
న్యూఢిల్లీ: క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 144ను ఉల్లంఘించి నిరసనలు తెలిపే వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసే గుజరాత్ బిల్లుకు బుధవారం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (గుజరాత్ సవరణ) బిల్లు, 2021ని గత ఏడాది మార్చిలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. సెక్షన్ 144 సీఆర్పీసీ కింద జారీ చేసిన నిషేధిత ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే సెక్షన్ 188 కింద నేరంగా పరిగణించాలని ఆ బిల్లులో పేర్కొన్నారు. ఈ బిల్లు ప్రకారం, గుజరాత్ ప్రభుత్వం, పోలీసు కమిషనర్లు, జిల్లా మేజిస్ట్రేట్‌లు సెక్షన్ 144 నిషేధిత ఉత్తర్వులు జారీచేసే అధికారం కలిగి ఉంటారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులు నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించి.. సెక్షన్ 188 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. బాధ్యులకు కనీసం 6 నెలల జైలు శిక్ష ఉంటుంది.