స్పీడందుకున్న ఇందిరమ్మ ఇండ్లు

స్పీడందుకున్న ఇందిరమ్మ ఇండ్లు
  • నిర్మాణ దశల వారీగా బిల్లుల చెల్లింపు  
  • క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్న అధికారులు

మెదక్/శివ్వంపేట, వెలుగు: జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. మొదటి దశలో ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించగా జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 21 మండలాలకు మొత్తం 9,181 ఇళ్లు మంజూరయ్యాయి. ఈ మేరకు కలెక్టర్ రాహుల్ రాజ్ హౌజింగ్​డిపార్ట్​మెంట్​అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్ర స్థాయిలో ఇళ్ల నిర్మాణం వేగవంతంగా జరిగేలా చూస్తున్నారు. 

ఇసుక బజార్ ఏర్పాటు చేసి ఉచితంగా ఇసుకను అందిస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద  జాబ్ కార్డు ఉన్న లబ్ధిదారులకు 90 పని దినాలు కల్పించడం, స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలకు ఆర్థిక సాయం చేయడం వల్ల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది. కొన్ని చోట్ల లబ్ధిదారులు ప్రత్యేక శ్రద్ధ చూపి ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్నారు. నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని శివ్వంపేట మండలంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు కూడా జరిగాయి. 

రూ.6.15 కోట్ల చెల్లింపు

అధికారులు ఇందిరమ్మ ఇళ్లు పూర్తి అయిన దశను బట్టి బిల్లులను చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు 552 మంది లబ్ధిదారులకు  రూ.6.15 కోట్ల బిల్ పేమెంట్ చేశారు. నియోజక వర్గాల వారీగా మెదక్ సెగ్మెంట్ లో 206 మంది లబ్ధిదారులకు రూ.2.26 కోట్లు, నర్సాపూర్ సెగ్మెంట్ లో 163 మంది లబ్ధిదారులకు రూ.1.82 కోట్లు, దుబ్బాక సెగ్మెంట్ లో 50 మంది లబ్ధిదారులకు రూ.56 లక్షలు, అందోల్ సెగ్మెంట్ లో 83 మంది లబ్ధిదారులకు రూ.93.80 లక్షలు, గజ్వేల్ సెగ్మెంట్ లో 18 మంది లబ్ధిదారులకు రూ.19.20 లక్షలు, నారాయణఖేడ్  సెగ్మెంట్ లో 32 మంది లబ్ధిదారులకు రూ.37.60 పేమెంట్ చేశారు.  

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఇలా

మంజూరు        9,181 

మార్కవుట్            5,807 

బేస్మెంట్ లెవల్   2,565

గోడల వరకు          810

స్లాబ్ లెవల్            487 

పూర్తి                         11