మన్నెగూడెం మండలం కోసం గ్రామస్థుల ధర్నా

మన్నెగూడెం మండలం కోసం గ్రామస్థుల ధర్నా

జగిత్యాల: తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని మన్నెగూడెం ప్రజలు జిల్లా కేంద్రంలో ధర్నాకు దిగారు. ఈ క్రమంలో రోడ్లను నలువైపులా దిగ్బంధం చేశారు. గాంధీ, అంబేద్కర్ ప్లకార్డులు చేతబూని నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ... మండల కేంద్రానికి కావాల్సిన అన్ని అర్హతలు తమ గ్రామానికి ఉన్నప్పటికీ... ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఒకప్పుడు తమ గ్రామాన్ని కాదని... మేడిపల్లిని మండలంగా ఏర్పాటు చేశారన్నారు. ఇటీవల కొత్త మండలాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం... తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. స్వరాష్ట్రం వచ్చిన దగ్గరి నుంచి తమ గ్రామాన్ని మండలంగా చేయాలని పోరాడుతున్నామని, కానీ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మన్నెగూడెంను మండలంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. 

 

కాగా... రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో రిలీజ్ చేసింది.  నారాయణ పేట జిల్లాలో గుండుమల్, కొత్తపల్లెలను మండలాలుగా మార్చారు. వికారాబాద్ జిల్లాలోని దుడ్యాల్, మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల, నిజామాబాద్ జిల్లాలోని ఆలూర్, డొంకేశ్వర్, సాలూర గ్రామాలను మండలాలు మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో సీరోల్, నల్గొండ జిల్లాలో గట్టుప్పల్, సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట్, కామారెడ్డి జిల్లాలో డోంగ్లి, జగిత్యాల జిల్లా ఎండపల్లి, జగిత్యాల జిల్లాలో భీమారం లను నూతన మండలాలుగా ఏర్పాటు చేశారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే  కొత్త మండలాల కోసం జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.