నడ్డా, అమిత్ షా సభల్లో జాయినింగ్స్ లేకపోవడంపై హైకమాండ్ ఆరా 

నడ్డా, అమిత్ షా సభల్లో జాయినింగ్స్ లేకపోవడంపై హైకమాండ్ ఆరా 
  • నడ్డా, అమిత్ షా సభల్లో జాయినింగ్స్ లేకపోవడంపై హైకమాండ్ ఆరా 
  • సీనియర్ల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే అని ఢిల్లీకి ఫిర్యాదులు 
  • ముందు బీజేపీలో చేరాలనుకున్న ఓదెలు 
  • ఆయన కాంగ్రెస్​లో చేరడంతో రాష్ట్ర నాయకత్వం అలర్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో బీజేపీలోకి చేరికలు ఆగిపోవడంపై పార్టీ హైకమాండ్ ఆరా తీసింది. ఇటీవల నిర్వహించిన బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభల్లోనూ చేరికలు లేకపోవడాన్ని గుర్తించి, అందుకు గల కారణాలపై రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించింది. నడ్డా, అమిత్ షా సభల్లో భారీగా  చేరికలు ఉంటాయని, వారిలో కొందరు ముఖ్య నేతల కూడా ఉన్నారని ప్రచారం జరిగింది. కానీ తీరా ఆ రెండు సభల్లో ఒక్కరన్నా చేరకపోవడంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం నిరాశ చెందింది. పార్టీలో చేరికల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ వేసినా జాయినింగ్స్ విషయంలో జాప్యం జరుగుతుండటంతో హైకమాండ్ అసంతృప్తితో ఉన్నట్లు రాష్ట్ర వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారం తమదేననే ధీమాతో ఉన్న హైకమాండ్.. ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి తీసుకురావడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమవుతుండటంతో ఆందోళన చెందుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 119 నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉండాలంటే, చేరికలు అనివార్యమని హైకమాండ్ భావిస్తోంది. గతంలో బీజేపీలోకి టీఆర్ఎస్, కాంగ్రెస్​ల నుంచి భారీగా వలసలు వచ్చినా.. గత కొద్ది నెలలుగా ఈ ప్రక్రియ ఆగిపోయింది. దీనికి కొందరు ముఖ్య నేతల మధ్య సరైన సమన్వయం లేకపోవడమే ప్రధాన కారణమనే ఫిర్యాదులు ఢిల్లీకి చేరినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

హైకమాండ్ అసహనం...  

ఈ నెల 5న మహబూబ్ నగర్​లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు నడ్డా వచ్చారు. సభకు ముందు రాష్ట్ర ఆఫీసు బేరర్లతో ఆయన సమావేశమై చేరికలపై దృష్టి పెట్టాలని సూచించారు. “మీకన్నా పెద్ద నాయకులను పార్టీలోకి ఆహ్వానించండి. మీ రాజకీయ భవిష్యత్తును మాకు వదిలేయండి. పెద్దవాళ్లు వస్తే మా పరిస్థితి ఏంటనే భయం మీకొద్దు” అని నడ్డా చెప్పారు. అమిత్ షా సభలో భారీగా చేరికలు ఉండేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. దీంతో ఈ నెల 14న తుక్కుగూడలో జరిగిన షా సభలో భారీగానే చేరికలు ఉంటాయని ప్రచారం జరిగింది. కానీ ఆ సభలో చేరికలు లేకపోవడంతో రాష్ట్ర నాయకత్వంపై హైకమాండ్ అసహనం వ్యక్తం చేసినట్లు పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. 

ఓదెలు చేరికపై ఆలస్యం... 

టీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య భాగ్యలక్ష్మీ కాంగ్రెస్​లో చేరడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం అలర్ట్ అయింది. ఓదెలు ముందుగా బీజేపీలో చేరాలని భావించినా, కానీ బీజేపీ నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో ఓదెలు చేరికపై జాప్యం జరిగిందని, అందుకే ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని ప్రచారం జరుగుతోంది. బీజేపీలో ఇతర పార్టీల నేతలకు చేరాలని ఉన్నా.. వారిని సరిగ్గా డీల్ చేయలేకపోవడంపై ఢిల్లీ నేత ఒకరు రాష్ట్ర నాయకత్వాన్ని వివరణ కోరినట్లు ప్రచారం జరుగుతోంది.