జీఐఎస్తో సుస్థిర అభివృద్ధికి మార్గం

జీఐఎస్తో సుస్థిర అభివృద్ధికి మార్గం

హైదరాబాద్ నగరం.. చరిత్ర,  సంస్కృతి,  ఆధునికతల  సమ్మేళనం.  గోల్కొండ,  చార్మినార్, బిర్లా మందిర్, సరస్సులు, మ్యూజియంలు, మూసీ పరీవాహక ప్రాంతం వంటి వనరులు నగరానికి ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నాయి.  కానీ ఈ సంపదను కలిగి ఉండటం ఒక్కటే సరిపోదు. దానిని సుస్థిరంగా ఎలా వినియోగించాలి అన్నదే అసలు ప్రశ్న.  ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి నేను  హైదరాబాద్ నగరంలోని పర్యాటక వనరులను జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) ఆధారంగా విశ్లేషించాను.

జీహెచ్ఎంసీ  పరిధిలోని 100కు పైగా  ప్రదేశాలను  ప్రత్యక్షంగా పరిశీలించి జీపీఎస్, డ్రోన్ సర్వేలు, క్షేత్రస్థాయి పరిశీలనల ద్వారా డేటా సేకరించాను. ఈ అధ్యయనంలో చారిత్రక కట్టడాలు, మతపరమైన కేంద్రాలు, సరస్సులు, పార్కులు, మ్యూజియంలు, ఆధునిక వినోద కేంద్రాలు, చేతివృత్తుల ప్రాంతాలు, పర్యావరణ వనరులు, మూసీ నదీ పరీవాహక ప్రాంతం వంటి విభాగాలను గుర్తించాను.

ఈ విశ్లేషణలో  కొన్ని ముఖ్యమైన విషయాలు స్పష్టమయ్యాయి.  మొదటిది,  పర్యాటకుల దృష్టి కొన్ని ప్రధాన ప్రదేశాలకే పరిమితమవుతోంది.  దాంతో  పురానాపూల్ దర్వాజా, సర్దార్ మహల్,  మలక్‌‌‌‌పేట్ గంజ్ వంటి విలువైన  కట్టడాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.  రెండోది, చార్మినార్, బిర్లా మందిర్ వంటి ప్రదేశాలు తమ సామర్థ్యానికి మించి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.  ఫలితంగా రద్దీ, పరిశుభ్రత సమస్యలు, కట్టడాలపై ఒత్తిడి పెరుగుతోంది.

మూడోది, మూసీ నది పరీవాహక ప్రాంతం చారిత్రకంగా ఎంతో విలువైనదైనా,  కాలుష్యం,  ఆక్రమణలు, నిర్లక్ష్యం వల్ల దాని సామర్థ్యం పూర్తిగా వినియోగంలోకి రాలేకపోతోంది. ఈ పరిస్థితిని మార్చడానికి జీఐఎస్ చాలా ఉపయోగకరమైన సాధనం. ఇది కేవలం మ్యాప్  తయారుచేయడం కాదు, ఎక్కడ అభివృద్ధి అవసరమో,  ఎక్కడ భారం తగ్గించాలో,  ఎక్కడ  కొత్త  పర్యాటక అవకాశాలు ఉన్నాయో చూపిస్తుంది.  నగరంలోని వనరులను స్థలపరంగా విశ్లేషించడం ద్వారా నిర్ణయాలు  మరింత  సమర్థవంతంగా తీసుకోవచ్చు.

హెరిటేజ్ ఎకో సర్క్యూట్ రూపొందించాలి
నా అధ్యయనం ఆధారంగా మూడు ముఖ్య సూచనలు ఉన్నాయి.  మొదటిది పర్యాటకాన్ని వికేంద్రీకరించాలి. అంటే, ఎక్కువ సామర్థ్యం ఉండి కూడా తక్కువగా సందర్శిస్తున్న  ప్రదేశాలను ద్వితీయ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి.

రెండోది మూసీనది చుట్టూ హెరిటేజ్-ఎకో సర్క్యూట్ రూపొందించాలి. ఆలయాలు, వంతెనలు, చారిత్రక ప్రదేశాలను కలుపుతూ నడక మార్గాలు, సైక్లింగ్ ట్రాక్‌‌‌‌లు ఏర్పాటు చేస్తే పర్యాటకం, ఉపాధి,  పరిరక్షణ అన్నీ కలిసి ముందుకుసాగుతాయి.  మూడోది  జీఐఎస్ ఆధారంగా వనరుల కేటాయింపు జరగాలి.

ఏ చెరువు శుభ్రం చేయాలి, ఏ ప్రాంతంలో  రోడ్డు లేదా మౌలిక సదుపాయం పెంచాలి, ఏ ప్రదేశానికి ఎక్కువ పర్యాటక ఒత్తిడి ఉందో డేటా ఆధారంగా నిర్ణయించాలి. హైదరాబాద్‌‌‌‌ను  నిజంగా  సుస్థిర  పర్యాటక నగరంగా మార్చాలంటే  కొత్త నిర్మాణాల కంటే ఉన్న సంపదను  కాపాడుకోవడమే ముఖ్యం. చరిత్రను సంరక్షిస్తూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తేనే  అర్థవంతమైన అభివృద్ధి అవుతుంది. ఈ దిశగా  జీఐఎస్​ ఆధారిత  ప్రణాళిక హైదరాబాద్‌‌‌‌కు దీర్ఘకాలిక మార్గాన్ని చూపగలదు.

డా. రామకృష్ణ మనిమద్దె, ఎర్త్ సైంటిస్ట్, ఏహెచ్​పీజీఐఎస్​ & రివర్ సిస్టమ్స్ ఎక్స్​పర్ట్

  • ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.