కొత్త పార్లమెంట్ ను స్వాగతిస్తున్న పార్టీలు ఏవీ..?

కొత్త పార్లమెంట్ ను స్వాగతిస్తున్న పార్టీలు ఏవీ..?

పార్లమెంటు నూతన భవనాన్ని రాజ్యాంగ అధినేత రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి ప్రారంభించనుండటాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మే 28వ తేదీన జరగబోయే ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తూ 20 విపక్ష పార్టీలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. కాంగ్రెస్ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, RJD, DMK, శివసేన-UBT, JMM, సమాజ్ వాదీ వంటి పార్టీలు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాయి. 

ఈ క్రమంలోనే దేశంలో చాలా పార్టీలు పార్లమెంట్ ను మోడీ ప్రారంభించటాన్ని స్వాగతిస్తూ.. కార్యక్రమానికి హాజరవుతున్నాయి. ఆ పార్టీలు

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతున్న పార్టీలు

మే 28న జరిగే ఆవిర్భావ వేడుకలకు అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో పాటు కింది పార్టీలు హాజరు కానున్నాయి.

* శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం)
* నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP)
* నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (NDPP)
* సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM)
* రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (RLJP)
* అప్నా దల్ (సోనీలాల్)
* రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI)
* తమిళ మనీలా కాంగ్రెస్
* ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK)
* ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (AJSU)
* మిజో నేషనల్ ఫ్రంట్ (MNF)
* యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP)
* తెలుగుదేశం పార్టీ (టిడిపి)
* శిరోమణి అకాలీదళ్ (SAD)
* బిజు జనతా దళ్ (BJD)

ఈ పార్టీలే కాకుండా, దేవనాథన్ యాదవ్ స్థాపించిన తమిళనాడుకు చెందిన భారత మక్కల్ కల్వి మున్నేట్ర కజగం (IMKMK) కూడా కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉంది. 

 

పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవాన్ని తాము బహిష్కరిస్తున్నట్లు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తెలిపారు. ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు DMK రాజ్య సభ సభ్యుడు తిరుచ్చి శివ స్పష్టత ఇచ్చారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి NCP హాజరుకాదని.. ఈ అంశంపై భావసారూప్యత కలిగిన ఇతర పార్టీలతో కలిసి నిలబడాలని నిర్ణయించకున్నట్లు NCP ప్రకటించింది. అన్ని ప్రతిపక్ష పార్టీలతో కలిసే తాము కూడా నడుస్తామని శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ తెలిపారు. ఈ జాబితాలో సీపీఎం కూడా చేరింది. శిలా ఫలకాలపై పేరు కోసమే మోడీ, దేశ అత్యున్నత స్థానంలో ఉన్న గిరిజన మహిళను అవమానిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ విమర్శించారు. ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతితో కాకుండా ప్రధాని ఎందుకు ప్రారంభిస్తున్నారని ప్రశ్నించారు.

విపక్షాల సంయుక్త ప్రకటన

‘‘కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఒక ముఖ్యమైన ఘట్టం. కేంద్ర ప్రభుత్వం వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు ఉంది. దేశ ప్రథమ మహిళ ద్రౌపదీ ముర్మును పక్కనబెట్టి ప్రధాని మోడీ కొత్త పార్లమెంటు భవనాన్ని స్వయంగా ప్రారంభించాలని నిర్ణయించడం ఇది ఆమెను అవమానించడమే. ఇలా చేయడం ప్రజాస్వామ్యంపై దాడి కూడా. రాష్ట్రపతి దేశాధినేత మాత్రమే కాదు.. పార్లమెంటులో అంతర్భాగం. పార్లమెంట్​లో బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. అలాంటిది రాష్ట్రపతి లేకుండానే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని ప్రధాని నిర్ణయించారు. ఈ చర్య గౌరవప్రదమైన రాష్ట్రపతి పదవిని అవమానిస్తుంది’’ అంటూ విపక్షాలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. కాంగ్రెస్, డీఎంకే, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, శివసేన(యూబీటీ), జేడీయూ సహా 20 పార్టీలు ఈ ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. బీఆర్ఎస్ కూడా కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. 

మోడీపై కమల్ విమర్శలు

ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. జాతీయ అహంకారంతో కూడిన ఈ క్షణం రాజకీయంగా విభజనగా మారిందని అని అన్నారు.‘‘ నేను ప్రధానిని ఓ ప్రశ్న అడుగుతాను, దయచేసి సమాధానం చెప్పండి.. మన కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతి ఎందుకు హాజరుకాకూడదు’’ అని అడిగారు. దేశాధినేతగా ఉన్న రాష్ట్రపతి ఈ చారిత్రాత్మ కార్యక్రమంలో పాల్గొనపోవడానికి నాకు కారణం కనిపించడం లేదని కమల్ హాసన్ అన్నారు.

జాతీయ ప్రయోజనాల దృష్ట్యా నేను కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటానని, అయితే భారత రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం, ప్రారంభోత్సవ ప్రణాళికలో ప్రతిపక్ష పార్టీలను చేర్చకపోవడంపై నా అసమ్మతిని కొనసాగిస్తానని అన్నారు. అంటే మొత్తం కమల్ పార్టీ కూడా హాజరుకావడం లేదు. 

మరోవైపు.. తన చర్యను కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంటోంది. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టికి ఉదాహరణ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించామని తెలిపారు. రావడం లేదా రాకపోవడం వారికి విజ్ఞత మీద ఆదారపడి ఉంటుందని పేర్కొన్నారు. భవనం ప్రారంభోత్సవాన్ని రాజకీయం చేయకూడని అమిత్ షా అభిప్రాయపడ్డారు.

విపక్ష పార్టీలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి స్పందించారు. ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్న పార్టీలు తమ నిర్ణయంపై మరోసారి ఆలోచించుకోవాలని కోరారు. జాతీయ స్ఫూర్తి, దేశ పురోగతిపై గర్వించడమనేది కాంగ్రెస్‌కు కొరవడిందని కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పురి విమర్శించారు. పార్లమెంటు అనుబంధ భవనాన్ని 1975లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారనీ, 1987లో ఆమె తనయుడు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ కూడా ప్రధానిగా పార్లమెంటు గ్రంథాలయానికి శంకుస్థాపన చేశారని ఆయన గుర్తుచేశారు. అప్పట్లో ప్రభుత్వాధినేతలు చేయగా లేనిది ఇప్పుడు చేస్తే తప్పేమిటని కాంగ్రెస్‌ని హర్దీప్‌సింగ్‌ ప్రశ్నించారు.

భారత నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ.. మే 28న ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. కొత్త పార్లమెంట్ నిర్మాణ పనులు రెండేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. 2020 డిసెంబర్​లో భవనానికి పునాది రాయి వేశారు ప్రధాని. నిజానికి గతేడాది నవంబర్​లోనే భవనం పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ.. పలు కారణాల వల్ల నిర్మాణం ఆలస్యమైంది.

64,500 చదరపు మీటర్ల పరిధిలో కొత్త పార్లమెంట్ భవనం ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్​తో పాటు రెండు అంతస్తులు ఉంటాయి. ప్రస్తుత భవనాన్ని పోలినట్లు ఉండే కొత్త పార్లమెంట్ ఎత్తు సైతం పాత భవనం అంతే ఉంటుంది. ఒకేసారి 1224 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. లోక్​సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండనున్నాయి. ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు ప్రత్యేక ఆఫీసులు ఉంటాయి. ఎంపీల కోసం విశాలమైన లాంజ్, లైబ్రరీ, కమిటీల గదులు, క్యాంటీన్లు ఉండనున్నాయి.