రెండు గ్రామాలను పోలీస్​స్టేషన్​ మెట్లు ఎక్కించిన మేక

రెండు గ్రామాలను పోలీస్​స్టేషన్​ మెట్లు ఎక్కించిన మేక
  • మాదంటే మాదంటూ పోలీసులను ఆశ్రయించిన్రు 
  • నచ్చజెప్పి పంపించిన పోలీసులు 
  • 15 రోజులుగా తేలని పంచాయితీ

దమ్మపేట, వెలుగు : ఇప్పటివరకు గొడవలతోనో...కొట్టుకునో..ఇతర కేసులతోనో పోలీస్ స్టేషన్ కు వెళ్లేవాళ్లను చూశాం. కానీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ మేక తమదంటే తమదంటూ రెండు గ్రామాల ప్రజలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. దమ్మపేట మండలం పూసుకుంట పంచాయతీ పరిధిలోని పూసుకుంట, కటుకూరు గ్రామాల్లో గుత్తికోయలుంటున్నారు. వీరు మేకలను మేపుకుంటూ బతుకుతారు. 15 రోజుల కింద పూసుకుంటకు  చెందిన మేకలు మేతకు అడవికి వెళ్లగా సాయంత్రం ఇంటికి వచ్చే టైంలో ఓ మేక తప్పిపోయింది. 

అది కటుకూరుకు సంబంధించిన మేకల గుంపులో కలిసిందని పూసుకుంట గ్రామస్తులు వాదించడంతో రెండు గ్రామాల మధ్య గొడవ మొదలైంది. పెద్దమనుషుల సమక్షంలో కూడా సమస్య తేలకపోవడంతో ఆదివారం రెండు గ్రామాల ప్రజలు మేకను తీసుకొని న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ కి వచ్చారు. మేక పంచాయితీ మీరే కూర్చొని తేల్చుకోవాలని చెప్పినా వినలేదు. తమ దగ్గర తేలలేదనే ఇక్కడికి వచ్చామని చెప్పారు. ఎంత సేపటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో పోలీసులు ఎస్సై వారికి సర్ది చెప్పి పంపించారు.