రాష్ట్రంలో ముందుకుపడని వీఆర్ఏల సర్దుబాటు

రాష్ట్రంలో ముందుకుపడని వీఆర్ఏల సర్దుబాటు
  • కేబినెట్​లో నిర్ణయం తీసుకుని నెల దాటినా మొదలుకాని కసరత్తు
  • వారసత్వ ఉద్యోగాల కోసం 4 వేల మంది ఎదురుచూపులు

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియ ముందుకు పడడం లేదు. వీఆర్ఏల సర్వీస్ ను రెగ్యులరైజేషన్ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుని నెల రోజులు దాటినా అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా వీఆర్ఏలు సుదీర్ఘంగా 80 రోజులు సమ్మె చేసి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి పే స్కేల్, రెగ్యులరైజేషన్ హామీలు సాధించిన విషయం తెలిసిందే. నిరుడు మునుగోడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మే18న జరిగిన రాష్ట్ర కేబినెట్​మీటింగులో వీఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయాలని, వారికి పే స్కేల్ వర్తింపజేయాలని నిర్ణయించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ముగిసేలోపే అంటే జూన్ 22లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్వయంగా సీఎం కేసీఆర్ సీసీఎల్ఏను ఆదేశించారు. ఇది జరిగి 40 రోజులు దాటినా ఇప్పటి వరకు వీఆర్ఏల డేటా తెప్పించుకోవడం తప్పా.. సర్దుబాటుకు సంబంధించి ఎలాంటి ప్రాసెస్ మొదలుపెట్టలేదు. 

వారసత్వ ఉద్యోగాలకు డిమాండ్..  

కేబినెట్ మీటింగ్​లో వీఆర్ఏల సర్దుబాటు నిర్ణయం తీసుకున్న తర్వాత సీసీఎల్ఏ అధికారులు అన్ని జిల్లాల నుంచి వీఆర్ఏల వివరాలను ప్రత్యేక ఫార్మాట్ లో  తీసుకున్నారు. వీఆర్ఏ పేరు, పుట్టిన రోజు, క్యాస్ట్, రిక్రూట్ అయిన విధానం..ఇలా అనేక వివరాలు అందులో పొందుపరిచారు. అలాగే కారుణ్య నియామకం కోసం ఎదురుచూస్తున్న వీఆర్ఏల కుటుంబసభ్యుల వివరాలు తీసుకున్నారు. సీసీఎల్ఏ సేకరించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20,400 మంది వీఆర్ఏలు పని చేస్తున్నారు. వీరిలో 60 ఏండ్లు పైబడిన వారు 4 వేల మంది ఉన్నారు. వీరంతా తాము తప్పుకుని తమ వారసులకు ఉద్యోగాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.

 వీరిలో కొందరు ఇప్పటికే చనిపోయారు. మొత్తం వీఆర్ఏల్లో ఎలాంటి చదువు లేని వారు 3,300 మంది, డిగ్రీ, ఆపై చదువుకున్నవాళ్లు 3600, ఇంటర్ పూర్తి చేసినవాళ్లు 2,700, ఎస్సెస్సీ చదివినవాళ్లు 3,600, ఏడు నుంచి తొమ్మిదో తరగతి చదివినవాళ్లు 2 వేల మంది, ఆరో తరగతిలోపు చదివినవాళ్లు సుమారు వెయ్యి మంది వరకు ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్న వీఆర్ఏలు కోరుకుంటే వాళ్ల ఇంట్లో పిల్లలకు ఎవరికైనా వీఆర్ఏ ఉద్యోగం ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడం, తాజాగా పే స్కేల్ వర్తింపజేస్తామని కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో వీఆర్ఏ ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. జాబ్ కోసం వారసుల మధ్య పోటీ నెలకొంది. 

పే స్కేల్ హామీకి ఆరేండ్లు  

వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తామని, పే స్కేల్ వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ 2017, ఫిబ్రవరి 24న ప్రగతి భవన్ లో మొదటిసారి ప్రకటించారు. ఆ తర్వాత 2020, సెప్టెంబర్ లో వీఆర్ వో వ్యవస్థ రద్దు సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు మినిమం పే స్కేల్ వర్తింపజేస్తామని మరోసారి హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై అదనంగా రూ.260 కోట్ల భారం పడుతుందని లెక్కలు కూడా వేశారు. కానీ, ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో దశలవారీగా ఆందోళనలు నిర్వహించిన వీఆర్​ఏలు చివరికి నిరుడు జూలై 25 నుంచి.. అక్టోబర్ 14 వరకు 80 రోజులపాటు సమ్మె చేశారు. 

సమ్మె టైంలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. దీంతో స్వయంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి చర్చించారు. అయినా వారు వినలేదు. అక్టోబర్ నాటికి మునుగోడు ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో వీఆర్​ఏల సమ్మె ప్రభావం ఉండొద్దనే ఉద్దేశంతో అక్టోబర్ 14న మరోసారి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ప్రగతి భవన్ లో వీఆర్ఏ జేఎసీ నాయకులతో చర్చలు జరిపారు. ఎన్నికలు అయిపోగానే డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమించి విధుల్లో చేరారు. ఆ తర్వాత ఎట్టలకే మే 18న జరిగిన కేబినెట్ మీటింగులో  తుది నిర్ణయం తీసుకున్నారు.

సర్దుబాటు ప్రక్రియను స్పీడప్ చేయాలి

రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన ప్రకారం ఈ నెల నుంచే పే స్కేల్ వర్తింపజేయాలి. అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలి. వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి. కేబినెట్ నిర్ణయం జరిగి నెల రోజులు దాటినా ఇప్పటి వరకు జీవోలు విడుదల కాలేదు. ప్రమోషన్లు కల్పించలేదు. త్వరలో ఎలక్షన్స్ ఉన్నందున జీవో వస్తుందో రాదోనని వీఆర్ఏలు మానసిక వేదనకు గురవుతున్నారు. ఇప్పటికే సమ్మె టైంలో దాదాపు 80 మంది వీఆర్ఏలు చనిపోయారు. అందువల్ల ప్రభుత్వం జాప్యం చేయకుండా వీఆర్ఏలను వెంటనే రెగ్యులరైజ్  చేయాలి. 

- రమేశ్ బహదూర్, కె.సత్యనారాయణ, వీఆర్ఏ జేఏసీ నేతలు