గవర్నమెంట్ జాబ్ పేరుతో డబ్బు వసూలు.. మహిళ అరెస్ట్

గవర్నమెంట్ జాబ్ పేరుతో డబ్బు వసూలు.. మహిళ అరెస్ట్
  • బాధితుల దగ్గరి నుంచి డబ్బులు వసూలు చేసిన మహిళ అరెస్టు
  • పరారీలో మరో వ్యక్తి
  • ఇంకో కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న

సైబర్ క్రైమ్ పోలీసులు చందానగర్​, వెలుగు: గవర్నమెంట్ జాబ్ లు, సబ్సీడీలోన్లు ఇప్పిస్తామంటూ జనాలను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న మహిళను చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చందానగర్  పాపిరెడ్డికాలనీలో ఉంటున్న గురునాథ్​ భార్య ధర్మాన ప్రేమలత(51) తాను ఉంటున్న కాలనీలోని నిరుద్యోగ యువతీయువకులకు జాబ్ లు ఇప్పిస్తానని,  కాలనీ వాసులకు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి, కారు కొనుక్కునేందుకు సబ్సీడీ లోన్లు మంజూరు చేయిస్తానని నమ్మించింది.

సెక్రటేరియట్ లో తనకు తెలిసిన వ్యక్తి ఉన్నాడని వారిని నమ్మించి ప్రేమలత 2016 ఆగస్టు నెల నుండి సెప్టెంబర్​ వరకు సుమారు 30 మందికి పైగా కాలనీవాసుల దగ్గరి నుంచి డబ్బు తీసుకుంది. లోన్ కావాలంటే కొంత డబ్బులు చెల్లించాలని వారి దగ్గరి నుంచి ప్రేమలత రూ.25 నుంచి 30వేల వరకు తీసుకుంది.  ప్రేమలతను నమ్మి లోన్​ మంజూరు కోసం ఆ కాలనీకి చెందిన కొందరు డబ్బులు ఇచ్చారు. అయితే మూడేళ్లు గడుస్తున్నా ఎలాంటి లోన్​ మంజూరు కాకపోవడంతో బాధితులందరూ కలిసి ప్రేమలతను నిలదీశారు. అప్పటి నుంచి ప్రేమలత పరారీలో ఉంది. బాధితులు ఈ నెల 9న చందానగర్ పోలీసులకు కంప్లయింట్ చేశారు.

శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో  ప్రేమలత పాపిరెడ్డికాలనీకి  వచ్చిందని తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. తాను సుమారు 30 నుంచి 35 మంది బాధితుల దగ్గరి నుంచి సుమారు రూ.6.50 లక్షలు తీసుకున్నానని.. ఆ డబ్బును తాను శ్రీనివాస్ రెడ్డి అనే మరో వ్యక్తి ఇద్దరం కలిసి పంచుకున్నామని ప్రేమలత విచారణలో పేర్కొంది. ప్రేమలతను అరెస్ట్​ చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్ఐ. శంకర్​ తెలిపారు. పరారీలో ఉన్న శ్రీనివాస్​రెడ్డిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు.

మరో కేసులో

నాంపల్లి: ఉద్యోగాల పేరుతో అమాయకుల దగ్గరి నుంచి డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.సైబర్ క్రైమ్స్ అడిషనల్ డీసీపీ రఘువీర్ కథనం ప్రకారం..  యూపీ​కి చెందిన అమన్ గౌతమ్ (22) , ఢిల్లీకి చెందిన కునాల్ కుమార్ (20) సిటీకి వచ్చి జాబ్ ల పేరుతో మోసాలు చేసేవారు.మూసారాంబాగ్ కి చెందిన ఓ వ్యక్తికి ఎయిర్ ఇండియాలో జాబ్ఇప్పిస్తామని అమన్, కునాల్ ఫోన్లు చేసి నమ్మించారు. వీరి మాటలను నమ్మిన సదరు వ్యక్తి రూ.99,500ను గూగుల్ పే నుంచి వారికి ట్రాన్స్ ఫర్ చేశాడు.

డబ్బులు పంపించిన తర్వాత ఫోన్ చేస్తే అమన్, కునాల్ మొబైల్స్ స్విచ్చాఫ్ రావడంతో బాధితుడు గత నెల 12న సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.  బ్యాంక్ అకౌంట్ వివరాల ఆధారంగా  సైబర్ క్రైమ్  పోలీసులు అమన్ గౌతమ్, కునాల్ కుమార్ ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. 7 ల్యాప్ ట్యాప్ లు, ఓ కంప్యూటర్, 8 డెబిట్ కార్డులు, బాధితుల వివరాల రిజిస్టర్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు.