- కలెక్టరేట్ ఎదుట రైతు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా
ఆసిఫాబాద్, వెలుగు: కేంద్రం పత్తి రైతులపై విధిస్తున్న ఆంక్షలకు వ్యతిరేకంగా రైతు జేఏసీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. కలెక్టరేట్ లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఇరువురి మధ్య తోపులాట జరిగింది.
రైతులు మాట్లాడుతూ.. కపాస్ కిసాన్ యాప్ ను వెంటనే రద్దు చేయాలని, పత్తి పంటకు రూ. 12 వేల మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న దళారీ వ్యవస్థను రద్దు చేసి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. తేమశాతం 12 నుంచి 20 శాతానికి సడలింపు ఇవ్వాలని, భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ. 10 వేలు నష్ట పరిహారం చెల్లించాలన్నారు.
రైతు మరణిస్తే రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి శ్యాం నాయక్, ప్రజా సంఘాల నాయకులు రైతులకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రూప్నర్ రమేశ్, జయరామ్ పాల్గొన్నారు.
