వణికిపోతున్న ఉత్తరాది రాష్ట్రాలు... ఇంకా ఐదు రోజుల పాటు వర్ష బీభత్సం

వణికిపోతున్న ఉత్తరాది రాష్ట్రాలు... ఇంకా ఐదు రోజుల పాటు వర్ష బీభత్సం

దేశంలో పలు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్‌లలో రహదారులు నీటమునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నదులు ఉప్పొంగి.. వరదలు రావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. 

ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, గుజరాత్‌, మహారాష్ట్ర, లద్ధాఖ్‌లలో కురిసిన   భారీ వర్షాల కారణంగా  వేర్వేరు ఘటనల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొత్వాలీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో యూపీ-ఉత్తరాఖండ్‌ సరిహద్దులోని ఓ రోడ్డుపైకి భారీగా వరదనీరు వచ్చింది. రూపెదిహా నుంచి హరిద్వార్‌కు వెళ్తున్న యూపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు వరదల్లో చిక్కుకుపోయింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ఉన్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు జేసీబీల సాయంతో బస్సులోని ప్రయాణికులను రక్షించారు. 
ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం ( జులై 21)  సాయంత్రం నుంచి కురుస్తున్న  భారీ వర్షంతో  నగర శివారులోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా ముంబయిలో 100కి పైగా లోకల్‌ రైళ్లు రద్దయ్యాయి. వర్షాల నేపథ్యంలో ముంబయికి వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. యావత్మాల్‌ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో మహాగావ్‌ తహసిల్‌ గ్రామంలోని ఇళ్లలోకి వరద చేరింది. దీంతో గ్రామంలో దాదాపు 110 మంది చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాయ్‌గఢ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 27కి చేరింది. ఇంకా 81 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. 

హిమాచల్‌ప్రదేశ్‌లోని కోట్‌ఖాయ్‌లో కొండచరియలు విరిగిపడి ఓ ఇల్లు ధ్వంసం కావడంతో నేపాల్‌కు చెందిన దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా  రోహ్రులో వరదలో కొట్టుకుపోయి ఇద్దరు వృద్ధులతో పాటు వారి మనవడు మృతి చెందాడు. గుజరాత్‌లోని నవ్‌సారీలో డ్రైయిన్‌ ఉప్పొంగడంతో అందులో తండ్రీకొడుకులు కొట్టుకుపోయారని, తండ్రిని రక్షించినా.. కుమారుడి జాడ తెలియలేదని సహాయక బృందాలు వెల్లడించాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రానగర్‌ హవేలీలో వాగులో కారు కొట్టుకుపోవడంతో ఇద్దరు మృతి చెందారు.

భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా లద్ధాఖ్‌లో ఆకస్మిక వరదలు వచ్చాయి. దీంతో ప్రధాన రహదారులతో పాటు మార్కెట్లు నీట మునిగాయి. లేహ్‌ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లోనూ శనివారం (జులై 22) భారీ వర్షాలు కురిశాయి. జునాగఢ్‌ సిటీలో 219 మి.మీల వర్షపాతం నమోదుకావడంతో రహదారులన్నీ నదులను తలపించాయి. పార్కింగ్‌ చేసిన పలు వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. నవ్‌సారీ, జునాగఢ్‌, ద్వారకా, భావ్‌నగర్‌, సూరత్‌, తాపి, వల్సాద్‌, అమ్రేలీ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. పంజాబ్‌, హరియాణాల్లో జలాశయాలు నిండుకుండలా మారాయి. 

 ఇంకా ఐదు రోజుల పాటు ( జులై 23 నుంచి27వరకు) ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  దీంలో  లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.  ఎక్కడికక్కడ రెస్క్యూ టీంమ్స్ సహాయక చర్యలు ప్రారంభించారు.