IND vs AUS: సరిపోని పోరాటం: అడిలైడ్ వన్డేలోనూ ఓడిన టీమిండియా.. సిరీస్ ఆస్ట్రేలియా కైవసం

IND vs AUS: సరిపోని పోరాటం: అడిలైడ్ వన్డేలోనూ ఓడిన టీమిండియా.. సిరీస్ ఆస్ట్రేలియా కైవసం

ఆస్ట్రేలియాతో ముగిసిన రెండో వన్డేలో టీమిండియా ఓడిపోయింది. ఒక మాదిరి ఛేజింగ్ లో ఆసీస్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. గురువారం (అక్టోబర్ 23) అడిలైడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో భారత జట్టుపై విజయం సాధించింది. షార్ట్ (74) తో పాటు కొనొల్లి (61), మిచెల్ ఒవేన్ (36) బ్యాట్ ఝళిపించడంతో ఆసీస్ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసి గెలిచింది.           

265 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలో పరుగులు చేయడానికి ఇబ్బంది పడింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్కోర్ నత్తనడకన సాగింది. క్రీజ్ లో ఉన్నంత వరకు ఇబ్బందిపడిన కెప్టెన్ మార్ష్ (11)ను అర్షదీప్ సింగ్ ఔట్ చేశాడు. కాసేపటికే ట్రావిస్ హెడ్ (28)ను హర్షిత్ రానా పెవిలియన్ కు పంపాడు. దీంతో 54 పరుగులకే ఆస్ట్రేలియా తమ ఓపెనర్లను కోల్పోయింది. ఈ దశలో ఆసీస్ ను రెన్ షా, షార్ట్ ఆదుకున్నారు. జాగ్రత్తగా ఆడుతూ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మూడో వికెట్ కు 55 పరుగులు జోడించి పరిస్థితిని కాస్త చక్కదిద్దారు. 

ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని అక్షర్ పటేల్ విడగొట్టాడు. ఒక అద్భుతమైన బంతికి రెన్ షా (30) ను బౌల్డ్ చేశాడు. వికెట్ కీపర్ క్యారీని సుందర్ బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియా 134 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు అనిపించింది. ఈ సమయంలో షార్ట్ కు జత కలిసిన కొనొల్లి జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్ ను ముందుకు తీసుకెళ్లారు. ఆరంభంలో ఇబ్బందిపడిన ఈ జోడీ ఆ తర్వాత స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించారు. ఐదో వికెట్ కు 55 పరుగులు జోడించి ఇండియాను కంగారు పెట్టారు. కరెక్ట్ టైమ్ లో హర్షిత్ రానా టీమిండియాకు వికెట్ అందించాడు. ఒక షార్ట్ బాల్ తో హాఫ్ సెంచరీ చేసి ఊపు మీదున్న షార్ట్ (74) ను ఔట్ చేశాడు. 

ALSO READ : కిషాన్ దారెటు: ఇషాన్ కోసం ముంబై ఎదురుచూపులు..

మ్యాచ్ ఆసక్తికరంగా మారిందన్న సమయంలో కొనొల్లి, ఓవెన్ భారీ షాట్లతో చెలరేగి ఆసీస్ కు విజయాన్ని అందించారు. ఇండియా బౌలర్లలో హర్షిత్ రానా,  రెండు వికెట్లు పడగొట్టాడు. సుందర్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ తలో వికెట్ తీసుకున్నారు. సుందర్, సిరాజ్ లకు తలో వికెట్ దక్కింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే శనివారం (అక్టోబర్ 25) సిడ్నీ వేదికగా జరుగుతుంది.  

రోహిత్, అయ్యర్ హాఫ్ సెంచరీలు:          

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియాకు మంచి ఆరంభం లభించలేదు. ఆరంభంలో ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాలేదు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో బార్ట్ లెట్ టీమిండియాకు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ తొలి బంతికి 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్ లాంగాఫ్ లో బౌండరీ కొట్టడానికి ప్రయత్నించి మార్ష్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అదే ఓవర్ ఏడో ఓవర్ ఐదో బంతికి బార్ట్ లెట్ వేసిన అద్భుతమైన ఇన్ స్వింగ్ ధాటికి ఎల్బీడబ్ల్యూ రూపంలో విరాట్ కోహ్లీ వెనుదిరిగాడు. దీంతో  ఇండియా తొలి 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 29 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

వరుసగా రెండు వికెట్లు పడడంతో ఇండియా ఒత్తిడిలో పడింది. ఈ దశలో ఆసీస్ బౌలర్లు టీమిండియాపై మరింత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో రోహిత్, అయ్యర్ పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. తొలి ఓవర్లలో ఇండియా కేవలం 29 పరుగులు మాత్రమే  చేయగలిగింది. ఆ తర్వాత ఒక్కసారిగా మన బ్యాటర్లు బ్యాట్ కు పని చెప్పారు. వరుస బౌండరీలతో హోరెత్తించారు. 
మిచ్లే ఓవెన్ బౌలింగ్ లో రోహిత్ శర్మ మూడు బంతుల వ్యవధిలో రెండు సిక్సర్లు బాది ఆధిపత్యం చూపించాడు. ఈ క్రమంలో ఇద్దరూ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.

భారీ స్కోర్ ఖాయమనుకుంటే ఆస్ట్రేలియా మరోసారి పుంజుకుంది. స్వల్ప వ్యవధిలో రోహిత్ శర్మ (73), శ్రేయాస్ అయ్యర్ (61), కేఎల్ రాహుల్ (11) వికెట్లు పడగొట్టి మరోసారి ఇండియాను కష్టాల్లో పడేసింది. స్టార్క్ రోహిత్ ను ఔట్ చేస్తే.. ఆ తర్వాత జంపా తన స్పిన్ మ్యాజిక్ తో అయ్యర్, రాహుల్ ను బౌల్డ్ చేశాడు. ఈ దశలో అక్షర్ పటేల్, వాషింగ్ టన్ ఆరో వికెట్ కు 39 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. క్రీజ్ లో ఉన్నంతవరకు అద్భుతంగా ఆడిన అక్షర్ స్టార్క్ పట్టిన ఒక స్టన్నింగ్ క్యాచ్ కు పెవిలియన్ కు చేరాడు. చివర్లో హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ జట్టు స్కోర్ ను 250 పరుగులు దాటించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా నాలుగు వికెట్లు పడగొట్టాడు. బార్ట్ లెట్ మూడు.. స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టారు.