
మీటూ ఉద్యమంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటి తనుశ్రీ దత్తా ( Tanushree Dutta ) మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె తన సొంత ఇంట్లోనే భయంకరమైన వేధింపులను ఎదుర్కొంటున్నానని ఆరోపించారు. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ వీడియోలో తనుశ్రీ దత్తా తీవ్ర మనోవేదనతో కన్నీరుమున్నీరవుతూ .. తాను అనుభవిస్తున్న క్షోభను వివరించారు. ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియోను చూసి నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నా సొంత ఇంట్లోనే వేధింపు..
గత కొన్ని సంవత్సరాలుగా తనను వేధిస్తున్నారని తనుశ్రీ దత్తా ఆరోపించారు. ముఖ్యంగా 2018 తర్వాత ఈ పరిస్థితి మరింత తీవ్రమైందని చెప్పారు. తన ఆరోగ్యం పరిస్థితి కూడా బాగాలేదని, తన పనులు చేసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు. తన ఇంటి పనులు చేయడానికి పనివాళ్లను నియమించుకోవడంలో ఆటంకాలు ఎదుర్కొవాల్సి వస్తుందని చెప్పారు. గతంలో నియమించుకున్న కొందరు సహాయకులతో తనకు చెదు అనుభవం ఎదురైంది. తన ఇంట్లో వస్తువులను కూడా దొంగించుకుపోయారని ఆరోపించారు.
నా సొంత ఇంట్లోనే వేధింపులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో నేను పోలీసులకు ఫోన్ చేశా. వారు వచ్చి సరైన ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు రమ్మన్నారు. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగోలేదు. రెండు మూడు రోజుల్లో పోలీస్ స్టేషన్ కు వస్తానని చెప్పినట్లు తనుశ్రీ దత్తాతెలిపారు.
నానా పటేకర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు
తనుశ్రీ దత్తా 2018లో నటుడు నానా పటేకర్ ( Nana Patekar ) పట్ల లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో వార్తల్లోకి వచ్చారు. ఆ సంఘటన తర్వాత భారతదేశంలో #MeToo ఉద్యమం ఊపందుకుంది. అప్పటి నుండి ఆమె అనేక సవాళ్లను ఎదుర్కొన్నారని చెబుతున్నారు. ప్రస్తుతం, తన ఇంట్లోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని చెబుతూ ఆమె పోలీసులను సంప్రదించారు.
ఈ రోజు విసిగిపోయి పోలీసులకు కాల్ చేశాను. దయచేసి ఎవరైనా నాకు సాయం చేయండి. ఏదైనా జరిగేలోపు చర్య తీసుకోండి అని ఇన్ స్టాగ్రామ్ లో తనుశ్రీ దత్తా రాశారు. ఆమె చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆమెకు తక్షణ సహాయం అందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.