ఆత్మహత్య చేసుకున్నా.. యాక్సిడెంట్​లో చనిపోయినా తప్పని తిప్పలు

ఆత్మహత్య చేసుకున్నా.. యాక్సిడెంట్​లో చనిపోయినా తప్పని తిప్పలు
  • రోజంతా బాధితుల కుటుంబాలకు తప్పని నిరీక్షణ
  • దూర, ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతున్న పేదలు
  • పట్టించుకోని ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు

ఆసిఫాబాద్,వెలుగు:పోస్టుమార్టం కష్టాలు పేదలను వేధిస్తున్నాయి. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నా... ప్రమాదవశాత్తు చనిపోయినా.. పోస్టుమార్టం కోసం మృతదేహాలను సుమారు 80 కిలో మీటర్లు తరలించాల్సి వస్తోంది. కుటుంబ సభ్యుడు, బంధువు చనిపోయాడనే పుట్టెడు దుఃఖంలో  శవపంచనామా కోసం పేదలు నరకం అనుభవిస్తున్నారు.

ఏడు మండలాలకు సిర్ పూర్ ...
సిర్పూర్ నియోజకవర్గ పరిధిలోని కౌటాల, సిర్పూర్ (టి), కాగజ్ నగర్, చింతలమానేపల్లి, బెజ్జుర్, దహెగాం, కాగజ్​నగర్​ మండలాల వాసుల పోస్టుమార్టం కోసం సిర్పూర్ (టి) సీహెచ్​సీ ఒక్కటే దిక్కు. ఎక్కడ ఎవరు ఆత్మహత్య చేసుకున్నా... యాక్సిడెంట్​లో చనిపోయినా మృతదేహాలను సిర్పూర్ (టి)కి తరలించాల్సిందే. అయితే ఏ మండలం నుంచైనా సిర్పూర్​(టి)కి వెళ్లాలన్నా 80 కిలో మీటర్లు ప్రయాణించాల్సిందే. ధైర్యం చేసి బయలుదేరినా.. రోడ్లు బాగా ఉండవు. వంతెనలు అసలే లేవు. అష్టకష్టాలు పడి అవన్నీ దాటేసినా.. వాగులతో ఇబ్బందులు తప్పవు. ఇంకొన్ని గ్రామాల ప్రజలకు ఎడ్ల బండ్లే దిక్కు.  

అయిదు మండలాలకు ఆసిఫాబాద్.. మూడు మండలాలకు ఉట్నూర్
ఆసిఫాబాద్ నియోజకవర్గం పరిధిలోని మండలాల వాసులకు పోస్టు మార్టం చేసేందుకు సౌకర్యాలు లేక పోవడంతో దూరంలో ఉన్న ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ కు వెళ్లాల్సిన పరిస్థితి. ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కెరమెరి, వాంకిడి మండలాల ప్రజలు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సీహెచ్ సీకి రావాల్సిందే.  జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాల ప్రజలు ఉట్నూర్ వెళ్లాల్సిన దుస్థితి. అంతే కాదు దారివెంట వంతెనలు, వాగుల ఇబ్బందులు సరేసరి. 

ఖర్చులు తడిసి మోపెడు..
పోస్టుమార్టం కోసం కుటుంబ సభ్యులు, బంధువులకు అయ్యే ఖర్చు తడిసి మోపేడవుతోంది. మృతదేహాన్ని తరలించడానికి వెహికల్, అంబులెన్స్ లకు సగటున రూ.3 వేల నుంచి రూ. 6 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక హాస్పిటల్ ఖర్చు సుమారు రూ. మూడు వేల వరకు అవుతుందని బాధితులు పేర్కొంటున్నారు. అయితే పేదలకు ఇదంతా తలకుమించిన భారంగా మారింది. అప్పో.. సప్పోచేసి తమవారి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాల్సి వస్తోంది. ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు స్పందించి ఆయా మండలాలకు అందుబాటులో పోస్టుమార్టం సౌకర్యం కల్పించాలని జనం కోరుతున్నారు.

ఇబ్బందిగా మారింది..
ఎవరైనా చనిపోతే పోస్టుమార్టం కోసం కోసుల దూరం పోవాల్సి వస్తోంది. ఆర్థికంగా లేని వారికి ఇబ్బందిగా మారింది. జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాల నుంచి పోస్టుమార్టం కోసం ఉట్నూర్ గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లాల్సి వస్తోంది. లింగాపూర్ నుంచి పోను 50 రాను 50 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అక్కడ రోజంతా వెయిట్ చేయాలి. ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు స్పందించి జైనూర్​లో పోస్టుమార్టం సౌకర్యం కల్పించాలి.
– కొడప లింబారావు, జైనూర్

ఆరేడు వేల ఖర్చు.. 
సూసైడ్ చేసుకున్నా.. హత్య జరిగినా డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం 80 కిలో మీటర్ల దూరంలో ఉన్న సిర్పూర్ (టి) దవాఖానకు తీసుకు పోవాలి. దాని కోసం బండి కిరాయి ఆరేడు వేల ఖర్చు అవుతోంది. ఒక్కోసారి సాయంత్రం ఐదు దాటితే పోస్ట్ మార్టం చేస్తలేరు. తెల్లారేదాకా అక్కడ్నే ఆగి మరుసటి రోజు డెడ్​బాడీ తీసుకెళ్లాల్సి వస్తోంది. దగ్గర పోస్టుమార్టం సౌకర్యం కల్పించాలి. 
– ఎల్కరి దామోదర్, ఖర్జి