
'దసరా' మూవీతో తన సత్తా చాటిన శ్రీకాంత్ ఓదెల , నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం 'ది ప్యారడైజ్'. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు కూడా తారాస్థాయికి చేరాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కోసం హైదరాబాద్ శివార్లలో 30 ఎకరాల విస్తీర్ణంలో ఒక అతిపెద్ద మురికివాడ సెట్‌ను కూడా నిర్మిస్తున్నారు. దీనిని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలు 'స్లమ్స్‌కు బాహుబలి' అంటూ పోలుస్తున్నాయి..
అయితే లేటెస్ట్ గా వచ్చిన అప్టేడ్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. 'ది ప్యారడైజ్' చిత్రంలో సీనియర్ నటుడు మోహన్‌బాబు ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దీనిని ఆయన కుమార్తె మంచు లక్ష్మీ స్వయంగా వెల్లడించారు. 'దక్ష' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆమె.. తన తండ్రి సినిమా పట్ల చూపించే అంకితభావాన్ని ప్రశంసించారు. ఈ వయసులో కూడా నాన్న తన పాత్ర కోసం చాలా కష్టపడుతున్నారు. ఆయన పాత్రకు శారీరక ఫిట్‌నెస్ అవసరం కావడంతో, రోజూ క్రమం తప్పకుండా వర్కవుట్స్ చేస్తున్నారని చెప్పారు.
కొత్త డైరెక్టర్ అయినా, అనుభవం ఉన్న డైరెక్టర్ అయినా మా నాన్న పని పట్ల చూపించే నిబద్ధత మారదని మంచి లక్ష్మీ అన్నారు. షూటింగ్ సెట్‌లో ఒక విద్యార్థిలా అందరినీ ప్రేరేపిస్తారు అని చెప్పారు. మోహన్‌బాబు ఈ చిత్రంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారనేది ప్రస్తుతం సస్పెన్స్ గా ఉంచారు మంచు లక్ష్మీ . అయితే ఆయన గత చిత్రాల మాదిరిగానే ఈ రోల్ కూడా పవర్ఫుల్‌గా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రం మోహన్‌బాబు కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మంచు లక్ష్మి ఇదే వేదికపై తన సోదరుడు మంచు మనోజ్ గురించి కూడా ప్రస్తావించారు. 'మిరాయ్' చిత్రంలో ప్రతినాయకుడిగా మనోజ్ తిరిగి రావడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మనోజ్ పడ్డ కష్టాలు, వ్యక్తిగత సమస్యలను అధిగమించి మళ్ళీ నటనలోకి రావడం గొప్ప విషయమని ఆమె కొనియాడారు. 'ది ప్యారడైజ్' ప్రపంచ వ్యాప్తంగా మార్చి 26, 2026న తెలుగుతో పాటు తమిళం, హిందీ, అలాగే స్పానిష్ భాషల్లో కూడా విడుదల కానుంది.
►ALSO READ | బర్త్ డే స్పెషల్.. రగ్గడ్ లుక్‌లో మాధవ్
ఈ చిత్రం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తుండటంతో, గతంలో ఆయన 'దసరా' చిత్రంతో సృష్టించిన ప్రభంజనం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్లు, పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిత్రంలో హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్, విజువల్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో రాఘవ్ జుయల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్, నాని సొంత సంస్థ యూనియానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సరికొత్త రికార్డును సృష్టిస్తోందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు..