ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

బైండోవర్ రూల్స్ బ్రేక్

రూ.6లక్షల ఫైన్
తొర్రూరు, వెలుగు :
బైండోవర్ రూల్స్ బ్రేక్ చేసిన వ్యక్తులకు పోలీసులు రూ.6లక్షల ఫైన్ వేశారు. తొర్రూరు ఎక్సైజ్ సీఐ ఆర్. రాజిరెడ్డి వివరాల ప్రకారం.. తొర్రూరు మండలం అమరసింగ్ తండాకు చెందిన భూక్య నరేందర్, బొత్తల తండాకు చెందిన గుగులోత్ రమేశ్, దుబ్బ తండాకు చెందిన భూక్య గోపి, హచ్చు తండాకు గుగులోత్ కాంతమ్మ, మరిపెడ మండలం మేగ్య తండాకు చెందిన భూక్య చందూలాల్, తొర్రూరుకు చెందిన అనుమాండ్ల రవీందర్ రెడ్డి గతంలో నాటుసారా తయారు చేస్తూ పట్టుబడగా.. తహసీల్దార్ ముందు బైండోవర్ చేశారు. మళ్లీ అదే వ్యాపారం చేయడంతో ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ.5లక్షల ఫైన్ విధించారు. రవీందర్ రెడ్డి తప్ప మిగిలిన నలుగురు జరిమానా చెల్లించారు. దీంతో రవీంద్ రెడ్డిని ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు. నాటు సారా తయారు చేసినా, బైండోవర్ ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ముగ్గురు బైక్ దొంగల అరెస్ట్..​
జనగామ అర్బన్, వెలుగు : జనగామ పట్టణంలో ముగ్గురు బైక్ దొంగల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ కె.దేవెందర్ రెడ్డి వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని మల్కాజిగిరికి చెందిన ముద్దంగుల ఆంజనేయలు, బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ కు చెందిన పాకాల లోకేశ్ ఇద్దరు స్నేహితులు. ఇరువురు మద్యానికి బానిసై ఓ మైనర్ బాలుడితో కలిసి దొంగతనాలకు అలవాటు పడ్డారు. గత నెల జనగామ, బచ్చన్నపేట పరిధిలో మూడు బైక్​లతో పాటు ఒక ఐఫోన్ చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేశారు. బుధవారం జనగామ పట్టణంలోని నెహ్రూ పార్క్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. నిందితులు పట్టుబడ్డారు.

అక్రమ భూపట్టాలు రద్దు చేయాలి
ధర్మసాగర్, వెలుగు : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు, ముప్పారం గ్రామ శివారు ఇనుపరాతి గుట్టలో కొందరు వ్యక్తులు అక్రమంగా భూపట్టాలు పొందారని, వెంటనే వాటిని రద్దు చేయాలని వనసేవా సొసైటీ, జన విజ్ఞాన వేదిక, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, మేధావి సంస్థ, తెలంగాణ ఇంటలెక్చువల్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. గురువారం వారంతా ఆయా భూముల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వన సేవ సొసైటీ అధ్యక్షులు, అడ్వకేట్ వీరభద్రరావు మాట్లాడుతూ.. గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ తన సొంత ప్రయోజనాల కోసం అటవీ భూములకు పట్టా పాసు బుక్కులు ఇచ్చారని ఆరోపించారు. ఆయా భూములకు రైతుబంధు కూడా వస్తోందన్నారు. ఇప్పటికైనా హనుమకొండ కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని అక్రమ పట్టాలను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో ధర్మ ప్రకాశ్, సీహెచ్​శ్రీనివాస్, పిట్టల రవిబాబు, ప్రకాశ్, కమలాకర్, స్వామి, కనకయ్య తదితరులున్నారు.

బస్సు ఢీకొని మహిళ మృతి
భూపాలపల్లి అర్బన్, వెలుగు :
రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. భూపాలపల్లి పట్టణంలోని కృష్ణ కాలనీకి చెందిన బానోత్ గమ్మ(47) గురువారం తన భర్త, మనువడితో కలిసి అంబేద్కర్ సెంటర్ నుంచి బస్టాండ్ వైపు వెళ్తోంది. ఈక్రమంలో కాళేశ్వరం నుంచి బస్టాండ్ కు వెళ్తున్న బస్సు ఆమెను ఢీకొట్టింది. చేతిలో ఉన్న మనువడిని పక్కకు తోసి, ఆమె బస్సు కింద పడింది. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కొడుకు రోహిత్ ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేశారు.

టీఆర్ఎస్ కౌన్సిలర్ భర్తపై పీడీ యాక్డ్
గతంలో రౌడీ షీటర్​గా నమోదు
12 కేసుల్లో నిందితుడు: ఎస్పీ

భూపాలపల్లి అర్బన్, వెలుగు:
ప్రజలను బెదిరించి ప్లాట్లు, ప్రైవేట్ భూములతో పాటు ప్రభుత్వ జాగలు  కబ్జా చేస్తున్న భూపాలపల్లి మున్సిపాలిటీ టీఆర్ఎస్ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తిపై పీడీ యాక్ట్ నమోదైంది. గతంలో ఇతనిపై రౌడీ షీట్ ఓపెన్ కావడంతో పాటు 12 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అయినా ఆయన తీరు మారకపోవడంతో పోలీసులు పీడీ యాక్ట్ ఫైల్ చేసి, చర్లపల్లి జైలుకు తరలించారు. ఎస్పీ సురేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. టౌన్ కు చెందిన రాజలింగమూర్తి, తన అనుచరులతో కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. అమాయకుల భూములపై కన్నేసి, వారిని వేధించి డబ్బులు గుంజేవాడు. వినకపోతే చంపుతానని కూడా బెదిరించేవాడు. ఇలా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడడంతో పాటు శాంతిభద్రతలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని, అతనిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. జిల్లాలో గూండాయిజానికి తావులేదని, కబ్జాల పేరుతో పేదలను ఇబ్బంది పెడితే సహించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు.

పింఛన్ల పంపిణీకి పిల్వరా?
ఎంపీడీవోను నిలదీసిన సర్పంచులు
నర్సింహులపేట(దంతాలపల్లి), వెలుగు:
ఆసరా ఫించన్ల పంపిణీకి ఎందుకు పిల్వలేదని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల సర్పంచులు ఎంపీడీవోను నిలదీశారు. వివరాల్లోకి వెళితే.. మండలకేంద్రంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఇటీవల దాట్ల, ఆగపేట, గున్నేపల్లి సర్పంచులకు ఆసరా కార్డులు అందజేశారు. కానీ సర్పంచులకు పిల్వకపోవడంతో గురువారం ఎంపీడీవో గోవిందరావును ప్రశ్నించారు. తీరు మార్చుకోకుంటే కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచులు కొమ్మినేని రవీందర్, ఇమ్మడి సంధ్యారాణి, గండి వెంకటరమణ తదితరులున్నారు.

పోడు భూముల్లో ఎండిన పత్తి
ఫారెస్ట్ ఆఫీసర్ల పనేనంటున్న రైతులు
గూడూరు, వెలుగు:
గడ్డిమందు కొట్టడంతో పత్తి చేను ఎండిపోయిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొల్లెపెల్లిలో జరిగింది. రైతుల వివరాల ప్రకారం.. బొల్లెపెల్లి శివారులో 10 మంది రైతులు 15 ఎకరాల పోడు భూమిలో గత 30 ఏండ్లుగా వివిధ పంటలు సాగు చేసుకుంటున్నారు. కొద్దిరోజుల కింద పత్తి వేయగా.. ఒక ఫీటు మేర మొక్కలు ఎదిగాయి. గురువారం అకస్మాత్తుగా పత్తి ఎండిపోవడంతో రైతులకు అనుమానం వచ్చింది. రెండ్రోజుల కింద ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి, ఆ భూముల్లో ఎందుకు సాగు చేస్తున్నారని, అవి అటవీశాఖకు చెందినవని హెచ్చరించి వెళ్లినట్లు చెప్పారు. తాము ఒప్పుకోకపోవడంతో కావాలనే గడ్డి మందు చల్లినట్లు ఆరోపించారు. బాధ్యతులపై చర్యలు తీసుకుని, పరిహారం చెల్లించాలని కన్నీటిపర్యంతమయ్యారు.

ఎర్రబెల్లిని కలిసిన సీపీఎస్‍ ఉమ్మడి జిల్లా కమిటీ
కార్పొరేషన్‍, వెలుగు:
సీపీఎస్‍ రద్దు చేసి పాత పెన్షన్‍ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ సీపీఎస్‍ డిపార్ట్ మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్‍ జిల్లా కమిటీ సభ్యులు గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్‍ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావును కలిశారు. ఫోరమ్‍ కన్వీనర్‍ దొడ్డిపాటి హరికుమార్‍ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రికి వినతి పత్రం అందించారు. కాగా, ఎంప్లాయిస్‍ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు. కార్యక్రమంలో ఫోరమ్‍ జిల్లా అధ్యక్షుడు జీవన్‍కుమార్‍, గౌరవ అధ్యక్షుడు శేషగిరితో పాటు చల్లా శ్రీజ్యోతి, కొండ శ్రీనివాస్‍, ఎస్‍కే అఫ్జల్‍, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.