Women's ODI World Cup 2025: స్మృతి మందాన రికార్డ్ సెంచరీ.. న్యూజిలాండ్‌పై భారీ స్కోర్ దిశగా టీమిండియా

Women's ODI World Cup 2025: స్మృతి మందాన రికార్డ్ సెంచరీ.. న్యూజిలాండ్‌పై భారీ స్కోర్ దిశగా టీమిండియా

మహిళల వన్డే వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ స్మృతి మందాన చెలరేగి ఆడుతోంది. గురువారం (అక్టోబర్ 23) నవీ ముంబై వేదికగా డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో సెంచరీతో కదం తొక్కింది. 31 ఓవర్లో కేర్ బౌలింగ్ లో సింగిల్ తీసుకున్న మందాన తన 88 బంతుల్లో తన సెంచరీ మార్క్ అందుకుంది. స్మృతి ఇన్నింగ్స్ లో 10 ఫోర్లతో పాటు 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఏడాది మందనాకు ఇది ఐదో సెంచరీ కావడం విశేషం. మందనతో పాటు రావల్ కూడా సెంచరీ దిశగా పయనిస్తోంది. 

సెమీస్ కు వెళ్లాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగింది. ఆరంభంలో మన ఓపెనర్లు రావల్, మందాన ఆచితూచి ఆడడంతో పరుగుల వేగం మందగించింది. ఒక్కసారి క్రీజ్ లో కుదురుకున్నాక ఇద్దరూ బ్యాట్ ను స్వేచ్ఛగా ఝులిపించారు. కివీస్ బౌలర్లను అలవోకగా ఆడుతూ పరుగులు రాబట్టారు. ఎంత ప్రయత్నించినా వికెట్ మాత్రం తెయలేకపోయారు. ఈ క్రమంలో వీరిద్దరూ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వేగంగా ఆడుతూ మందాన సెంచరీ పూర్తి చేసుకుంది. 

ప్రస్తుతం ఇండియా 34 ఓవర్లలో వికెట్ నష్టానికి 213 పరుగులు చేసింది. క్రీజ్ లో ప్రతీక రావల్ (87), జెమీమా రోడ్రిగ్స్ (1) ఉన్నారు.  సెంచరీ తర్వాత భారీ షాట్ కు ప్రయత్నించినా మందాన బౌండరీ దగర క్యాచ్ ఇచ్చి ఔటయింది. రావల్ సెంచరీ దిశగా దూసుకెళ్తుంది. ఈ మ్యాచ్ లో ఇండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది. అత్యంత కీలకమైన మ్యాచ్ లో ఆల్ రౌండర్ అమన్ జ్యోత్ కౌర్ స్థానంలో బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించింది.