సర్వే నంబర్ ఎంట్రీ చేస్తే చాలు.. ఆధార్​ సహా అన్నీ ఖుల్ల

V6 Velugu Posted on May 14, 2022

హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్​లో తప్పుల మీద తప్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలోని దాదాపు 65 లక్షల మంది పట్టాదారుల వ్యక్తిగత వివరాలకు కూడా అందులో గోప్యత లేకుండాపోయింది.  కొత్తగా తెచ్చిన మాడ్యుల్​తో కేవలం సర్వే నంబర్​ ఆధారంగా రైతు ఆధార్​ నెంబర్ తో పాటు ఇతర వివరాలు మొత్తం ఎవరైనా తెలుసుకోవచ్చు. అంతే కాదు.. ఆ రైతుకు సంబంధించిన పాస్​ పుస్తకాన్ని ఆ ఆధార్​ నంబర్​తో పోర్టల్​ నుంచి  డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. దీంతో అసలు ధరణిలో వ్యక్తిగత వివరాలతో పాటు జనం భూములకు ఎలాంటి భద్రత లేదనేది స్పష్టమవుతున్నది. ప్రభుత్వం ప్రింట్​ చేసి ఇంటి అడ్రస్​కు పంపించే కొత్త పాసుబుక్కుల్లోనూ ఆధార్​ చివరి నాలుగు అంకెలు మాత్రమే ఉంటాయి. అయితే తాజాగా పాస్​ బుక్కులో తప్పులు సరిదిద్దుకునేందుకు, విస్తీర్ణంలో మార్పులు చేర్పులకు తీసుకొచ్చిన పాస్​ బుక్​ డేటా కరెక్షన్​ మాడ్యుల్  కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టింది. గతంలో ఆధార్ అనుసంధానంతో ధరణి నాన్ అగ్రికల్చర్ తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆధార్, కులం వివరాల సేకరణపై హైకోర్టు స్టే విధించింది. డేటా భద్రతపై వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర సర్కార్​ నాన్​ అగ్రికల్చర్​ ఆస్తుల వివరాల నమోదు ఆపేసింది. ఇప్పటికే ధరణి సాప్ట్​వేర్​ ను దివాలా జాబితాలో ఉన్న సాప్ట్​వేర్​ సంస్థ చేతిలో పెట్టారని, భూరికార్డులు తీరుమారు చేసే అవకాశం ఉందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 

పాస్​బుక్​ కరెక్షన్​ మాడ్యుల్​తో..

పాస్ బుక్ లో పేరు తప్పుగా పడితే మార్చుకోవడం, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు,  నేచర్ ఆఫ్ ల్యాండ్, క్లాస్లిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ లో ఏమైనా మార్పులు ఉంటే చేసుకునేందుకు ఇటీవల ధరణిలో కొత్త మాడ్యుల్​ను ప్రభుత్వం తీసుకొచ్చింది. పోర్టల్​లో పాస్​బుక్ డేటా​ కరెక్షన్​ మాడ్యుల్​ క్లిక్​ చేసి.. అందులో సర్వే నెంబర్,​ గ్రామం, మండలం, జిల్లా ఎంట్రీ చేస్తే చాలు.. సంబంధిత పట్టాదారు ఆధార్​ నెంబర్​ వచ్చేస్తుంది. కొత్త మాడ్యుల్​ రానంత వరకు ఆధార్​ నంబర్​ చూసే చాన్స్​ లేదు. ఒకవేళ ఎక్కడైనా ఆధార్​ నంబర్​ కనిపించినా.. అది చివరి నాలుగు డిజిట్లు మాత్రమే వెరిఫికేషన్​ కోసం చూసేందుకు చాన్స్​ ఉండేది. ఇప్పుడు కొత్త మాడ్యుల్​లో పట్టాదారు పేరు, తండ్రి లేదా భర్త పేరు, జెండర్​, కులం, ఆధార్​, ఇతర వివరాలు కనిపిస్తున్నాయి. తర్వాత కింద పాసు బుక్కులో ఎన్ని సర్వే నంబర్లు, ఎంత విస్తీర్ణం భూమి ఉందనే సమాచారం కనిపిస్తున్నది. ఇందులో నుంచి ఆధార్​ నంబర్​ తీసుకుని.. ఆ నంబర్​ ఆధారంగా ధరణి పోర్టల్​లోనే ఉన్న ఆప్షన్​ ఆధారంగా పాస్​బుక్​ డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. దీంతో వ్యక్తిగత భద్రత, భూ వివరాల గోప్యత ప్రశ్నార్థకంగా మారింది. 

ధరణి.. మొదటి నుంచి సమస్యలే

ధరణి పోర్టల్​ను 2020 అక్టోబర్​లో ప్రారంభించారు. అప్పటి నుంచీ సమస్యలు వెంటాడుతున్నాయి. ఒక్కోదానికి ఒక్కోసారి ఒక్కో మాడ్యుల్​ను తీసుకొస్తూ ఉన్నారు. కేబినెట్​ సబ్​ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ధరణిలో ఉన్న ఇబ్బందులపై సబ్​కమిటీ సిఫార్సులు చేసింది. ధరణి సాఫ్ట్​వేర్​ రూపొందించిన కంపెనీ దివాలా జాబితాలో ఉండటంపై విమర్శలు వచ్చాయి. ఇటీవల తెచ్చిన కొత్త మాడ్యుల్ లో అప్లికేషన్​ పెట్టుకుంటే వెయ్యి రూపాయలు చార్జీ చేస్తున్నారు. ఇలా సమస్యలు సృష్టించడమే కాకుండా.. ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వం ధరణి పోర్టల్ నిర్వహిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ధరణి పోర్టల్ తీసుకువచ్చి 18 నెలలు గడుస్తున్నా సమస్యలు తీరకపోవడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మొన్న వరంగల్​లో జరిగిన ‘రైతు సంఘర్షణ సభ’లో  రైతులకు ఇబ్బందులకు గురిచేస్తున్న ధరణి పోర్టల్​ను తాము అధికారం లోకి వస్తే తీసేస్తామని కాంగ్రెస్​ ప్రకటించింది. బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్​ ఆర్​ ఎస్​ ప్రవీణ్​ కుమార్​ కూడా పలు సభలో ధరణి పోర్టల్ రద్దు గురించి ప్రస్తావించారు.

ధరణి పోర్టల్​లోని దాదాపు 65 లక్షల మంది పట్టాదారుల వ్యక్తిగత వివరాలకు సెక్యూరిటీ లేకుండా పోయింది.  ఎవరైనా సరే కేవలం సర్వే నంబర్ ​ఎంటర్​ చేస్తే  రైతు ఆధార్​ నంబర్​తో పాటు ఇతర వివరాలన్నీ వచ్చేస్తున్నాయి. రైతు పాస్​పుస్తకాన్ని ఆ ఆధార్​ నంబర్​తో డౌన్​లోడ్​ కూడా  చేసుకోవచ్చు. 

Tagged Dharani portal, details, pass book, Farmer\\\'s, survey number, Aadhaar number, Downloaded

Latest Videos

Subscribe Now

More News