గజ్వేల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీపై నిరసన

గజ్వేల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీపై నిరసన

సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీపై పేదలు ఆందోళన చేపట్టారు. గజ్వేల్ లో 1100 ఇండ్లను లబ్దిదారులకు డ్రా తీసి అధికారులు కేటాయించారు. ఈ నేపథ్యంలో  అప్లై చేసుకున్న వారు తమ పేరు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  మహతి ఆడిటోరియం దగ్గర రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు. 

ఉన్నోళ్లకు ఇస్తరు..లేనోళ్లకు ఇవ్వరా..

గజ్వేల్ లో ఎన్నో ఏండ్ల నుంచి నివాసం ఉంటున్నామని..అయినా ఇండ్లు రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పని చేసుకుంటూ బతుకుతున్నామని..కిరాయి కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గజ్వేల్ కు ఏడాది కిందట..మూడు నాలుగు నెలల కిందట వచ్చిన వాళ్లకు ఇండ్లు కేటాయించారని ఆరోపించారు. జాబులు ఉన్నోళ్లకు ఇండ్ల కేటాయిస్తే..తమ లాంటి పేదల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 

పేరొచ్చినా..ఇళ్లు రాలే..

నాపేరు స్వరూప. మాకు ఇండ్లు రాలే. మేము గజ్వేల్ లోనే ఉంటున్నం.  కొన్నేండ్ల నుంచి ఇండ్ల కోసం ప్రభుత్వానికి అప్లికేషన్లు పెడతనే ఉన్న.  ఇండ్లు మంజూరైనట్లు పేపర్ వచ్చింది కానీ..పేరు రాలేదు.

30 ఏండ్ల నుంచి గజ్వేల్లోనే ఉంటున్న

గజ్వేల్ లో ఏడాది కింద, రెండు మూడు నెలల కింద వచ్చినవాళ్లకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చారు. తాము 30 ఏండ్ల నుంచి గజ్వేల్ లోనే ఉంటున్నా ఇళ్లు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టాలు తీసుకున్న వారి పరిస్థితి ఏంటి..జాబులు ఉన్నోళ్లకు, ఇండ్లు ఉన్నోళ్లకు ఇచ్చిర్రు. మరి లేనోళ్ల పరిస్థితి ఏంటి..అని ఓ బాధితుడు అవేదన వ్యక్తం చేశాడు.