మార్పు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. హైదరాబాద్‌ను దేశంలోనే అతి పెద్ద నగరంగా ఆవిష్కరించడానికి తీసుకున్న గ్రేటర్‌ను మెగాగా మార్చే నిర్ణయం వల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనాలు, ప్రయాసల గురించి ప్రజల్లో చర్చ జరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆనుకొని ఉండే శివారు మున్సిపాలిటీల పరిస్థితి ఇప్పటికీ అధ్వానమే. అలాంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం కావడం కొంత ఆనందాన్ని ఇచ్చింది. నిధులు , సిబ్బంది కొరత , సరిపోని ఆదాయం వలన శివారు మున్సిపాలిటీల ప్రజల అవస్థలు తీరుతాయనే ఆశ పెరిగింది. మరికొన్ని ఇతర విషయాల్లో కొంత ఖేదం కూడా ఉంది.
జీహెచ్ఎంసీకి ఆనుకొని ఉండే శివారు మున్సిపాలిటీలలో రోడ్డుకు రెండు పక్కల వేర్వేరు పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. సగం రోడ్డు బాగుంటే, సగం బాగుండదు. రోడ్డులో కొంత ప్రాంతం పరిశుభ్రత ఉంటే కొంత ప్రాంతం చెత్తా చెదారం నిండి ఉంటుంది. కొంత ప్రాంతానికి వాటర్ సప్లై రెగ్యులర్‌గా ఉంటే ఇంకో ప్రాంతానికి నీళ్లు రాని పరిస్థితి ఉంటుంది. రాత్రి సగం ప్రాంతంలో స్ట్రీట్ లైట్స్ వెలిగితే, సగం వెలగవు. కారణం తెలియంది కాదు, ఒక ప్రాంతం జీహెచ్ఎంసీలో ఉంటే మరొకటి మున్సిపల్ పరిధిలో ఉండడమే . ఇకనుంచి ఈ పరిస్థితి వీలనంతో కనుమరుగు కావొచ్చు. ఇప్పటి వరకు మున్సిపాలిటీల పాలనలో అరకొర సేవలతో అవస్థలు అనుభవించిన ప్రజలకు సాధారణ రోజువారీ సేవలు మెరుగవుతాయని ప్రజలు భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ బడ్జెట్ పెద్దది కావడంతో అభివృద్ధి పనులు వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. పరిశుభ్రత, చెత్త సేకరణ మెరుగ్గా , రెగ్యులర్‌గా జరిగి పారిశుధ్యసిబ్బంది సేవలలో మార్పు కన్పించే అవకాశం ఉంది. పౌర సేవలు చాలామేరకు మెరుగు పడుతాయనే ప్రజలు ఆశిస్తున్నారు. కానీ, ప్రజలు భావిస్తున్నట్టు జరగాలంటే, రాబోయే పాలన విధానంపైనే అంతా ఆధారపడిఉంటుంది.
విలీనం వల్ల భారాలు!
విలీనంతో ప్రజలకు వచ్చే నష్టాలు, సవాళ్లు గురించి కూడా ప్రజల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. పన్నులు, ప్రాపర్టీ టాక్స్‌లు పెరిగే అవకాశం ఉంటుందనే అనుమానం ప్రజల్లో ఉంది. అది సాధారణ, మధ్య తరగతి ప్రజల కు కొంతభారంగా మారే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ప్రాపర్టీ టాక్స్ రేట్లు స్థానిక గ్రామ పంచాయతీ లేదా చిన్న మున్సిపాలిటీల కంటే ఎక్కువగా ఉంటాయనేది అందరికీ తెలిసిందే.. ఇక్కడ ప్రభుత్వ నుంచి ప్రజలు ఆశించేది పన్నులు, సేవల ధరలు కొత్తగా విలీనం అయిన ప్రాంతాలవారికి ఒకటి, లేదా రెండు సంవత్సరాల వరకు ఇప్పుడు ఉన్న పన్నులే వర్తింప చేసి కొంత రిలీఫ్ కల్పించాల్సిన అవసరం మాత్రం ఉంది. జీహెచ్ఎంసీలో ఫైలు ప్రాసెస్ నెమ్మదిగా నడవడం తెలిసిందే. సమస్యల నివేదన, ఇతర అప్లికేషన్లు అంతా ఆన్లైన్లోనే జరుగుతున్నా.. ప్రజలు సమస్యల తీవ్రతను అధికారులతో చర్చించే అవకాశం తక్కువే. స్థలం / భూమి రెగ్యులరైజేషన్ ఖర్చులు పెరగవచ్చు. ఇది అల్పాదాయ వర్గాల ప్రజలకు చాలా భారమైన పరిస్థితి ఉంటుంది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ వంటి పథకాల ఫీజులు పెరిగే అవకాశం ఉండొచ్చు. ఏదేమైనా విలీనంతో జీహెచ్ఎంసీతో సమానంగా, విలీనమైన 27 మున్సిపాలిటీలు కూడా అభివృద్ధి చెందితే మంచిదే. అలా జరగనుందా లేదా అనేది మాత్రమే చూడాల్సి ఉంది!
సామల శ్రీనివాస్

