బీజేపీ నుంచి రాజ్యసభకు మరో ముగ్గురు

బీజేపీ నుంచి రాజ్యసభకు మరో ముగ్గురు

బీజేపీ నుంచి రాజ్యసభకు మరో ముగ్గురు

అభ్యర్థుల పేర్లు ప్రకటించిన పార్టీ హైకమాండ్ 

న్యూఢిల్లీ : రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ నుంచి బుధవారం మరో ముగ్గురి పేర్లను పార్టీ హైకమాండ్ ప్రకటించింది. గుజరాత్ నుంచి కేస్రిసిన్హ్ జలా, బాబూభాయ్ దేశాయ్ పేర్లను ప్రకటించగా, వారు బుధవారమే నామినేషన్లను దాఖలు చేశారు. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారుడు అనంత రాయ్ మహరాజ్ అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేసింది. కాగా, గుజరాత్ (3), పశ్చిమ బెంగాల్ (6), గోవా (1) రాష్ట్రాల్లోని 10 రాజ్యసభ స్థానాల్లో ఎన్నికలకు నామినేషన్ల గడువు గురువారం నాటితో ముగియనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు గడువు ఉండగా, 24వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్ లో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, విదేశాంగ మంత్రి జైశంకర్ సోమవారమే బీజేపీ నుంచి నామినేషన్ వేశారు. ఇక్కడ కాంగ్రెస్ తన అభ్యర్థులను పోటీకి నిలబెట్టకపోవడంతో బీజేపీ అభ్యర్థులు సునాయాసంగా గెలవనున్నారు.

రాష్ట్ర నేతలకు దక్కని చోటు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రం నుంచి ఒకరికి రాజ్యసభ సీటు దక్కుతుందని ఆశించినప్పటికీ, పార్టీ హైకమాండ్ అవకాశం ఇవ్వకపోవడంతో రాష్ట్ర బీజేపీ నేతలు నిరాశ చెందారు. త్వరలో గుజరాత్, పశ్చిమ బెంగాల్, గోవాలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ హైకమాండ్ బుధవారం అభ్యర్థులను ప్రకటించింది. గుజరాత్ నుంచి ఇద్దరికి, పశ్చిమ బెంగాల్ నుంచి ఒకరికి అవకాశం కల్పించింది. అయితే పోయినసారి ఉత్తరప్రదేశ్ నుంచి సీనియర్ నేత లక్ష్మణ్​కు రాజ్యసభ అవకాశం ఇచ్చిన హైకమాండ్.. ఈసారి కూడా తెలంగాణ నుంచి సీనియర్ నేతకు తప్పకుండా అవకాశం కల్పిస్తుందని రాష్ట్ర నేతలు భావించారు. దీనిపై గత వారం, పది రోజులుగా రాష్ట్ర పార్టీలో విస్తృతంగా ప్రచారం సాగింది. దీంతో కనీసం డజను మంది సీనియర్ నేతలు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో హైకమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టిందని, రాష్ట్ర నేతలకు రాజ్యసభ సీటుతో పాటు కేంద్రమంత్రి పదవి కూడా దక్కవచ్చని ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు సీనియర్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ హైకమాండ్ ప్రకటించిన లిస్టులో తెలంగాణ నుంచి ఎవరి పేరు లేకపోవడంతో రాష్ట్ర నేతలు అసంతృప్తిలో ఉన్నారు.