Cyclone Gabriel: ఎమర్జెన్సీ ప్రకటించిన న్యూజిలాండ్‌

Cyclone Gabriel: ఎమర్జెన్సీ ప్రకటించిన న్యూజిలాండ్‌

న్యూజిలాండ్‌ను గాబ్రియెల్ తుఫాను వణికిస్తోంది. గత మూడు రోజులుగా ఉత్తర దీవిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కారణంగా ముంచెత్తిన వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. దీంతో న్యూజిలాండ్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించింది.

ఉష్ణమండల తుఫాను నార్త్ ఐలాండ్‌ను తాకడంతో న్యూజిలాండ్‌ ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.  నార్త్‌ ఐలాండ్‌, ఆక్లాండ్‌లో గాబ్రియెల్‌ తుఫాన్‌ బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలకు తోడు భీకర గాలులకు భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలమట్టమయ్యాయి. వేలాది ఇండ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

మరోవైపు రికార్డుస్థాయిలో కురుస్తున్న వర్షాలు, వరదలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద ఉధృతికి ఓ బ్రిడ్జి కొట్టుకుపోయింది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వరదల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. న్యూజిలాండ్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించడం ఇది మూడోసారి. గతంలో 2019 క్రైస్ట్‌చర్చ్ ఉగ్ర దాడులు, 2020లో కొవిడ్‌ మహమ్మారి కారణంగా ఎమర్జెన్సీని విధించింది. తాజాగా గాబ్రియెల్ తుఫాన్‌ నేపథ్యంలో ఎమర్జెన్సీని ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.