ప్రతి వందలో 58 మందికి రక్తహీనత!

ప్రతి వందలో 58 మందికి రక్తహీనత!
  • ప్రతి వందలో 58 మందికి రక్తహీనత
  • గర్భిణుల కంటే ఇతరుల్లోనే ఎక్కువ  ఐదేండ్లలో 
  • 5 శాతం పెరిగిన బాధితుల సంఖ్య
  •   న్యూట్రిషన్ కిట్లు అందజేయాలని సర్కార్ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రక్త హీనత సమస్య ఏటా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. ఇటీవల సర్కారు విడుదల చేసిన ఓ సర్వే ప్రకారం రాష్ట్రంలోని ప్రతి 100 మంది మహిళల్లో 58 మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. సాధారణంగా గర్భిణులలో రక్త హీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. కానీ, మన రాష్ట్రంలో గర్భిణుల కంటే, సాధారణ మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది. రాష్ట్రంలో 15 నుంచి 49 ఏండ్ల వయసున్నోళ్లపై చేసిన సర్వే వివరాలను స్టేట్ ప్లానింగ్ డిపార్ట్‌‌‌‌మెంట్ ఇటీవల విడుదల చేసింది. రాష్ట్రంలో ఈ ఏజ్‌‌‌‌ గ్రూపులోని ప్రతి వంద మంది గర్భిణుల్లో 53 మంది రక్త హీనతతో బాధ పడుతున్నట్టు సర్వే తేల్చింది. ప్రతి వంద మంది సాధారణ మహిళల్లో 58 మంది రక్త హీనతతో బాధపడున్నట్టు వెల్లడైంది. కొత్తగూడెం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, పెద్దపల్లి, గద్వాల వంటి గ్రామీణ ప్రాంత జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా 60 నుంచి 69 శాతం మంది మహిళల్లో రక్త హీనత సమస్య ఉంది. సాధారణ మహిళల్లో ఈ స్థాయిలో రక్త హీనత సమస్య ఉండడంపై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణుల్లో ఒక డెసీలీటర్‌‌‌‌‌‌‌‌ రక్తంలో 11 గ్రాముల కంటే తక్కువగా హిమోగ్లోబిన్ ఉంటే రక్తహీనతగా భావిస్తారు. సాధారణ మహిళల్లో 12 గ్రాముల కంటే తక్కువగా హిమోగ్లోబిన్ ఉంటే, రక్తహీనతగా భావిస్తారు.  యువతుల్లో రక్త హీనత సమస్య ఉంటే, వారు గర్భం దాల్చినప్పుడు పరిస్థితి మరింత సీరియస్ అవుతుందని, గర్భస్రావం వంటి దుష్పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

న్యూట్రిషన్ కిట్లు

రక్త హీనత నుంచి పిల్లలు, గర్భిణులను రక్షించేందుకు అంగన్‌‌‌‌వాడీల ద్వారా పోషకాహార పంపిణీ చేస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం కనిపించడం లేదు. 2015–16 నాటి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం రాష్ట్రంలోని మహిళ్లల్లో(ప్రెగ్నెంట్‌‌‌‌, నాన్ ప్రెగ్నెంట్ కలిపి) 48.2 శాతం మందిలో రక్త హీనత సమస్య ఉంటే, 2020 నాటికి 53.2 శాతానికి పెరిగింది. దీన్ని బట్టి పోషకాహార పంపిణీ ఆశించి ఫలితాలను ఇవ్వడం లేదన్న విషయం స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అందజేస్తున్న పోషకాహార పథకాన్ని కొనసాగిస్తూనే, ఏటా 1.5 లక్షల మంది గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రక్తహీనత సమస్య ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ కిట్లు పంపిణీ చేయనున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూల్ ఆఫ్ న్యూట్రిషన్ సైంటిస్టులు తయారు చేసిన ఈ కిట్‌‌‌‌లో హిమోగ్లోబిన్‌‌‌‌ శాతం మెరుగయ్యేందుకు అవసరమైన ఆహార పదార్థాలు ఉంటాయని హెల్త్ ఆఫీసర్లు చెప్తున్నారు.

పిల్లల్లోనూ సమస్య

రాష్ట్రంలో పిల్లల్లోనూ రక్తహీనత సమస్య ఎక్కువగానే ఉంది. ఐదేండ్ల లోపు పిల్లల్లో 70 శాతం మంది రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నట్టు సర్వే తేల్చింది. అత్యధికంగా మహబూబ్‌‌‌‌నగర్ జిల్లాల్లో 82.6 శాతం మందిలో రక్తహీనత ఉండగా, మంచిర్యాల జిల్లాలో అత్యల్పంగా 58.7 శాతం మంది పిల్లల్లో సమస్య ఉంది. అంటే, ప్రతి జిల్లాలోనూ సగానికిపైగా పిల్లల్లో సమస్య ఉన్నట్టు ఈ లెక్కలు చెబుతున్నాయి. గర్భిణుల్లో రక్తహీనత ఉంటే, ఆ సమస్య పిల్లల్లో కూడా కంటీన్యూ అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.