ఐదేండ్లలో 12 శాతం పెరిగిన కేన్సర్ కేసులు

ఐదేండ్లలో 12 శాతం పెరిగిన కేన్సర్ కేసులు

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో కేన్సర్‌‌ బాధితుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. గడిచిన ఐదేండ్లలో రాష్ట్రంలో 12 శాతం మేర కేసులు పెరిగాయి. 2016లో 43,129 కేసులు నమోదైతే, 2021లో 48,230 మంది పేషెంట్లను గుర్తించారు. ఇక లెక్కలోకి రాని కేసులు ఇంతకు డబుల్ ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. అవగాహన లోపం వల్ల చాలా మంది హాస్పిటల్స్‌‌కు రావడం లేదంటున్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా నోటి కేన్సర్లు‌‌, బ్రెస్ట్‌‌, సర్వికల్ కేన్సర్లు ఉంటున్నాయి. తర్వాత లంగ్, బ్లడ్ సంబంధిత కేసులు ఉంటున్నాయి. మన దగ్గర ఉన్న గుట్కా, పాన్‌‌ మసాలా వంటి అలవాట్ల వల్లే రాష్ట్రంలో ఓరల్ కేన్సర్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. ప్రతి పది మంది ఓరల్ కేన్సర్‌‌‌‌ బాధితుల్లో.. 8 మందికి గుట్కా, పాన్ తినే అలవాటు ఉంటోందని ఎంఎన్‌‌జే కేన్సర్ హాస్పిటల్ డైరెక్టర్, డాక్టర్ జయలత వివరించారు. కేన్సర్ బాధితుల్లో 30% మంది మాత్రమే ఎర్లీ స్టేజ్‌‌లో హాస్పిటల్‌‌కు వస్తుండగా, 70% మంది రోగం ముదిరిన తర్వాతే వస్తున్నారు. ఎర్లీ స్టేజ్‌‌లో వచ్చిన వాళ్లలో 90% మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుంటున్నారని ఆమె తెలిపారు. రోగం ముదిరిన తర్వాత వచ్చే వారిలో ఐదేండ్ల లోపలే సగం మంది ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు.

గ్రామీణ ప్రాంతాల్లో అందుకే తక్కువ!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కేన్సర్  కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇక్కడ ఎక్కువ కేసులు రావడానికి పొల్యూషన్, లైఫ్‌‌ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్‌‌ తదితరాలు కారణమని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే సిటీ జనాల్లో కేన్సర్‌‌‌‌ పట్ల అవగాహన ఉండటం,  సమస్య వచ్చినప్పుడు హాస్పిటళ్లకు వెళ్లి టెస్టులు చేయించుకుంటున్నారు. దీంతో ఇక్కడ ఎక్కువ సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కేన్సర్ లక్షణాల పట్ల అవగాహన లేకపోవడం, హైదరాబాద్ దాకా పేషెంట్లు రాకపోవడం వంటి కారణాల వల్ల జిల్లాల్లో తక్కువ కేసులు నమోదు అవుతుండొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

4 కోట్ల మందికి ఒకటే దవాఖాన

రాష్ట్రంలో కేన్సర్ కేసులు పెరుగుతున్నా.. ప్రభుత్వ కేన్సర్ హాస్పిటళ్ల సంఖ్య మాత్రం పెరగడం లేదు. తొలి ప్రధాని జవహర్‌‌‌‌లాల్ నెహ్రూ 1955లో ప్రారంభించిన ఎంఎన్‌‌జే కేన్సర్ హాస్పిటల్ ఒక్కటే కేన్సర్ రోగులకు ఇప్పటికీ అండగా నిలుస్తోంది. ఇది తప్ప గడిచిన 67 ఏండ్లలో మరో కేన్సర్ హాస్పిటల్‌‌ను మన పాలకులు ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలోని 4 కోట్ల మందికి ఈ ఆస్పత్రే దిక్కు. అయినా అందులో 450 బెడ్లు మాత్రమే ఉన్నాయి. పేషెంట్ల రద్దీని తట్టుకునేందుకు హాస్పిటల్‌‌ కారిడార్లు, హాళ్లలోనూ బెడ్లు వేసి మేనేజ్ చేస్తున్నారు. కానీ సరిపోకపోవడంతో డే కేర్ సిస్టమ్‌‌ను తీసుకొచ్చారు. కీమోథెరపీ చేసిన పేషెంట్లను ఒకట్రెండు గంటలు అబ్జర్వేషన్‌‌లో ఉంచి, అదే రోజు సాయంత్రానికల్లా డిశ్చార్జ్ చేస్తున్నారు. తెలంగాణతోపాటు సరిహద్దు రాష్ట్రాలైన ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, చత్తీస్‌‌గఢ్‌‌ నుంచి కూడా ఇక్కడికి పేషెంట్లు వస్తున్నారు. రోజూ 550 నుంచి ఆరొందల దాకా ఓపీ కేసులు నమోదవుతున్నాయి.

రీజనల్ సెంటర్లు ఏడపాయె?

హైదరాబాద్, రంగారెడ్డి మినహా రాష్ర్టంలోని అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కేన్సర్‌‌‌‌ సెంటర్లు పెట్టబోతున్నట్టు మూడేండ్ల కిందటే సర్కార్ ప్రకటించింది. ఈ సెంటర్ల నిర్వహణకు నేషనల్ హెల్త్ మిషన్‌‌ కింద కేంద్రం నిధులు కూడా కేటాయించింది. కేన్సర్ లక్షణాలను గుర్తించడం, స్ర్కీనింగ్ చేయడం, ఆయా జిల్లాల్లో ఉన్న కేన్సర్ పేషెంట్లకు ఎంఎన్‌‌జే హాస్పిటల్‌‌ డాక్టర్లు సూచించిన ట్రీట్‌‌మెంట్‌‌ను అందించడం వంటివి ఈ సెంటర్ల లక్ష్యం. ఇందుకోసం ఆయా జిల్లా హాస్పిటళ్లలో పనిచేసే డాక్టర్లు, సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఒక్క జిల్లాలోనూ సెంటర్‌‌‌‌ను ప్రారంభించలేకపోయారు.
ప్రైవేటుకే 40 వేల మంది
రాష్ట్రంలో గతేడాది 48,230 కేసులు నమోదవగా, ఇందులో ఎంఎన్‌‌జే హాస్పిటల్‌‌కు 8,670 మంది వస్తే, సుమారు 40 వేల మంది ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్లారు. కేన్సర్‌‌‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ రూ.లక్షల్లో వ్యవహారమైనప్పటికీ ఎంఎన్‌‌జేలో రద్దీ, బెడ్ల దొరక్కపోవడం వంటి కారణాల వల్ల రోగులు ప్రైవేటు హాస్పిటళ్లను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు హాస్పిటళ్లు పేషెంట్‌‌తో ముందే ప్యాకేజీ మాట్లాడుకుని అందులో నుంచి ఆరోగ్యశ్రీ కింద వచ్చే మొత్తాన్ని తీసేసి, మిగిలిన మొత్తాన్ని పేషెంట్‌‌తో కట్టించుకుంటున్నారు. 

రెండేళ్లకోసారి టెస్టులు చేసుకోవాలె

కేన్సర్ విషయంలో ప్రజల్లో అవగాహన తక్కువగా ఉంది. 65 నుంచి 70 శాతం మంది పేషెంట్లు వ్యాధి ముదిరిన తర్వాతే హాస్పిటల్‌‌కు వస్తున్నారు. వీరిలో సగం మంది మొదటి ఐదేండ్లలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలను ఆపాలంటే కేన్సర్ స్ర్కీనింగ్‌‌పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. 35 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరు కనీసం రెండేండ్లకొసారి కేన్సర్ స్ర్కీనింగ్ చేయించుకోవాలి.  
- డాక్టర్ జయలత, డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 
ఎంఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జే హాస్పిటల్