పార్టీ నుంచి పోయేటోళ్లతో నష్టం లేదు : కేసీఆర్

పార్టీ నుంచి పోయేటోళ్లతో నష్టం లేదు : కేసీఆర్
  •     పార్టీలో బుల్లెట్ల మాదిరి కార్యకర్తలు ఉన్నరు
  •     ఎన్నికల్లో ప్రజలు ఊహించని తీర్పు ఇచ్చారు
  •     కొన్నిసార్లు ఇసొంటి తమాషాలు జరుగుతుంటయ్
  •     మళ్లీ అధికారం మనదే
  •     ఆర్మూర్, హుజూరాబాద్ సెగ్మెంట్ నేతలతో బీఆర్ఎస్ చీఫ్ భేటీ

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ విడిచి పోయేటోళ్లతో ఎలాంటి నష్టం లేదని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ అన్నారు. పార్టీలోకి లీడర్లు వస్తుంటారని.. పోతుంటారని తెలిపారు. ఈ ఫిరాయింపులతో బీఆర్ఎస్​లో మార్పు ఏమీ ఉండదని స్పష్టం చేశారు. పార్టీ అనేది నాయకులను సృష్టిస్తుందన్నారు. ఇంకా బీఆర్ఎస్​లో బుల్లెట్ల మాదిరి కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. వారినే నాయకులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎర్రవల్లిలోని ఫామ్​హౌస్ లో హుజూరాబాద్, ఆర్మూర్ నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘బీఆర్‌‌‌‌ఎస్ పార్టీ ఎవరికైతే టికెట్, బీఫామ్ ఇస్తదో.. వాళ్లే సిపాయిల మాదిరి తయారవుతరు. అసెంబ్లీ ఎన్నికల్లో జనాలు ఊహించని తీర్పు ఇచ్చారు. కొన్నిసార్లు ఇసుంటి తమాషాలు జరుగుతుంటయ్. అప్పుడు కాంగ్రెస్​కు ఓటేసి గెలిపించిన ప్రజలే.. ఇప్పుడు బాధపడ్తున్నరు. పాలిచ్చే బర్రెను అమ్మి.. దున్నపోతును తెచ్చుకున్నామని ఫీల్ అవుతున్నరు’’అని కేసీఆర్ అన్నారు. 

ఎన్టీఆర్‌‌‌‌ కంటే గొప్పగా గెలుస్తం

బీఆర్‌‌‌‌ఎస్ తీసుకొచ్చిన స్కీమ్​లు తమకు అందడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నట్టు కేసీఆర్ తెలిపారు. ‘‘ఎవరికీ సీఎంఆర్ఎఫ్, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బంధు అందట్లేదు. తాగునీరు, సాగునీరు వస్తలేవు. గివన్నీ ప్రజల మనసుల్లో రికార్డ్ అవుతున్నయ్. మనం ఎంతో కష్టపడి నిర్మించుకున్న తెలంగాణ.. కాంగ్రెస్ పాలనలో దారి తప్పుతున్నది. రోజు రోజుకూ పాలన దిగజారుతున్నది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. నిచ్చెన మెట్లు ఎక్కేది పోయి.. మొదటి దశలోనే మెట్లు దిగజారుకుంటూ వస్తున్నది”అని కేసీఆర్ అన్నారు. ‘‘నాడు ఎన్టీఆర్‌‌‌‌ను తిరిగి ఎట్లైతే ప్రజలు గద్దె మీద కూర్చోబెట్టారో, అంతకన్నా గొప్పగా బీఆర్‌‌‌‌ఎస్‌‌ను ప్రజలు తిరిగి ఆదరిస్తరు. అంతకంటే రెట్టింపు మద్దతుతో మనల్ని గద్దె మీద కూర్చోబెడ్తరు. ఆ రోజు త్వరలోనే వస్తది’’అని కార్యకర్తలకు కేసీఆర్ ధైర్యం చెప్పారు. అప్పటి దాకా ఓపికగా ఉండాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. భేటీలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

అధికారం చేజిక్కించుకుంటాం

తన పాతికేండ్ల ప్రజా ప్రస్థానం ఇక్కడితో ముగియలేదని, ఇంకా మరెన్నో గొప్ప లక్ష్యాలను చేరుకుంటూ ముందుకు సాగాల్సి ఉందని కేసీఆర్ అన్నారు. ‘‘రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునే దాకా నా జర్నీ కొనసాగుతూనే ఉంటది. కాంగ్రెస్ పాలనలో ఆగమైతున్న తెలంగాణను మళ్లీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇట్ల వస్తయని అనుకోలే. కొన్నికొన్ని సార్లు ఇట్ల జరుగుతుంటది. చరిత్రలోకి వెళ్తే అర్థం అయితది. కాంగ్రెసోళ్లు ఇచ్చిన అమలుగాని హామీలను నమ్మి ప్రజలు మోసపోయిన్రు’’అని కేసీఆర్ అన్నారు.