
60 ఏండ్లు పైబడినోళ్ల జనాభా 34.6 కోట్లకు చేరొచ్చు
వృద్ధ మహిళల్లో ఎక్కువ మంది ఒంటరై.. పేదరికంలో మగ్గే ప్రమాదం
2050 నాటికి దేశంలో 50% ప్రాంతాలు పట్టణాలవుతయ్
పీటీఐ ఇంటర్వ్యూలో యూఎన్ఎఫ్ పీఏ ఇండియా చీఫ్ ఆండ్రియా వోజ్నర్
న్యూఢిల్లీ : ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా నిలిచిన ఇండియాలో మరో 26 ఏండ్లలో వృద్ధుల సంఖ్య భారీగా పెరగనుందట. అప్పుడు వృద్ధుల్లో ప్రధానంగా మహిళల్లో ఎక్కువ మంది ఒంటరివారుగా మారి.. పేదరికంలో మగ్గిపోయే ప్రమాదం ఉందట. అందుకే రేపటి వృద్ధులను కాపాడుకోవడం కోసం ఇప్పటినుంచే ఆరోగ్యం, ఇండ్లు, పెన్షన్ల వంటి సౌలతులు పెంచే దిశగా చర్యలు చేపట్టాలని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్ పీఏ) ఇండియా చీఫ్ ఆండ్రియా వోజ్నర్ సూచిస్తున్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం(జులై 11) కార్యక్రమాల నేపథ్యంలో ఇటీవల ఆమె ‘పీటీఐ’ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రస్తుతం ఇండియా జనాభా 144 కోట్లుగా ఉండగా.. 2050 నాటికి 170 కోట్లకు చేరొచ్చని ఇటీవలే పలు నివేదికలు వెల్లడించాయి. ప్రస్తుతానికి జనాభాలో యువత సంఖ్య భారీగా ఉన్నందున ఇది ‘యంగ్ ఇండియా’ అంటూ పలువురు అభివర్ణిస్తున్నారు. కానీ 2050 నాటికి దేశంలో 60 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నోళ్ల సంఖ్య ఏకంగా 34.6 కోట్లకు చేరొచ్చని ఆండ్రియా వోజ్నర్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. రేపటి వృద్ధుల్లో ఎక్కువ మంది మహిళలు ఒంటరులై, పేదరికంలో మగ్గిపోయే ప్రమాదం ఉందని, అందుకే వారి సంక్షేమం కోసం ముందస్తు చర్యలు అవసరమన్నారు.
50 నాటికి దేశంలో సగం పట్టణాలే..
భారత్ లో 2050 నాటికి 50 శాతం ప్రాంతాలు పట్టణాలుగా మారిపోయే అవకాశాలు ఉన్నాయని ఆండ్రియా వోజ్నర్ చెప్పారు. స్మార్ట్ సిటీలు, మంచి మౌలిక వసతులు, అందరికీ అందుబాటులో ఇండ్లు, స్లమ్ ఏరియాలు పెరగకుండా జాగ్రత్తలు, ఎయిర్ పొల్యూషన్, పర్యావరణ సమస్యల నివారణ వంటివి అప్పుడు కీలకం అవుతాయన్నారు. పట్టణ ప్రణాళికలలో ప్రధానంగా మహిళల భద్రత, అవసరాలు, విద్య, వైద్యం, ఉద్యోగాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలన్నారు. ‘‘ప్రస్తుతం భారత్ లో 10 నుంచి 19 ఏండ్ల మధ్య ఉన్నవారి సంఖ్య 25.2 కోట్ల దాకా ఉంది. అందుకే ఆరోగ్యం, విద్య, జాబ్ ట్రెయినింగ్, ఉద్యోగాల సృష్టి, లింగ సమానత్వం వంటి వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చర్యలు చేపడితేనే ఈ యువతరం రేపు దేశ సుస్థిర అభివృద్ధికి దోహదపడతారు” అని ఆమె చెప్పారు.
డెలివరీ టైంలో భర్తనూ అనుమతించాలె..
ఫ్యామిలీ ప్లానింగ్ 2030 కార్యక్రమం ప్రకారం.. దేశంలో కుటుంబ నియంత్రణలో కొత్త పద్ధతులు, వనరులను విస్తృతంగా అందుబాటులోకి తేవాల్సిన అవసరం కూడా ఉందని ఆండ్రియా సూచించారు. ఇద్దరు పిల్లల మధ్య కనీసం 24 నెలల విరామం ఇచ్చినట్లయితే తల్లి ఆరోగ్యం బాగుంటుందని, అలాగే కుటుంబ బంధాలు కూడా బలపడతాయన్నారు. యూఎన్ఎఫ్ పీఏ ఆధ్వర్యంలో 2023 నుంచి 47 మంది నర్సింగ్ ఆఫీసర్లకు ట్రెయినింగ్ ఇచ్చామని, వారు 5 వేలకు పైగా ప్రెగ్నెంట్ మహిళలకు అవగాహన కల్పించడంతోపాటు 550 నార్మల్ డెలివరీలు అయ్యేలా సహకారం అందించారని వెల్లడించారు. ప్రసవాల సమయంలో భర్తలను కూడా అనుమతించినట్టయితే సంబంధిత మహిళలకు మనోధైర్యం పెరుగుతుందని, కుటుంబ బంధాలు బలపడేందుకూ దోహదం చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.