
- రోజు రోజుకూ పెరుగుతున్న బాధితుల సంఖ్య
- ప్రతి 100 మందిలో 30 మంది 35 ఏండ్లలోపు వారే
- తొలి దశలో సమస్యనుగుర్తించలేకపోతున్న బాధితులు
- జంక్ ఫుడ్ అలవాటు, ఒత్తిడితోనే సమస్యలు
- ఏటా చెకప్, ముందు జాగ్రత్త తప్పనిసరి అంటున్న నిపుణులు
- డయాలసిస్‌పైనే వేల మంది
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కిడ్నీ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిన్న వయసులోనే కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి. లక్షలాది మంది కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం నుంచి క్రానిక్ డిసీజ్ వరకు వివిధ సమస్యలతో బాధపడుతున్నారు. బీపీ, హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఊబకాయం, ఆహారపు అలవాట్లు, పెయిన్ కిల్లర్లను ఎక్కువగా వినియోగించడం వంటివి దీనికి కారణమవుతున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. ప్రతి వందలో ఆరు నుంచి ఎనిమిది మంది వరకు ఏదో ఒక స్థాయిలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. మన రాష్ట్రంలో గుండె సంబంధిత వ్యాధుల తర్వాత జనం ఎక్కువగా కిడ్నీ జబ్బులతోనే ఇబ్బందిపడుతున్నారు. ప్రధానంగా ఇటీవలి కాలంలో యూత్‌లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం కిడ్నీ బాధితులు ప్రతి వంద మందిలో 30 శాతం మంది 35 ఏండ్లలోపు వారే.
కిడ్నీ జబ్బుల పట్ల అవగాహన లేకపోవడంతో మూడో, నాలుగో స్టేజ్ దాకా కూడా సమస్యను గుర్తించలేకపోతున్నారని.. చాలా మంది పేషెంట్లు కిడ్నీలు పాడైపోతున్న దశలోనే తమ వద్దకు వస్తున్నారని నెఫ్రాలజిస్టులు చెప్తున్నారు. చిన్న వయసులో బీపీ వచ్చిందంటే, దాదాపు కిడ్నీ సమస్యగానే భావించాలని.. కానీ ట్యాబ్లెట్లు వాడుతూ సమస్య తీవ్రమయ్యే వరకూ తెచ్చుకుంటున్నారని స్పష్టం చేస్తున్నారు. కిడ్నీ జబ్బులకు ఇబ్బందికర లక్షణాలు ఎక్కువగా ఉండవని, దాంతో పరిస్థితి ముదిరే స్టేజీలో ట్రీట్‌మెంట్ కోసం వస్తున్నారని కిమ్స్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ రవి తెలిపారు.
ఆరోగ్యశ్రీలో అత్యధికం వారే..
ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న వారిలోనూ అత్యధికంగా కిడ్నీ బాధితులే ఉంటున్నారు. 2016–17లో 52,752 మంది, 2017–-18లో 58,768 మంది కిడ్నీ చికిత్సలు చేయించుకున్నారు. ఏడాదిలోనే 11 శాతం పెరగడం గమనార్హం. ఆరోగ్యశ్రీ కింద చేస్తున్న ఖర్చులో ఎక్కువ భాగం గుండె, కిడ్నీ జబ్బుల ట్రీట్‌మెంట్ కోసమే అవుతోంది. 2014––15 నుంచి 2018–19 వరకూ గుండె బాధితుల కోసం ప్రభుత్వం రూ.850 కోట్లు ఖర్చు చేయగా.. కిడ్నీ బాధితుల కోసం రూ.688 కోట్లు ఖర్చు చేసింది.
డయాలసిస్ పైనే 12 వేల ప్రాణాలు
కిడ్నీ సమస్యలను త్వరగా గుర్తించకపోవడంతో పరిస్థితి విషమించి డయాలసిస్ వరకూ వెళ్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో డయాలసిస్ పేషెంట్ల సంఖ్య 12 వేలు దాటింది. రాష్ట్రంలోని 43 ప్రభుత్వ డయాలసిస్ సెంటర్లలో సుమారు 7,500 మంది డయాలసిస్ చేయించుకుంటుండగా, మరో 5 వేల మంది ప్రైవేటు హాస్పిటళ్లలో చేయించుకుంటు-న్నారు. ప్రభుత్వ డయాలసిస్ సెంటర్లు చాలని పరిస్థితి ఉంది. ప్రైవేటులో చేయించుకుంటే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నా.. కొన్ని జిల్లా కేంద్రాల్లోనూ సెంటర్లు లేవు. దాంతో కొందరు దూర ప్రాంతాలకు వెళ్లలేక వారానికి మూడుసార్లకు బదులు రెండుసార్లు మాత్రమే డయాలసిస్ చేయించుకుంటున్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. దానివల్ల శరీరంలో మిగతా అవయవాలు దెబ్బతింటున్నాయని వివరిస్తున్నారు. జగిత్యాలలోని ప్రభుత్వ డయాలసిస్ సెంటర్ అక్కడి పేషెంట్లకు సరిపోవడం లేదు. నల్గొండ సహా చాలా జిల్లాల్లో అదే పరిస్థితి. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో సైతం డయాలసిస్ సెంటర్లను పెంచాలని ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కిడ్నీ స్పెషలిస్టులు వంద మందే..
కిడ్నీ రోగుల సంఖ్య బాగా పెరుగుతుండగా నెఫ్రాలజిస్టుల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళనకరంగా మారింది. కిడ్నీ స్పెషలిస్టులు దేశవ్యాప్తంగా రెండు వేల మంది కంటే తక్కువగా ఉన్నారని.. మన రాష్ట్రంలో 100 మందిలోపే ఉంటారని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. కిడ్నీ బాధితులు పెరగడానికి స్పెషలిస్టుల కొరత కూడా కారణమని, ఇతర డాక్టర్లు సమస్యను తొలిదశలో గుర్తించలేకపోవడంతో వ్యాధి ముదురుతోందని నిపుణులు అంటున్నారు. అన్ని సర్కారు దవాఖానాల్లో డాక్టర్లకు కిడ్నీ కేసుల గుర్తింపుపై శిక్షణ ఇవ్వాలని సూచిస్తున్నారు.
అవయవ మార్పిడిలో కిడ్నీలే టాప్
రాష్ట్రంలో జీవన్‌దాన్ ద్వారా ఇప్పటివరకూ 1,094 మందికి కిడ్నీ మార్పిడి చేయగా.. మరో 3,686 మంది ఎదురుచూస్తున్నారు. జీవన్‌దాన్ లెక్కల ప్రకారం అవయవ మార్పిడిలో కిడ్నీ మార్పిడులే సగం వరకు (41.2 శాతం) ఉన్నాయి. ఇక కిడ్నీ మార్పిడుల్లో 80% కుటుంబ సభ్యులు ఇస్తున్నవే ఉండగా.. 20 శాతం మాత్రమే ఇతరులు దానం చేసినవి కావడం గమనార్హం. ‘‘వెస్ట్రన్ కంట్రీస్‌లో బ్రెయిన్ డెడ్ పేషెంట్ల నుంచి కచ్చితంగా అవయవాలు సేకరించి, ఇతరులకు ఉపయోగిస్తారు. మన దగ్గర అవగాహన లేకపోవడం, అపోహలతో బ్రెయిన్‌డెడ్ కేసుల్లోనూ అవయవాలు దానం చేయడంలేదు. ఇప్పుడిప్పుడే కొంత మార్పు వస్తోంది”అని సీనియర్ నెఫ్రాలజిస్ట్ దిలీప్ బాబు చెప్పారు.
కిడ్నీ వ్యాధి లక్షణాలివీ..
- ఆక్సిజన్, బ్లడ్ లెవల్స్ తగ్గి నీరసం, అలసట వంటి వాటితో బీపీ వస్తుంది.
- మూత్రంలో మలినాలు రావడం. రంగు మారడం. నొప్పి, మంట రావడం.
- సరిగా నిద్రపట్టకపోవడం
- పాదాలు, చేతులు ఉబ్బడం
- కండరాల నొప్పులు
- రుచిని గుర్తించలేకపోవడం
- ఇవి పాటిస్తే మంచిది
- ఆహార నియమాలు పాటించాలి. జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
- వీలైనంత ఎక్కువగా నీరు తాగాలి.
- డ్రింకింగ్, స్మోకింగ్ అలవాట్లను మానుకోవాలి.
- ఉప్పు వాడకం తగ్గించాలి.
- కనీసం ఆరు నెలలు, లేదా సంవత్సరానికి ఒకసారి క్రియాటినైన్, కంప్లీట్ యూరిన్ టెస్ట్ చేయించుకోవాలి.
ఏటా టెస్టులు చేయించుకోవడం బెటర్
రాష్ట్రంలో కిడ్నీ డిసీజెస్ సమస్య తీవ్రంగా ఉంది. లైఫ్ స్టైల్, ఊబకాయం, స్మోకింగ్, ఫుడ్ హ్యాబిట్స్‌తో యూత్ కూడా కిడ్నీ సమస్యల్లో చిక్కుకుంటున్నారు. తమకు ఆ సమస్య ఉన్నట్టు తెలుసుకోలేకపోతున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు ఏటా క్రియాటిన్, కంప్లీట్ యూరిన్ టెస్ట్ లు చేయించుకోవాలి. ఐదారు వందలు ఖర్చు పెడితే ఈ టెస్ట్‌లు చేయించుకోవచ్చు. కిడ్నీ సమస్య ఉంటే తేలిపోతుంది. సమస్య ఉన్నట్టు తేలితే అది ముదరకుండానే జాగ్రత్త పడొచ్చు.
– డాక్టర్ దిలీప్ బాబు,
సీనియర్ నెఫ్రాలజిస్ట్, యశోద హాస్పిటల్.