‘ఎమ్మెల్సీ’ తాయిలాలు షురూ

‘ఎమ్మెల్సీ’ తాయిలాలు షురూ
  •     ప్రైవేటు మేనేజ్మెంట్లు, నిరుద్యోగులను మచ్చిక చేసుకునే ప్రయత్నం
  •     మొన్న విద్యాసంస్థల ప్రతినిధులతో నలుగురు మంత్రుల భేటీ
  •     సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ
  •     నిన్న గ్రూప్ 4 ఫలితాల విడుదలతో నిరుద్యోగులకు దగ్గరయ్యే యత్నం
  •      గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి కోసమేనంటున్న విద్యావేత్తలు

హైదరాబాద్, వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న రాష్ట్ర సర్కారు, వాటిలో గెలవడం కోసం ఇప్పటి నుంచే అందరినీ తమవైపు తిప్పుకునే పనిలో పడింది. ఇప్పటివరకూ పట్టించుకోని వారందరినీ కలిసే ప్రయత్నం చేస్తోంది. గతం గతహా… ఇప్పటి నుంచే లెక్క అన్నట్టు, అనధికార ఎన్నికల ప్రచారపర్వాన్ని మొదలుపెట్టింది. రెండు స్థానాల్లో గెలిచి గ్రాడ్యుయేట్లలోనూ తాము బలంగా ఉన్నామనే సంకేతాన్ని ప్రతిపక్షాలకు ఇవ్వాలని టీఆర్ఎస్​భావిస్తోంది.

ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు…

హైదరాబాద్‌‌‌‌- రంగారెడ్డి- మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ తోపాటు నల్గొండ-వరంగల్‌‌‌‌- ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చిలో​ జరగనున్నాయి. ఈ ఎన్నికలు సర్కారుకు పెద్ద తలనొప్పిగా మారాయి. గతంలో ‘కరీంనగర్’ గ్రాడ్యుయేట్ సెగ్మెంట్​లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి ఓడిపోయారు. ప్రస్తుతం జరిగే రెండు నియోజకవర్గాల్లో ‘నల్గొండ’ టీఆర్ఎస్ కు​ సిట్టింగ్ స్థానం కాగా, ‘హైదరాబాద్’ కు బీజేపీ మెంబర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు కొత్త స్థానాన్ని గెలవడం టీఆర్ఎస్​కు కష్టంగా మారింది. పీఆర్సీ, ఐఆర్ ఇవ్వకపోవడం, బదిలీలు చేపట్టకపోవడం, పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో అందరూ సర్కారుపై గరంగానే ఉన్నారు. ఇప్పటివరకూ ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు నిరుద్యోగుల గురించి పెద్దగా పట్టించుకోని సర్కారు, ప్రస్తుతం పలు తాయిలాలు అందించి వారిని టీఆర్ఎస్ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

ఎంప్లాయీస్​కు కట్ చేసిన జీతాలు చెల్లింపు..

లాక్ డౌన్ కాలంలో మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి టీచర్లు, ఎంప్లాయిస్​ జీతాల్లో, పింఛనర్ల పింఛన్​లో సర్కారు కోత పెట్టింది. అయితే తాజాగా పింఛనర్లకు రెండు విడతల్లో, ఎంప్లాయీస్​, టీచర్లకు నాలుగు విడతల్లో బకాయిలు చెల్లిస్తామని ఉత్తర్వులిచ్చింది. మార్చిలో నెలాఖరు వరకు, మే నెలలో కొంత లాక్​డౌన్ సడలింపులు చేసినా  జీతాల్లో కోత వేయడంతో సర్కారుపై టీచర్లు, ఎంప్లాయీస్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ధనిక రాష్ర్టంగా చెప్పుకునే తెలంగాణలో జీతాల్లో కోతపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కట్ చేసిన వేతనాలను ఇవ్వడం ద్వారా వారిని కొంత శాంతింపచేయొచ్చనే భావనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రైవేట్ మేనేజ్మెంట్లకు హామీలే.. హామీలు..

ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లంతా దాదాపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లుగా ఉంటారు. దీంతో ఆ విద్యాసంస్థల మేనేజ్మెంట్లను ప్రసన్నం చేసుకోవాలని సర్కారు భావించి, ఇటీవల కేజీ టూ పీజీ స్థాయిలోని మేనేజ్మెంట్ల లీడర్లందరితో సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి మంత్రులు కేటీఆర్, సబితా, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ తోపాటు తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్​రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొని మేనేజ్మెంట్లకు అనేక హామీలిచ్చారు. స్కూళ్లకు ఇంటర్ మాదిరిగా ఫైర్ మినహాయింపులు ఇవ్వడం, ప్రాపర్టీ ట్యాక్స్​లు, కరెంటు బిల్లుల కేటగిరిలో మార్పులు, ఇంటర్ కాలేజీలకు ఐదేండ్లకోసారి రెన్యూవల్ తోపాటు పలు అంశాల్లో సర్కారు సానుకూలంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే ఇన్నేండ్లు తమను పెద్దగా పట్టించుకోని ప్రభుత్వం.. ఈ మీటింగ్ వెనుకున్న అంతరార్థాన్ని గుర్తించినట్టు ప్రైవేటు విద్యా సంస్థల యజమానులు చెబుతుండటం గమనార్హం.

నిరుద్యోగులకు దగ్గరయ్యేందుకు..

2018లో ఇచ్చిన గ్రూప్ 4 నోటిఫికేషన్ ​ఫలితాలను ఇటీవల టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసింది. 1,595 పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల లిస్టును ప్రకటించింది. అయితే రాష్ర్టంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, ఇచ్చిన వాటిలో పూర్తిస్థాయిలో పోస్టులను భర్తీ చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ ఫలితాలు రిలీజ్ చేయడంతో  కొంత వ్యతిరేకతను తగ్గించుకోవచ్చనే భావనలో సర్కారు ఉంది. అయితే ఇంకా పలు పోస్టుల రిజల్ట్ వివిధ కారణాలతో ఇవ్వకపోవడం, కొత్త నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంపై నిరుద్యోగుల నుంచి మాత్రం వ్యతిరేకత అలాగే కొనసాగుతోందని విద్యావేత్తలు చెబుతున్నారు.