విపక్షాలకు మరో షాక్​.. రాష్ట్రపతి అభ్యర్థి కోసం అన్వేషణ షురూ

విపక్షాలకు మరో షాక్​.. రాష్ట్రపతి అభ్యర్థి కోసం అన్వేషణ షురూ

రాష్ట్రపతి ఎన్నికల వేళ విపక్షాలకు మరో షాక్ తగిలింది. మొన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నిన్న ఫరూఖ్ అబ్దుల్లా, ఇవాళ గోపాలకృష్ణ గాంధీ వరుస షాకులిచ్చారు. రాష్ట్రపతి అభ్యర్థి రేసులో తాను కూడా లేనని గోపాలకృష్ణ గాంధీ స్పష్టం చేశారు. దీంతో విపక్షాలు ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థి వేటలో పడ్డాయి. 

న్యూఢిల్లీ : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా తాను నిలబడబోనని పశ్చిమబెంగాల్​ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ స్పష్టం చేశారు. తన పేరును ప్రతిపాదించినందుకు విపక్షాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి.. జాతీయ ఏకాభిప్రాయాన్ని కల్పించేలా, ప్రతిపక్షాల ఐక్యతను చాటేలా ఉండాలని, అలాంటి వ్యక్తికే అవకాశం ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రపతి రేసు నుంచి శరద్​పవార్, ఫరూఖ్ అబ్దుల్లా తప్పుకోగా.. తాజాగా గోపాలకృష్ణ గాంధీ కూడా తప్పుకోవడంతో జులైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెడదామనుకుంటున్న విపక్షాలకు మరో షాక్ తగిలింది.

ఎవరీ గోపాలకృష్ణ గాంధీ..?

77 ఏళ్ల గోపాలకృష్ణ గాంధీ.. మహాత్మా గాంధీ మనవడు. దక్షిణాఫ్రికా, శ్రీలంకకు భారత హైకమిషనర్‌గా కూడా సేవలందించారు. 2017లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గోపాలకృష్ణ గాంధీ పోటీ చేశారు. ఆ సమయంలో వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా గెలుపొందారు. 

రాష్ట్రపతి ఎన్నికకు ఉమ్మడి అభ్యర్థి విషయంపై గతవారం విపక్షాలతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్సీపీ అధినేత శరద్​పవార్ పేరును ప్రతిపాదించారు. అయితే.. ఆయన నిరాకరించారు. ఆ తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్​అబ్దూల్లా పేరు తెరపైకి వచ్చింది. దీంతో తాను కూడా రేసులో ఉండనని ప్రకటించారు. ఆ తర్వాత గోపాలకృష్ట గాంధీ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆయన కూడా విముఖత వ్యక్తం చేయడం విపక్షాలను ఆయోమయంలో పడేలా చేసింది. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల విషయంపై విపక్షాలు మంగళవారం (జూన్ 21న) మరోసారి సమావేశం కానున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్​పవార్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరగనుంది. దాదాపు అన్ని ప్రతిపక్షాలు ఈ సమావేశానికి హాజరవుతాయని తెలుస్తోంది. 

రాష్ట్రప‌తి ఎన్నిక‌కు ఈ నెల 15వ తేదీన నోటిఫికేష‌న్‌ జారీ చేశారు. ఆ రోజు నుంచే నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్రారంభమైంది. ఈ నెల 29వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్లను స్వీక‌రించనున్నారు. 30న నామినేష‌న్ల ప‌రిశీలన ఉంటుంద‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్రధాన క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ తెలిపారు. జులై 2వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఉంటుంద‌ని చెప్పారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో కీల‌కమైన పోలింగ్‌ను జులై 18న నిర్వహిస్తామని, 21న ఓట్లు లెక్కిస్తామని తెలిపారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. గత రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి మీరా కుమార్‌పై ఆయన విజయం సాధించారు.