ఆక్సీ మీటర్ నుంచి ఆక్సిజన్ సిలిండర్ దాకా రేట్లు మూడు రెట్లు పెంచేశారు

ఆక్సీ మీటర్ నుంచి ఆక్సిజన్ సిలిండర్ దాకా రేట్లు మూడు రెట్లు పెంచేశారు
  • ఆక్సిమీటర్ నుంచి ఆక్సిజన్ సిలిండర్ దాకా
  • రాష్ట్రంలో విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్​ దందా
  • కంపెనీలు, వ్యాపారుల కుమ్మక్కు
  • కరోనా మెడిసిన్ ధరలకూ రెక్కలు 
  • పట్టించుకోని ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: కరోనా ట్రీట్​మెంట్​కు ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటళ్లను కట్టడి చేయడంలో చేతులెత్తేసిన రాష్ట్ర సర్కార్.. మెడికల్​ పరికరాల రేట్లను అడ్డగోలుగా పెంచుతున్నా పట్టించుకోవడం లేదు. ఆయా ఫార్మా, మెడికల్ డివైజెస్ కంపెనీలు, వ్యాపారులు పల్స్ ఆక్సిమీటర్, ఆక్సిజన్ సిలిండర్, ఆక్సిజన్  కాన్సంట్రేటర్ల ధరలు మూడింతలు పెంచేశారు.  కరోనా సోకితే వాడే మెడిసిన్స్ ధరలు కూడా రెట్టింపయ్యాయి. ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్ల కొరత పేరిట బ్లాక్ మార్కెటింగ్​కు పాల్పడినా ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. అధిక రేట్లకు అమ్మితే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ప్రజలు కూడా వ్యాపారులు అడిగినంత ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు.

ఆక్సిజన్​ సిలిండర్​ రూ. 25 వేలపైనే!

కరోనా వైరస్ ఊపిరితిత్తులపై ఎక్కువగా దాడి చేస్తుండడంతో ఇన్ఫెక్షన్ సోకి ఆక్సిజన్ అవసరం తప్పనిసరిగా మారుతోంది.ఆరోగ్యంగా ఉన్నవారి రక్తంలో  సాధారణంగా ఆక్సిజన్‌‌ శాతం 95 నుంచి-100 మధ్య ఉంటుంది. అంతకు మించి తగ్గితే హాస్పిటల్ లో చేరాల్సి ఉంటుంది. లేదంటే బెడ్ దొరికే వరకు ఆక్సిజన్ సిలిండర్ లేదా ఆక్సిజన్ కాన్సంట్రేటర్​ సాయంతో  ఆక్సిజన్  తీసుకోవాల్సి ఉంటుంది.  కరోనా నుంచి కోలుకుని హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జ్​ అయిన పేషెంట్లకు కూడా కొన్ని రోజుల పాటు మెడికల్​ ఆక్సిజన్ అవసరం ఉంటుంది. దీంతో ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లకు డిమాండ్ పెరిగింది. 

కరోనా మెడిసిన్స్​పై అడ్డగోలు రేట్లు

గతంలో మెడికల్ షాపుల మధ్య ఉన్న పోటీ దృష్ట్యా చాలా మెడిసిన్స్ పై 20 నుంచి 30 శాతం డిస్కౌంట్ ఇచ్చేవారు. ఇప్పుడు డిస్కౌంట్ల మాటే ఎత్తడం లేదు. మరీ ముఖ్యంగా కరోనా మెడిసిన్  ధరలు పెంచి అమ్మేస్తున్నారు. ఇలాంటి మెడిసిన్స్  రేట్లు గత రెండు నెలల్లోనే రెండింతలయ్యాయి. హోం ఐసోలేషన్ కిట్ కు రూ. 2,500 వరకు వెచ్చించాల్సి వస్తోంది. కరోనా ట్రీట్​మెంట్​ కోసం వాడే డాక్సి సైక్లిన్ ట్యాబ్లెట్ స్ట్రిప్(10 ట్యాబ్లెట్స్) గతంలో కంపెనీని బట్టి రూ. 40 నుంచి రూ.50 ఉండేది. ఇప్పుడు రూ. 100 నుంచి రూ. 110 వరకు అమ్ముతున్నారు.  15 బీకాంప్లెక్స్ ట్యాబెట్లకు గతంలో రూ. 110 ఉంటే ఇప్పుడు 160కు చేరింది. ఐవర్ మెక్టిన్ ట్యాబ్లెట్లు ఐదింటికి గతంలో రూ. 75 ఉంటే ఇప్పుడు రూ. 150కు పెంచేశారు. 15 విటమిన్ –సి ట్యాబ్లెట్లు గతంలో రూ. 25 లభించేవి. ఇప్పుడు కొన్ని కంపెనీలు రూ. 60 నుంచి 75 వరకు అమ్ముతున్నాయి. గతంలో రూ. 200 వచ్చిన ఆవిరి పట్టే పరికరాలు ఇప్పుడు రూ. 500కు అమ్ముతున్నారు. ప్రభుత్వం ఉచితంగా హోం ఐసోలేషన్ కిట్లు ఇస్తున్నామని ప్రకటించినప్పటికీ.. చాలా మంది కరోనా బాధితులకు అవి చేరడం లేదు. దీంతో జనం అప్పులు చేసైనా వాటిని మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు.

రూ. 500 పల్స్​ ఆక్సిమీటర్​ రూ. 2 వేలకు!

శరీరంలో ఆక్సిజన్‌ లెవల్స్, హార్ట్ బీట్​ను లెక్కించేందుకు ఉపయోగపడే  పల్స్ ఆక్సిమీటర్.. కరోనా సోకిన పేషెంట్ల వద్ద తప్పనిసరిగా ఉండాల్సిన పరికరం. ఆక్సిజన్  లెవల్స్ 94లోపు ఉంటే కరోనా పేషెంట్ హాస్పిటల్​లో చేరాల్సి ఉంటుంది. అందుకే ప్రతి ఇంట్లో ఒక ఆక్సిమీటర్​  కొని పెట్టుకుంటున్నారు. ఈ డిమాండ్​ను ఆసరాగా చేసుకుని తయారీ కంపెనీలతోపాటు వ్యాపారులు మూడు, నాలుగింతలు రేట్లు పెంచేశారు. గతేడాది కరోనా రాకముందు మార్కెట్​లో దీని ధర కంపెనీని బట్టి రూ. 500 నుంచి మొదలయ్యేది. ఇప్పుడు ఈ ధరలో పల్స్ ఆక్సిమీటర్ అసలు దొరకడం లేదు. కనీస ధర రూ. 1,700 నుంచి 2000 పైనే ఉంది. పైగా వాటికి వారంటీ కూడా ఉండడం లేదు. వారంటీ ఉన్న కంపెనీ ఆక్సిమీటర్ కావాలంటే రూ. 2,500 నుంచి 5 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది.

  • మామూలు రోజుల్లో రూ.10 వేలకు దొరికే ఆక్సిజన్ సిలిండర్.. కరోనా కష్టకాలంలో రూ. 25 వేలు పెట్టినా దొరకడం లేదు. 
  • రూ. 30 వేల నుంచి 40 వేల వరకు  ఉండే ఒక్కో ఆక్సిజన్‌‌ కాన్సంట్రేటర్​ను  ఇప్పుడు రూ. 80 వేల నుంచి రూ.లక్షా 20 వేలకు అమ్ముతున్నారు. తయారీ కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లే వీటి రేట్లను గత నెల రోజుల్లో అమాంతం పెంచేశారు. 
  • ఆక్సిజన్‌‌ సిలిండర్‌‌కు బిగించే ‘ఫ్లో మీటర్‌‌ వాల్వ్‌‌’ ధర గతంలో రూ. 600 ఉంటే ఇప్పుడు రూ. 5 వేల నుంచి 10 వేలకు అమ్ముతున్నారు.
  • ఆక్సిజన్‌‌ సిలిండర్‌‌ ఫేస్‌‌ మాస్క్‌‌ ధర రూ. 70 ఉంటే.. ఇప్పుడు రూ. 200- నుంచి 300కు అమ్ముతున్నారు.