అడ్రస్​ అడిగి బైక్​పై ఎక్కించుకున్న వ్యక్తులు..కిడ్నాపర్లంటూ కలకలం

అడ్రస్​ అడిగి బైక్​పై ఎక్కించుకున్న వ్యక్తులు..కిడ్నాపర్లంటూ కలకలం
  •      అదేమీ లేదని కొట్టి పారేసిన పోలీసులు

కోరుట్ల, వెలుగు : జగిత్యాల జిల్లా కోరుట్లలోని సాయిరాంపురా కాలనీలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఇద్దరు పిల్లలను అడ్రస్​అడిగి బైక్​పై ఎక్కించుకోవడం కలకలానికి దారి తీసింది. ఆదివారం ఉదయం ఇద్దరు వ్యక్తులు నంబర్ ప్లేట్ లేని బైక్ పై వచ్చి ఓ ఇంటి అడ్రస్ చెప్పాలని మూడో తరగతి చదువుతున్న విశ్వేస్ , సాయి విగ్నేష్ లను అడిగి తర్వాత బైక్​పై ఎక్కించుకున్నారు. అక్కడే ఉన్న కొందరు స్థానికులు గమనించి ‘ఎవరు మీరు? పిల్లల్ని ఎక్కడికి తీసుకుపోతున్నరు’ అని ప్రశ్నించారు.

 కాలనీవాసులంతా గుమి గూడడంతో పిల్లల్ని బైక్ పై నుంచి దించి పారిపోయారు. కాలనీవాసులు పోలీసులకు సమాచారమివ్వడంతో అక్కడికి వచ్చి విచారణ చేపట్టారు. పిల్లలు, పేరెంట్స్, స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఘటనపై ఎస్సై కిరణ్ కుమార్ మాట్లాడుతూ పిల్లలు కిడ్నాప్ కు గురవుతున్నారంటూ వస్తున్న వార్తలు నిజం కాదని స్పష్టం చేశారు. ఆదివారం జరిగిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు ఓ ఇంటికి సంబంధించి అడ్రస్ కోసం వచ్చారని, కిడ్నాప్ చేయబోయారంటూ వచ్చిన వార్తలు నిజం కాదని  చెప్పారు.