ఎంత ట్రాఫిక్‌‌కు.. అంత కరెంటు.. ఐడియా అదిరిందిగా!

ఎంత ట్రాఫిక్‌‌కు.. అంత కరెంటు.. ఐడియా అదిరిందిగా!

న్యూఢిల్లీ: ఎక్కడ చూసినా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ఇంకోపక్క కరెంటు కోతలు.. రేట్ల వాతలు ఎక్కువైతున్నయ్. మరి విపరీతంగా పెరిగిన ట్రాఫిక్ ను వాడుకుని.. పిరం అయిపోయిన కరెంట్ ను చౌకగా తయారు చేస్కుంటే ఎట్లుంటది? ట్రాఫిక్‌‌కు, కరెంటుకు లింకేంటని అనుకోకండి.. ట్రాఫిక్‌‌లో రోడ్డుపై కరెంటు ఉత్పత్తి చేసే కొత్త టెక్నాలజీ రెడీ అయితున్నది. రోడ్డుపై ఎన్ని ఎక్కువ బండ్లు తిరిగితే అంత ఎక్కువ పవర్ జనరేట్ అయితదన్నమాట. 

టర్కీలో టెస్ట్ చేస్తున్రు 

రోడ్డు మధ్యలో ఓ చిన్న సైజు టర్బైన్.. దాని పక్కగా బండ్లు వెళ్లినప్పుడల్లా టర్బైన్ గాలికి గిర్రున తిరుగుతుంది. అది తిరిగినప్పుడల్లా కరెంటు ఉత్పత్తి అవుతుంది. గాలి ద్వారా కరెంటు ఉత్పత్తి చేసే కాన్సెప్ట్ పాతదే అయినా.. రోడ్లపైన, అది కూడా ట్రాఫిక్‌‌లో ఇలా చిన్న టర్బైన్లతో తయారు చేయడమంటే మంచి ఐడియానే కదా! ఈ పోర్టబుల్ టర్బైన్లు.. గంటకు ఒక కిలోవాట్ పవర్‌‌‌‌ను జనరేట్ చేస్తయ్. అంతేనా.. గాలిలో కార్బన్‌‌ డయాక్సైడ్ స్థాయిలను కూడా లెక్కిస్తయ్. భూకంపాలను గుర్తించే టెక్నాలజీ కూడా వీటిలో ఉందట. ప్రస్తుతం టర్కీలో ఈ ప్రాజెక్టును టెస్టు చేస్తున్నారు. 
ఆనంద్ మహీంద్రా ట్వీట్ 
కొంచెం కొత్తగా ఏది కనిపించినా వెంటనే షేర్ చేస్తారు కదా మన ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా. ‘వాటెన్ ఐడియా’ అనిపించి దీన్ని కూడా బుధవారం ట్వీటేశారు. ‘‘ఈ టర్బైన్లను ఇస్తాంబుల్ టెక్నికల్ యూనివర్సిటీ తయారు చేసింది. ట్రాఫిక్‌‌లో బండ్లు వెళ్తున్నప్పుడు వచ్చే గాలి ద్వారా కరెంటును ఉత్పత్తి చేస్తుంది. ఇండియాలోని ట్రాఫిక్‌‌లో వీటిని ఏర్పాటు చేస్తే.. పవన విద్యుత్ విషయంలో గ్లోబల్ పవర్‌‌‌‌గా ఇండియా అవతరిస్తుంది. మనం కూడా వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉందా నితిన్ గడ్కరీ జీ?’’ అంటూ పేర్కొన్నారు. అంతే ఆయన ట్వీట్ కాస్తా వైరలైంది. ‘యూనిలాడ్ టెక్‌‌’ అనే పేజీలో ముందుగా ఈ పోర్టబుల్ టర్బైన్ల గురించి పోస్టు చేయగా.. 1.4 మిలియన్ల మంది చూశారు. కొంత మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇండియాలో ఏర్పాటు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫుట్‌‌పాత్‌‌లకే చోటు లేని చోట వీటి ఏర్పాటు ఎలా సాధ్యమని మరికొందరు ప్రశ్నించారు.

మనోళ్లు చేస్తే గుర్తించరా?

ఇలాంటి టర్బైన్లను గతంలోనే ఇండియన్ ఇన్నోవేటర్లు తయారు చేశారంటూ విశాల్ అనే నెటిజన్ ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా, నితిన్ గడ్కరీలను దానికి ట్యాగ్ చేశారు. ‘‘డి. ప్రశాంత్ అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ 2017లోనే వర్టికల్ యునైటెడ్ టర్బైన్స్ పేరుతో ఇలాంటిదాన్ని తయారు చేశారు. కానీ దాన్ని ఎందుకు అమలుచేయలేదో తెలియదు. బహుశా.. పాశ్చాత్య దేశాలు ముందుగా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తే తప్ప మనం ఉపయోగించమేమో..” అని విమర్శించారు. ప్రశాంత్ తన టర్బైన్ ను ప్రదర్శిస్తూ యూట్యూబ్ లో పెట్టిన వీడియో లింక్ ను కూడా ట్వీట్ కు జోడించారు.