అబాసుపాలవుతోన్న గొర్రెల పంపిణీ పథకం

 అబాసుపాలవుతోన్న గొర్రెల పంపిణీ పథకం
  • వారం పదిరోజుల్లో ఇస్తామని మూడు నెలలుగా పెండింగ్ 
  • జిల్లాలో 2,200 మంది ఎదురుచూపులు 

ఆదిలాబాద్, వెలుగు: గొల్ల కుర్మలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ పథకం అబాసుపాలవుతోంది. మునుగోడు ఉప ఎన్నిక టైమ్​లో ఆఫీసర్లు వారంపది రోజుల్లో గొల్లకుర్మలకు యూనిట్లు పంపిణీ చేస్తామంటూ ప్రచారం చేశారు. దీంతో చాలామంది అప్పుచేసి ప్రభుత్వ ఖజానాకు డీడీలు కట్టారు. తీరా మూడు నెలలవుతున్నా.. గొర్లు ఇయ్యలేదు. కట్టిన డీడీల పత్తాలేదు. 

డీడీలు కట్టిన 2,200 మంది...

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 8,430 యూనిట్లు మంజూరు చేయాలని ఆఫీసర్లు నిర్ణయించారు. మొదటి విడతలో 4,100 మందికి పంపిణీ చేశారు. రెండో విడతలో రెండో విడతలో 740 మందికి మాత్రమే ఇచ్చి నిలిపవేశారు. ప్రభుత్వం లబ్ధిదారుల నుంచి మరోసారి డీడీలు కట్టించుకుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,200 మంది గొర్ల యూనిట్ల కోసం డీడీలు కట్టారు. ఒక్కొక్కరు రూ. 43,750 చొప్పున 9.62 కోట్లు జమ చేశారు. అయినా ప్రభుత్వం యూనిట్ల పంపీణీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

ఆది నుంచే అపసోపాలే..

గొర్ల పంపిణీ పథకానికి ఆది నుంచి ఆపసోపాలు తప్పడం లేదు. 2017లో ఈ పథకానికి శ్రీకారం చుట్టిన సర్కార్ ఒక యూనిట్​లో ఒక పొట్టెలు, 20 గొర్రెలను పంపిణీ చేసింది. మొదటి విడతలోనే ఎన్నో అపసోపాలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, అకోల, ఉస్మనాబాద్ తదితర ప్రాంతాల నుంచి గొర్రెలు తెచ్చి ఇచ్చారు. ఇందులో చాలావరకు చనిపోయాయి. రెండో  విడత వచ్చే సరికి మళ్లీ అదే పరిస్థితి. 2018  జూలై లో రెండో విడత పంపిణీ చేసేందుకు మొదటగా ప్రభుత్వం నిర్ణయించడంతో చాలా మంది డీడీలు కట్టారు. కానీ.. ప్రభుత్వం పంపిణీ ఆపేసింది. నాలుగేళ్ల తర్వాత గొర్ల యూనిట్ల కోసం లబ్ధిదారుల నుంచి డీడీలు తీసుకోవడంతో ఈ సారైనా పంపిణీ సక్రమంగా జరుగుతుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. 

ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు

గొర్ల యూనిట్ల పంపిణీకి సంబంధించి డీడీలు తీసుకున్నాం. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు. రాగానే పంపిణీ చేస్తాం.
- కిషన్, పశు సంవర్దక శాఖ అధికారి