సమ్మె ఆపేది లేదు..  మంత్రితో చర్చల తర్వాత పంచాయతీ కార్మికుల ప్రకటన

సమ్మె ఆపేది లేదు..  మంత్రితో చర్చల తర్వాత పంచాయతీ కార్మికుల ప్రకటన
  • మంత్రితో చర్చల తర్వాత పంచాయతీ కార్మికుల ప్రకటన
  • 27న ‘చలో కలెక్టరేట్’ నిర్వహిస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ కార్మికులు, ఉద్యోగుల జేఏసీ నేతలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు శనివారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మె కొనసాగుతుందని పంచాయతీ కార్మికులు ప్రకటించారు. ఉద్యోగాలను రెగ్యులర్ చేయడం, జీతాలు పెంచడం, మల్టీ పర్సస్ విధానం రద్దు చేయడం వంటి 17 డిమాండ్లను పరిష్కరించాలని ఈ నెల 6 నుంచి సుమారు 45 వేల మంది కార్మికులు, ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. 

దీంతో కార్మిక సంఘాల జేఏసీ నేతలను మంత్రి దయాకర్ రావు చర్చలకు పిలిచారు. మినిస్టర్ క్వార్టర్స్​లోని మంత్రి నివాసంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో కార్మిక సంఘాల జేఏసీ నేతలు పాలడుగు భాస్కర్, యజ్ఞ నారాయణ, యూసఫ్​తో పాటు పలువురు నేతలు   దయాకర్ రావుతో సమావేశమయ్యారు.

వివిధ జిల్లాల నుంచి సుమారు వంద మంది గ్రామ పంచాయతీ కార్మికులు మినిస్టర్ క్వార్టర్స్​కు వచ్చారు. గంటపాటు జేఏసీ నేతలతో చర్చించిన మంత్రి దయాకర్ రావు.. జిల్లాల నుంచి  వచ్చిన కార్మికులతోనూ మాట్లాడారు. సమ్మె విరమిస్తే సీఎం వద్దకు తీసుకెళ్లి మాట్లాడిస్తామని చెప్పారు. వర్షాలు పడుతుండడంతో గ్రామాల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, అర్థం చేసుకుని వెంటనే విధుల్లో చేరాలని కోరారు. పీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తా నియా విదేశాల్లో ఉన్నారని, ఆయన రాగానే  సమస్యలపై చర్చిద్దామని చెప్పారు. మంత్రి ప్రతిపాదనపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం రూ.8,500 జీతానికి ఎలా పనిచేస్తారని మంత్రిని ప్రశ్నించామని, కానీ ఆయన పట్టించుకోకుండా వెళ్లిపోయారని కార్మికులు చెప్పారు.

సమ్మె ఆపే ప్రయత్నాలను తిప్పికొట్టాలి

మంత్రితో చర్చల తర్వాత  హిమాయత్ నగర్​లో కార్మిక సంఘాల జేఏసీ నేతలు, కార్మికులు సమావేశమయ్యారు. సమ్మె కొనసాగుతుందని ప్రకటించారు. ఈ నెల 27న అన్ని జిల్లాల్లో చలో కలెక్టరేట్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ మేరకు జేఏసీ చైర్మన్ పాలడుగు భాస్కర్, జనరల్ సెక్రటరీ యజ్ఞ నారాయణ ఒక ప్రకటన రిలీజ్​ చేశారు. గతంలోనూ ప్రభుత్వాలు సమ్మె విరమించాక పట్టించుకోలేదని, ఈ సారి సమస్యలు పరిష్కారం అయ్యేదాక పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.  కనీస వేతనాలు, మల్టీ పర్పస్ విధానం రద్దు, కార్మికులను రెగ్యులరైజ్, కారోబార్, బిల్ కలెక్టర్లకు ప్రమోషన్లతోపాటు మిగిలిన డిమాండ్లు కూడా పరిష్కారం కావాల్సిందేనన్నారు. సమ్మెను ఆపేందుకు కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని, అటువంటి వాటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.