర్టల్‌ను ప్రారంభించగానే ఇది మొదలవుతుంది. కొత్త రెవెన్యూ పాలన కోసం రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందిన ‘ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ యాక్ట్ –2020’ గురువారం నుంచి అమల్లోకి వస్తుందని సర్కారు బుధవారం ఉత్తర్వులిచ్చింది.
156 ఏండ్ల క్రితమే రెవెన్యూ బోర్డు..
మాన్యువల్ రికార్డులు, పహాణీల జమానా నుంచి డిజిటల్ రికార్డుల వరకు సాగిన రెవెన్యూ విభాగానికి తెలంగాణలో శతాబ్దంన్నర చరిత్ర ఉంది. నాలుగో నిజాం నాసిరుద్దౌలా ఆస్థానంలో దివాన్ గా పనిచేసిన సాలార్ జంగ్ రెవెన్యూ శాఖలో తీసుకొచ్చిన సంస్కరణల్లో భాగంగా 1864లో తొలిసారిగా రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేశారు.
శిస్తు వసూలుకు, సివిల్, క్రిమినల్ కేసుల విచారణకు అప్పట్లోనే ఆయన తాలుకాకో తహసీల్దార్ ను నియమించారు. తహసీల్దార్‌కు సహాయకుడిగా గ్రామస్థాయిలో భూపరిపాలనను పట్వారీలు చూసేవారు. తహసీల్దార్, పట్వారీ మధ్య అధికారిగా గిర్దావర్ ఉండేవారు. ఇప్పటి వరకు స్వల్ప మార్పులు, చేర్పులతో ఇదే వ్యవస్థ కొనసాగుతూ వచ్చింది. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక పట్వారీ వ్యవస్థను రద్దు చేసినప్పటికీ, మళ్లీ వైఎస్ హయాంలో 2004లో అవే అధికారాలతో వీఆర్వోలను అపాయింట్ చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడంతోపాటు కొత్త రెవెన్యూ శాఖలో మార్పులు చేస్తూ కొత్త పాస్ బుక్స్ చట్టాన్ని ప్రభుత్వం తెచ్చింది. ఈ చట్టం ప్రకారం తహసీల్దార్లు సుప్రీం కాగా, ఆర్డీవోలు, అడిషనల్ కలెక్టర్లు నామమాత్రంగా మారనున్నారు.
మాన్యువల్ నుంచి డిజిటల్ వైపు..
దేశవ్యాప్తంగా భూరికార్డులను దశాబ్దాలుగా పుస్తకాల రూపంలోనే నిర్వహిస్తున్నారు. వీటిలో చాలా వరకు చిరిగిపోయే దశలో ఉన్నాయి. ఈ క్రమంలోనే 2008లో నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడ్రనైజేషన్ ప్రోగ్రామ్‌ను అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రారంభించింది. రికార్డులను కంప్యూటరీకరించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్‌ను డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడ్రనైజేషన్ ప్రోగ్రామ్ 2.0గా మార్చింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో భూరికార్డుల డిజిటలైజేషన్ 90 శాతంపైగా పూర్తయింది. ఉమ్మడి ఏపీలోనే మన దగ్గర రికార్డుల కంప్యూటరీకరణ పూర్తయినప్పటికీ.. రాష్ట్రంలో 2017లో ప్రారంభించిన భూరికార్డుల ప్రక్షాళన ద్వారా కొత్త పాస్ బుక్స్ ఇచ్చారు. భూ యజమానుల ఆధార్ నంబర్, బయోమెట్రిక్ తీసుకున్నారు. ధరణి ద్వారా ఒకరి భూమిని మరొకరికి మార్చాలంటే భూమి యజమాని బయోమెట్రిక్, ఆయన సమ్మతి తప్పనిసరి కావడంతో తప్పుడు పద్ధతిలో పాసుబుక్స్ జారీ అయ్యే అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.
నిమిషాల్లో మ్యుటేషన్
పట్టాదారు పాస్ పుస్తకాల జారీలో రాష్ట్ర ప్రభుత్వం మార్పును తీసుకొచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1971లో తీసుకొచ్చిన పట్టాదార్ పాస్‌బుక్ యాక్ట్ ప్రకారం ఒకరి నుంచి మరొకరి పేరిట పట్టాదారు పాస్ బుక్ జారీ చేయాలంటే కనీసం మూడు నెలలు పట్టేది. భూవివాదం లేదని తేల్చేందుకు ఈ 90 రోజుల సమయాన్ని నోటీస్ పీరియడ్‌గా చట్టంలో పేర్కొన్నారు. 2017లో భూరికార్డుల ప్రక్షాళన చేపట్టడానికి ముందు సర్కార్ ఈ నోటీస్ పిరియడ్ ను వారం రోజులకు కుదించింది. తాజా చట్టంలో దానికి ఫుల్స్టాప్ పెట్టి ధరణి ద్వారా నిమిషాల్లో మ్యుటేషన్ అయ్యేలా మార్పు చేసింది.
జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా తహసీల్దార్లు
జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా తహసీల్దార్లను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 570 తహసీల్దార్ ఆఫీసులు.. ఇక జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులుగా పనిచేయనున్నాయి. వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ ఇక నుంచి తహసీల్దార్లే చేయనున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆటో మ్యుటేషన్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మున్సిపాలిటీల్లో వెయ్యి, కార్పొరేషన్లలో 3 వేలు లేదా రిజిస్ట్రేషన్ల చార్జీ 0.1 శాతం.. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఉంటే దాన్ని మ్యుటేషన్ చార్జీగా వసూలు చేస్తారని పేర్కొంది.
రికార్డుల భద్రతపై అనుమానాలు
భూరికార్డులను డిజిటలైజేషన్ చేసినప్పటికీ ప్రజలను ట్యాంపరింగ్ భయం వెంటాడుతున్నది. పోర్టల్ ను హ్యాక్ చేసి డేటాను దొంగిలించడమో లేదా రికార్డులను మార్చేయడమో చేస్తే ఎట్లని కొన్నాళ్లుగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మాత్రం వెబ్ సైట్ నిర్వహణకు బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడుతున్నామని, హ్యాక్ అయ్యే సమస్యే లేదని చెబుతున్నది. డేటా రక్షణకు దేశంలోని మరో మూడు చోట్ల సర్వర్లను పెడుతున్నట్లు ప్రకటించింది.