ఏ రూట్ లో ఎంత మంది.. ప్రయాణిస్తున్నరు? ప్యాసింజర్ల డేటా సేకరిస్తున్న ఆర్టీసీ

ఏ రూట్ లో ఎంత మంది.. ప్రయాణిస్తున్నరు? ప్యాసింజర్ల డేటా సేకరిస్తున్న ఆర్టీసీ

ఏ రూట్ లో ఎంత మంది.. ప్రయాణిస్తున్నరు?
ప్యాసింజర్ల డేటా సేకరిస్తున్న ఆర్టీసీ
మొత్తం రూట్లలో వివరాల సేకరణ 
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో ఎంవోయూ
సర్వీసుల పెంపు, ఇతర చర్యల కోసమని వెల్లడి
15 రోజులకొకసారి రిపోర్ట్ ఇస్తున్న ఐఎస్ బీ టీమ్

హైదరాబాద్, వెలుగు :  ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేస్తున్న ప్యాసింజర్ల డేటాను ఆ సంస్థ సేకరిస్తున్నది. ఏ రూట్ లో ఎంత మంది ప్రయాణిస్తున్నరు? స్టూడెంట్లు, మహిళలు, రోజువారీ కూలీలు, వివిధ పనుల కోసం నిత్యం జిల్లా కేంద్రాలకు వెళ్తున్నవారు.. ఇలా అన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ)తో ఈ ఏడాది జనవరిలో ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఫిబ్రవరి నుంచి డేటా సేకరణ మొదలు పెట్టారు. జర్నలిస్టులకు రాయితీ పాస్ లు ప్రభుత్వం అమలు చేస్తున్నది. కొద్ది రోజుల నుంచి జర్నలిస్టుల ఫోన్ నంబర్ టిమ్​ మిషన్ లో ఎంటర్ చేస్తేనే టికెట్ ఇష్యూ అవుతున్నది. డేటా అనాలసిస్ లో భాగంగా నే ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో దశల వారీగా అన్ని వర్గాల ప్యాసింజర్ల వివరాలు తీసుకునేలా టిమ్ మిషన్లలో మార్పులు చేస్తున్నారు. రూట్ల క్రమబద్ధీకరణ, బస్సు సర్వీసులు, లాభాల పెంపుతో పాటు ఇతర చర్యలకు ఈ డేటా దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. 

రూట్ల వారీగా డేటా

రాష్ట్రంలో మొత్తం 2,500 రూట్లు ఉన్నాయి. ఈ రూట్లలో నిత్యం10 వేల బస్సులతో 35 లక్షల మంది ప్యాసింజర్లను ఆర్టీసీ వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నది. అధికారుల ఆదేశాలతో కండక్టర్లు రూట్ల వారీగా డేటా ఇస్తున్నారు. ఆ డేటాను ఐఎస్ బీ టీమ్ అనాలసిస్ చేసి 15 రోజులకు ఒకసారి ఆర్టీసీ అధికారులకు అందజేస్తున్నది. ఏ రూట్లలో రద్దీ ఉంది? ఏ రూట్లలో రెవెన్యూ ఎక్కువొస్తుంది? ఏ టైమ్ లో బస్సులు రష్ గా ఉంటున్నాయి? ఇలా వివిధ రకాల పారామీటర్ల ప్రకారం డేటా సేకరణ జరుగుతున్నదని ఓ అధికారి తెలిపారు. ఆ అనాలిసిస్ ప్రకారం రష్​ఎక్కువగా ఉండి, రెవెన్యూ ఎక్కువ వచ్చే రూట్లలో సర్వీసులు పెంచి, ఆదాయం రాని రూట్లలో తగ్గించే చాన్స్​ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 

మహిళలకు ఫ్రీ జర్నీ ఆలోచన ?

కర్నాటక ప్రభుత్వం ఆ రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ కల్పిస్తున్నది. మరో నాలుగు నెలల్లో రాష్ట్రంలోనూ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే, ఎలక్షన్​ముందు ఇక్కడి ప్రభుత్వం కూడా దీనిపై హామీ ఇస్తుందన్న ప్రచారం  జోరుగా జరుగుతున్నది. ఈ డేటాతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు? ఫ్రీ జర్నీ అమలు చేస్తే ఎంత ఖర్చు అవుతుంది? తదితర విషయాలపై ప్రభుత్వానికి ఆర్టీసీ రిపోర్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. అయితే, ఫ్రీ జర్నీపై ఇటీవల మంత్రి పువ్వాడ అజయ్ ని మీడియా ప్రశ్నించగా అలాంటి ఆలోచన లేదని కొట్టిపారేశారు.  

జిల్లాల్లోనూ డే పాస్ లు

ఇప్పటి వరకు సిటీలోనే ఉన్న డే పాస్ లు జిల్లాల్లో కూడా స్టార్ట్ చేశారు. సిటీలో టీ 24, టీ6, ఎఫ్ 24 పేర్లతో ప్యాసింజర్లకు రాయితీ పాస్ లు ఇస్తున్నరు. జిల్లాల్లో ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పల్లె వెలుగు బస్సుల్లో మహిళలు, సీనియర్ సిటిజన్లు ప్రయాణించేలా టీ 9 టికెట్ ను తీసుకొచ్చారు. గత నెల 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇది అమలవుతున్నది. రూ.100 చెల్లించి పాస్ తీసుకుంటే, 60 కిలోమీటర్ల పరిధిలో రానుపోను ఉచితంగా జర్నీ చేయోచ్చు.  ప్రస్తుతం ఈ పాస్ లు రోజుకు వెయ్యి సేల్ అవుతున్నాయని, రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. వివిధ పనుల కోసం గ్రామాల నుంచి సిటీలకు వెళ్లే ప్యాసింజర్లకు ఇవి ఎంతో ఉపయోగపడుతాయని అధికారులు భావిస్తున్నారు.