కరోనా భయం, ముందస్తు మొక్కులే కారణం

కరోనా భయం, ముందస్తు మొక్కులే కారణం

హైదరాబాద్, వెలుగు: మేడారం జాతరకు ఈసారి వచ్చిన భక్తుల సంఖ్యను గతంతో పోలిస్తే తగ్గింది. కరోనా భయంతో పాటు నెల రోజులుగా ముందస్తు మొక్కులతో జాతరకు వచ్చే జనం సంఖ్య తగ్గినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సుల ద్వారా వచ్చిన ప్రయాణికుల సంఖ్య గత ఎనిమిది జాతరలతో పోలిస్తే సగానికి సగం పడిపోయింది. ప్రతిసారి మూడు నుంచి నాలుగు లక్షల ప్రైవేట్ వెహికిల్స్ వచ్చేవని.. ఈ సారి ఆ సంఖ్య లక్షకు మించలేదని ఆఫీసర్లు చెప్పారు. లిక్కర్ సేల్స్ కూడా ఈసారి రూ.35 లక్షలు తగ్గింది. బెల్లం, కొబ్బరికాయలు, ఇతర చిరువ్యాపారాలు కూడా డల్ అయినట్లు వ్యాపారులు తెలిపారు.  

21 లక్షల మంది వస్తరనుకుంటే.. 

ఆర్టీసీ ఈ నెల 11 నుంచి 20 వరకు వందకుపైగా సెంటర్ల ద్వారా 3,845 ప్రత్యేక బస్సులు నడిపింది. 2008లో 12 లక్షల మంది, 2010, 2012, 2014, 2016 జాతరల్లో 14 లక్షల మంది, 2018లో 18 లక్షల మంది, 2020లో 19.80 లక్షల మంది జర్నీ చేశారు. ఈ సారి ఏకంగా 21 లక్షల మందిని తరలించాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంటే.. కేవలం 7 లక్షల మందే ప్రయాణించారు. 14 ఏండ్లలో ఇంత తక్కువ సంఖ్యలో భక్తులు ఎప్పుడూ రాలేదని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. 

లక్షకు మించలే.. 

ట్రాక్టర్లు, ట్రాలీలు, ఆటోలు, కార్లు, డీసీఎం తదితర ప్రైవేట్ వెహికల్స్​ రాక కూడా ఈ సారి భారీగా తగ్గింది. ప్రతి జాతరకు సుమారు 3 నుంచి 4 లక్షల వరకు వాహనాలు వచ్చేవి. ఈ సారి కూడా అదే సంఖ్యలో వాహనాలు వస్తాయని భావించి మేడారానికి ఐదు నుంచి ఏడు కిలోమీటర్ల అవతలే  పార్కింగ్ ఏర్పాటు చేశారు. కానీ ఈ సారి ఈ సంఖ్య లక్షకు మించలేదు.  

మందు కిక్కు తగ్గింది

జాతరకు వచ్చే భక్తుల్లో చాలా మంది లిక్కర్ తీసుకోవడం సాధారణ విషయం. ఊర్ల నుంచి తెచ్చుకునేవాళ్లు కొంతమంది ఉన్నా, మేడారంలో కొనేవాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. ఈ సారి ఎక్సైజ్ శాఖ 22 షాపులు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 2,888 ఐఎంఎల్ కేసుల మద్యం, 8,629 కేసుల బీర్లు అమ్మగా రూ.3,35,37,976  ఆదాయం వచ్చింది. 2020 జాతరలో రూ.3 కోట్ల 65 లక్షల విలువైన లిక్కర్ సేల్స్ జరగ్గా ఈసారి రూ.35 లక్షలు తగ్గింది. భక్తుల రాక తగ్గడం వల్లే లిక్కర్ సేల్స్ పై ప్రభావం చూపిందని ఎక్సైజ్ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.