
- నిర్మల్ జిల్లాలో తీవ్రమవుతున్న పోడు సమస్య
- పలుచోట్ల సాగు పనుల అడ్డగింత
- రైతులు, ఆఫీసర్ల మధ్య తీవ్ర వాగ్వాదం
ఖానాపూర్/పెంబి/కడెం, వెలుగు: నిర్మల్ జిల్లాలో పోడు సమస్య తీవ్రమవుతోంది. మంగళవారం పలు చోట్ల ఫారెస్ట్ అధికారులు, పోడు రైతుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పెంబిలో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటడాన్ని రైతులు అడ్డుకోగా.. ఖానాపూర్ మండలంలో రైతులు సాగుచేస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. పెంబి మండలం ఇటిక్యాల్ గ్రామ పోడు రైతులు, అటవీ శాఖ అధికారుల మధ్య మంగళవారం వాగ్వాదం జరిగింది. రైతులు సాగు చేస్తున్న పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు మంగళవారం మొక్కలు నాట్టేందుకు వెళ్లారు.
విషయం తెలుసుకున్న పోడు రైతులు అక్కడికి వెళ్లి అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. 1985 నుంచి తాము ఈ భూములు సాగు చేసుకుంటున్నామని, ఇప్పుడు ఆ భూములను లాక్కుంటే తమ పరిస్థితి ఎలా అని ప్రశ్నించారు. మొక్కలు నాటేందుకు అధికారులు తవ్విన గుంతలో పడుకొని ఓ మహిళా రైతు నిరసన తెలిపింది. దాదాపు రెండు గంటలపాటు వాగ్వాదం అనంతరం అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వ్యవసాయ పనులు అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు
ఖానాపూర్ ఫారెస్ట్ సౌత్ బీట్‌లోని కొత్త తర్లపాడ్ శివారులోని రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమంగా వ్యవసాయ పనులు చేస్తున్న రైతులను స్థానిక ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది మంగళవారం అడ్డుకున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లో కొందరు అక్రమంగా సాగు చేస్తున్నారని సమాచారం అందడంతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రవీందర్ ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడికి చేరుకొని పనులను అడ్డుకున్నారు. ప్లాంటేషన్ పనులు చేస్తున్నామని ఫారెస్ట్ భూముల్లో వ్యవసాయ పనులు ఎలా చేస్తారని వారిని ప్రశ్నించారు. అటవీ భూముల్లో వ్యవసాయ పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాము పోడు భూముల్లోనే సాగు పనులు చేస్తున్నామని, అన్యాయంగా అడ్డుకున్నారని ఆఫీసర్లతో వాగ్వివాదానికి దిగారు.
మా భూములను సాగు చేసుకోనివ్వండి
కడెం మండలం నవాబుపేట్ శివారులోని సర్వే నంబర్110లో నాన్ ట్రైబల్స్ సాగు చేస్తుండగా ఫారెస్ట్‌అధికారులు అక్కడికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. ఎఫ్ఆర్ఓ గీతారాణి, డీఆర్వో సిద్ధార్థ ఆధ్వర్యంలో ఆ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. గత 40 ఏండ్లుగా తాము ఈ భూములను సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని, ఇప్పుడు దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నం చేస్తే ఊరుకునేదే లేదన్నారు. ఈ భూములకు తమ వద్ద పట్టాలున్నాయని పేర్కొ న్నారు. దీంతో అధికారులకు గ్రామస్తులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.