
- పూర్తిగా నిండిపోయిన రాంపూర్ యార్డు
- ఆరు నెలలైనా పావువంతు కూడా కంప్లీట్కాని బయో మైనింగ్
- సాయంత్రమైందంటే చెత్త నుంచి భారీ పొగ
- ఘాటు వాసన, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
హనుమకొండ/కాజీపేట, వెలుగు : గ్రేటర్ వరంగల్ నగరానికి ఉన్న ఏకైక డంప్‌యార్డు పూర్తిగా నిండిపోయింది. అక్కడ ప్రారంభించిన బయో మైనింగ్ ప్రక్రియ డెడ్ స్లోగా నడుస్తోంది. ఆరు నెలలైనా ప్రాసెసింగ్ పావువంతు కూడా కాలేదు. దీంతో అనుకున్న టైంలోగా చెత్తనంతా క్లీన్ చేసేందుకు సిబ్బంది రోజూ రాత్రి అక్కడి కుప్పలకు మంట పెడుతున్నారు. దాని నుంచి వెలువడే పొగ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కమ్మేస్తోంది. ఫలితంగా అక్కడి ప్రజలు వివిధ రోగాల బారిన పడటంతో పాటు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు.
బయోమైనింగ్ వెరీ స్లో
గ్రేటర్వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో దాదాపు 2.5 లక్షల ఇండ్లు.. సుమారు 11 లక్షల జనాభా ఉంది. నిత్యం 350 నుంచి 400 టన్నుల చెత్త పోగవుతుండటంతో సిటీ శివారులోని రాంపూర్ వద్ద 32 ఎకరాల స్థలంలో 2007లో డంప్ యార్డు ఏర్పాటు చేశారు. అప్పటినుంచి దాదాపు 5 లక్షల టన్నుల వరకు చెత్త పోగైంది. ఆ చెత్తనంతా ప్రాసెస్చేసేందుకు వివిధ ప్రాజెక్టులు ప్లాన్‌చేసి చివరకు బయో మైనింగ్ చేపట్టారు. చెన్నై కి చెందిన ఓ కంపెనీ గత డిసెంబర్లో వర్క్ స్టార్ట్ చేసింది. ఏడాదిలో చెత్తనంతా ప్రాసెస్ చేయాలనే టార్గెట్ నిర్దేశించగా.. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా స్టడీ చేసి ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి చాలా సమయం పట్టింది. దీంతో బయో మైనింగ్ ప్రక్రియ చాలా స్లోగా నడుస్తోంది. ఇప్పటివరకు దాదాపు 60 వేల టన్నుల వరకు మాత్రమే ప్రాసెస్ చేశారు. అంటే నెలకు సగటు 12 వేల టన్నులు మాత్రమే శుద్ధి చేయగలుగుతున్నారు.
ప్రత్యామ్నాయం లేక ఇబ్బంది
రాంపూర్యార్డులో బయో మైనింగ్స్టార్ట్ చేసి.. రోజువారీగా వెలువడే చెత్తను తరలించేందుకు కొత్తగా నాలుగు డంప్ యార్డులు ఏర్పాటు చేసేందుకు గ్రేటర్ఆఫీసర్లు ప్లాన్ చేశారు. ఈ మేరకు వరంగల్ నగరానికి నాలుగు వైపులా స్థలాలను పరిశీలించారు. అందులో అసైన్డ్ ల్యాండ్స్ఉండటం, దాంతోపాటు ప్రతిపాదిత కొత్త డంప్‌యార్డులు గ్రామాలకు అతి దగ్గర్లోనే ఉండటంతో స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో కొత్త డంప్ యార్డులకు అనుమతి వచ్చినా ల్యాండ్ప్రాబ్లమ్స్, స్థానికుల వ్యతిరేకత వల్ల ఇంకా అవి ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీంతో నగరంలో రోజూ వెలువడే చెత్తనంతా రాంపూర్ డంపింగ్ యార్డుకే తరలించాల్సి వస్తోంది. నగరంలో నెలకు సగటున 12 వేల టన్నుల వరకు చెత్త పోగవుతుండగా.. అంతే మొత్తంలో బయో మైనింగ్ లో ప్రాసెస్ చేస్తున్నారు. దీంతో కొత్తగా పోగవుతున్న చెత్తతో రాంపూర్ డంప్‌యార్డు ఎప్పుడూ నిండిపోయే ఉంటోంది.
రోగాల బారిన జనాలు
రాంపూర్డంపింగ్యార్డుకు చుట్టుపక్కల ఉన్న మడికొండ, రాంపూర్గ్రామాలు సాయంత్రం అయ్యిందంటే పొగతో నిండిపోతున్నాయి. వీటితో పాటు ఆ పక్కనే ఉన్న ఎలుకుర్తి, అయోధ్యపురం, కుమ్మరిగూడెం, మోడల్ కాలనీలోని కొన్ని ఏరియాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సాయంత్రమైతే చాలు పొగతో శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు వాపోతున్నారు. యార్డులో నిల్వ ఉన్న చెత్తలోంచి కెమికల్స్రిలీజ్ కావడం, ఎండ వేడి వల్ల డంప్ యార్డులో మంటలు చెలరేగుతున్నట్లు మున్సిపల్‌సిబ్బంది చెబుతుండగా.. డంప్‌యార్డు మొత్తం నిండిపోవడంతో కొత్తగా వచ్చే చెత్తను పోసేందుకు వీలుగా రోజూ సాయంత్రం అక్కడి సిబ్బంది మంట పెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొన్నేండ్లుగా ఇదే సమస్య ఎదురవుతుండటంతో రాంపూర్, మడికొండ, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాలాసార్లు నిరసనలకు దిగారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇప్పుడు మరోసారి ఆందోళనలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు.
శ్వాస సరిగా ఆడటం లేదు
రాంపూర్ డంపింగ్‌యార్డు నుంచి వచ్చే పొగ వల్ల శ్వాస సరిగా ఆడటం లేదు. ఆస్తమా బారిన పడడంతో పొగతో చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. డంప్ యార్డు పొగతో నాలాగే చుట్టుపక్కల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయమై లీడర్లు, ఆఫీసర్లకు ఎన్నోసార్లు విన్నవించాం. డంప్ యార్డును ఇక్కడి నుంచి తరలించాలి. లేదా పొగ గ్రామాలను కమ్మేయకుండా చర్యలు తీసుకోవాలి.
– నిర్మల, మడికొండ
రోగాలు వస్తున్నయ్
రోజూ సాయంత్రమైందంటే చాలు మా ఏరియా మొత్తం పొగతో నిండిపోతోంది. రాంపూర్ డంప్ యార్డు నుంచి పొగ బాగా వస్తోంది. ఘాటు వాసనతో శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో చాలామంది రోగాల బారిన పడ్డారు. లీడర్లు, ఆఫీసర్లు స్పందించి సమస్యను పరిష్కరించాలి.
– గడ్డం నవీన్, మోడల్‌కాలనీ, ధర్మసాగర్