పల్లెల్లో సదువు రానోళ్ల సంఖ్య 11.79 లక్షలు

పల్లెల్లో సదువు రానోళ్ల సంఖ్య 11.79 లక్షలు
  • పల్లె ప్రగతిలో తేలిన తాజా లెక్క
  • 12,749 గ్రామాల్లో ముగిసిన సర్వే
  • చదువు రానోళ్లలో 65% మంది మహిళలే
  • 12న ప్రభుత్వానికి నివేదిక

హైదరాబాద్​, వెలుగు: పల్లెల్లో చదువురానోళ్ల లెక్కింపు దాదాపు పూర్తయింది. రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీల్లో 2.04 కోట్ల జనాభా ఉండగా, అందులో 5.7 శాతం మందికి చదువు రానట్టు పల్లె ప్రగతి సర్వేలో తేలింది. 18 ఏళ్లపైబడిన 11,79,867 మంది నిరక్షరాస్యులు ఉన్నట్టు తేలింది. ‘ఈచ్​ వన్​.. టీచ్​ వన్​’ కార్యక్రమం ద్వారా చదువురాని వృద్ధులకు చదువు నేర్పించాలని కొత్త సంవత్సరం సందర్భంగా సీఎం కేసీఆర్​ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పంచాయతీల సర్పంచ్​లు, అధికారులు, సిబ్బంది ఈ నెల 2 నుంచి 10వ తేదీ వరకు నిరక్షరాస్యులను గుర్తించారు. అసలు అక్షరజ్ఞానం లేని వారినే ఈ జాబితాలోకి తీసుకున్నారు.

65% మంది మహిళలే

పల్లెల్లో నిరక్షరాస్యుల్లో మహిళలే 65 శాతం మంది ఉన్నట్టు తేలింది. చదువుకోని వాళ్లలో మహిళలు 7,70,627 మంది ఉన్నారు. పురుషులు 4,09,083 మంది ఉండగా, 157  మంది థర్డ్​జెండర్స్​కు చదువు రాదని గుర్తించారు. ఏళ్లతరబడి అమ్మాయిల చదువు విషయంలో కుటుంబాల్లో ఉన్న వివక్ష, ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితే, చదువులో అమ్మాయిలు వెనకబడడానికి కారణమని గుర్తించారు. యువకులు వేరే ప్రాంతాలకు వెళ్లి చదవుకునేందుకు తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నా, ఆడపిల్లలను మాత్రం పంపించేందుకు ఇష్టపడట్లేదని అధికారుల సర్వేలో తేలింది. ఇల్లు, వ్యవసాయ పనుల్లో సాయంగా పెట్టుకుని, తర్వాత పెళ్లి చేసి పంపుతున్నట్టు సర్వేలో తేలింది.

చదువులో మెదక్​ టాప్​

జిల్లాల వారీగా చూస్తే ఉమ్మడి మెదక్​ జిల్లా అక్షరాస్యతలో ముందున్నట్టు తేలింది. ప్రస్తుత కొత్త జిల్లాల ప్రకారం సంగారెడ్డి జిల్లాలో 10 లక్షలకుపైగా జనాభాలో 23 వేల మంది, సిద్దిపేటలో 8 లక్షలకుపైగా జనాభా ఉండగా 8 వేల మంది మాత్రమే నిరక్షరాస్యులున్నారు. నిజామాబాద్​ జిల్లా కూడా అక్షరాస్యతలో ముందుంది. ఈ జిల్లాలో 10.62 లక్షల మంది జనాభా ఉంటే 27 వేల మంది మాత్రమే నిరక్షరాస్యులున్నారు. సూర్యాపేట జిల్లా నిరక్షరాస్యతలో రికార్డు సాధించింది. ఈ జిల్లాలో 8 లక్షలకుపైగా జనాభా ఉంటే… వీరిలో 1.11 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నారు. ఆ తర్వాత అత్యధికంగా వికారాబాద్‌లో 78,501 మంది, యాదాద్రి భువనగిరిలో 75,198 మంది నిరక్షరాస్యులు ఉన్నట్టు తేలింది.

12న ప్రభుత్వానికి నివేదిక

ఈ నెల 12తో ముగియనుంది. అదే రోజున ప్రభుత్వానికి నిరక్షరాస్యుల జాబితాను ఇవ్వనున్నట్టు పంచాయతీరాజ్​ అధికారులు తెలిపారు. సర్వే చేస్తున్న సంస్థ నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకున్న తర్వాతే ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనున్నట్టు వివరించారు. ప్రస్తుతం మహబూబ్​నగర్​ జిల్లాలో ఒకటి, వనపర్తి జిల్లాలో ఒక గ్రామంలో మాత్రమే నిరక్షరాస్యుల డేటా ఎంట్రీ చేయలేదు. మున్సిపల్​ ఎన్నికలుండడంతో పట్టణ ప్రాంతాల్లో ఇంకా సర్వే చేయలేదు.

The number of illiterates in the villages of Telangana is 11.79 lakh