ఉపాధి స్కీంలో అక్రమాలకు చెక్​

ఉపాధి స్కీంలో అక్రమాలకు చెక్​

నిర్మల్, వెలుగు : కేంద్రం తీసుకువచ్చిన కొత్త విధానంతో జాతీయ ఉపాధి హామీ పథకంలో ఇప్పటివరకు కొనసాగిన లోకల్ లీడర్ల జోక్యం, అవినీతికి చెక్ పడింది. అధికార పార్టీకి చెందిన స్థానిక లీడర్లు సంబంధిత ఈజీఎస్ అధికారులు, సిబ్బందిపై ఒత్తిళ్లు  తెచ్చి ఉపాధి హామీ పథకాన్ని పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. బినామీ జాబ్ కార్డులు సృష్టించడం, పనులు చేయకుండానే  చేసినట్లు రికార్డులు తయారు చేయడం, పెద్ద మొత్తంలో కూలీల పేరిట డబ్బులు కొట్టేయడం ఈజీఎస్​లో సాధారణంగా జరిగేది. ఈ స్కీంపై నిఘా పెట్టిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అక్రమాలకు అడ్డుకట్ట వేసే తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. 

ఎన్ఎంఎంఎస్​తో చెక్​
ఇప్పటివరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ వాడుతున్న  సాఫ్ట్ వేర్ ను పక్కన పెట్టి, పూర్తిగా తన ఆధీనంలో ఉన్న నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్) ను కేంద్రం తెరపైకి తెచ్చింది. మార్చి ఫస్ట్ ​నుంచి ‘ఎన్ఎంఎంఎస్’ ద్వారానే ఉపాధి కూలీలు ప్రతి రోజు రెండుసార్లు ఫొటోలు దిగి తమ  అటెండెన్స్ ను  అప్ లోడ్ చేయాల్సి వస్తోంది. రియల్ టైమ్ అటెండెన్స్ పేరిట చేపట్టిన ఈ  సిస్టమ్ కు జియో ట్యాగ్ చేస్తున్నారు. ఈ విధానంతో అవకతవకలకు, లీడర్ల అక్రమాలకు  పూర్తిగా చెక్ పడింది. ఉపాధి హామీ పథకం కింద పనులు చేసే చోటు నుంచి ప్రతిరోజూ ఉదయం 11  గంటలలోపు, ఆ తర్వాత  మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల్లోపు  ఫొటోలు దిగి ‘ఎన్ఎమ్ఎమ్ఎస్’ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా  రెండు సార్లు ఫొటోలు తీసి హాజరు వేసుకొన్నవారికే  వేతనాలు చెల్లిస్తారు. ఈ డబ్బులు కూడా డైరెక్ట్​గా కూలీల బ్యాంక్ అకౌంట్లోనే జమ అవుతున్నాయి. దీంతో జాబ్ కార్డులున్న లోకల్ లీడర్ల పెత్తనానికి  బ్రేక్ పడింది.   

పనుల వివరాలు అప్​లోడ్​ చేయాల్సిందే..
ఈజీఎస్​ కింద చేపట్టే పనుల విషయంలో కూడా అనేక కంప్లయింట్స్​ వెల్లువెత్తాయి. దీనికి  కూడా చెక్  పెట్టేందుకు కేంద్రం ఎన్ఎంఎం సిస్టమ్ ఉపయోగిస్తోంది. కూలీల పేర్లు..ఎంత మేరకు పని పూర్తి చేశారనే  వివరాలన్నింటిని ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. దీనిని అక్కడి గ్రామ పంచాయతీ కార్యదర్శులు వెంట వెంటనే  వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తున్నారు. ఆ రోజు ఎంత మంది కూలీలు పని చేస్తున్నారు? ఏ పనులు చేస్తున్నారు? అన్న వివరాలు ఎప్పటికప్పుడు ఫొటోల ద్వారా అధికారులకు తెలిసిపోతుంది. ఇలా దేశవ్యాప్తంగా ఎంత మంది కూలీలకు ఉపాధి కల్పించారనే వివరాలు అప్​డేట్అవుతూ ఉంటాయి.  

జాబ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్  
ప్రధానమంత్రి ఉన్నతి  కౌశల్ శిక్షణలో భాగంగా ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు, వారి కుటుంబసభ్యులకు జాబ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 3,357 మందిని ఎంపిక చేశారు.  వీరందరికి ఆసక్తి ఉన్న ఉపాధి కోర్సుల్లో ట్రైనింగ్​ ఇవ్వనున్నారు. ఎలక్ట్రికల్, కార్పెంటరీ, ప్లంబర్ , బైక్ మెకానిక్, వెల్డింగ్, కన్ఫెక్షనరీ, డెయిరీతో పాటు దాదాపు యాబైకి పైగా కోర్సుల్లో శిక్షణ అందించనున్నారు. ఇందులోభాగంగా స్టైఫండ్ కూడా చెల్లించబోతున్నారు. ఒకవేళ ఉపాధి హామీ పనులు నిలిచిపోయిన సందర్భంలో వీరంతా తాము తీసుకున్న ట్రైనింగ్​తో ఆల్టర్నేట్​ఉపాధి పొందే అవకాశం ఉంటుంది.  

ఎన్ఎమ్ఎమ్ఎస్ తో పారదర్శకత  
ఎన్ఎంఎంఎస్ సిస్టంతో ఉపాధిహామీ పథకంలో పూర్తి పారదర్శకత ఏర్పడుతుంది. బాధ్యత కూడా పెరుగుతుంది.  కూలీలందరికీ ఫొటోలతో కూడిన అటెండెన్స్ పై అవగాహన కల్పిస్తున్నాం. ఇంతకుముందు చాలా చోట్ల సెల్ ఫోన్ సిగ్నల్స్ తో ఇబ్బందులు వచ్చేవి. కొత్త సిస్టమ్​తో ఎలాంటి  అవకతవకలకు అవకాశం ఉండదు. పథకం పకడ్బందీగా అమలవుతుంది. కూలీలందరికీ పని దొరకడంతో పాటు వేతనాలు సక్రమంగా అందుతాయి. బినామీలకు ఎలాంటి అవకాశాలుండవు. – విజయలక్ష్మి , పీడీ, డీఆర్డీవో, నిర్మల్ .