పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసిన్రు

పోలీస్  వ్యవస్థను నిర్వీర్యం చేసిన్రు

లింగాల, వెలుగు: నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మ గౌరవం కోసం తెలంగాణ తెచ్చుకుంటే, ఆ లక్ష్యాలు నెరవేరకపోగా ప్రశ్నించడమే నేరమన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అచ్చంపేట నియోజకవర్గ బీజేపీ నేత సతీశ్​ విమర్శించారు. రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి అధికారులు, పోలీసులు పని చేయాలని కోరుతూ ఆదివారం లింగాలలోని అంబేద్కర్  విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మంగ్యా నాయక్, మండికారి బాలాజీ, సలేశ్వరం ముదిరాజ్, నవీన్, యాదయ్య, రాజు గౌడ్, శ్రీనివాసులు, అశోక్  పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ టౌన్: సీఎం కేసీఆర్, మంత్రులకు, బీఆర్ఎస్  నాయకులకు పోలీస్​ ప్రొటెక్షన్  ఉంటే సరిపోతుందా అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి ప్రశ్నించారు. బీజేపీ జిల్లా ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని, అలాంటిది పోలీసు సురక్ష పేరిట ఉత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజలను బెదిరించి ఉత్సవాలకు తీసుకువచ్చి సంబురాలు చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి సంబురాలు చేసుకోవాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ ఎ.అంజయ్య, నాయకులు రాజేందర్ రెడ్డి, జయశ్రీ పాల్గొన్నారు.