నత్తనడకన నర్సింగ్ రిక్రూట్‌మెంట్

నత్తనడకన నర్సింగ్ రిక్రూట్‌మెంట్

హైదరాబాద్, వెలుగు : స్టాఫ్  నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. నిరుడు డిసెంబర్‌‌  చివరి వారంలో నోటిఫికేషన్‌ ఇచ్చిన మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు.. ఇప్పటి వరకూ ఎగ్జామ్‌  డేట్  ప్రకటించలేదు. ప్రభుత్వ దవాఖాన్లు, విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న 5,204 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, సుమారు 45 వేల మంది అప్లై చేశారు.

ఫిబ్రవరిలోనే దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. దరఖాస్తుల్లో తప్పులు ఉన్నాయని అప్లికేషన్ల ఎడిటింగ్‌కు అవకాశం ఇచ్చారు. ఈనెల 9 నాటికి ఎడిటింగ్‌ ప్రక్రియ కూడా పూర్తయింది. దీంతో ఇప్పటికైనా ఎగ్జామ్ నోటిఫికేషన్‌  ఇస్తారేమోనని నర్సులు ఆశించారు. కానీ, బోర్డు నుంచి ఎలాంటి నోటిఫికేషన్ రాకపోవడంతో ఆ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఏండ్లకు ఏండ్లు రిక్రూట్‌మెంట్‌ను సాగదీస్తారేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖాన్లలో నర్సింగ్  పోస్టుల భర్తీ కోసం  2017లో నోటిఫికేషన్‌  ఇచ్చిన ప్రభుత్వం.. 2021 చివరి వరకూ రిక్రూట్ మెంట్  ప్రక్రియను సాగదీసింది. అందులోనూ అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయి. కాంట్రాక్ట్  బేసిస్‌లో పనిచేసే స్టాఫ్‌  నర్సులకు వెయిటేజీ ఇచ్చే విషయంలో కోర్టులో కేసులు దాఖలయ్యాయి. వాటికి కౌంటర్లు వేయడంలో సర్కార్ స్పందించపోవడం కూడా ఆలస్యానికి కారణమైంది.

వెయిటేజీ మార్కులు ఇవ్వడంలో లక్షల రూపాయలు చేతులు మారాయని ఆరోపణలు వచ్చాయి. ఈసారి కాంట్రాక్ట్ వాళ్లతో పాటు, అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న నర్సులకు కూడా వెయిటేజీ ఇచ్చారు. దీంతో ఎలాంటి పొరపాట్లు జరుగుతాయోనని, కోర్టు కేసుల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందోనని నర్సులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడం కూడా నర్సుల ఆందోళనకు కారణమవుతోంది. 

మేలో ఎగ్జామ్!

స్టాఫ్  నర్సుల పోస్టుల ఎగ్జామ్‌ మే నెలలో జరిగే అవకాశం ఉందని బోర్డు ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రస్తుతం అసిస్టెంట్  ప్రొఫెసర్  పోస్టుల రిక్రూట్‌మెంట్‌ పనుల్లో బిజీగా ఉన్నామని వారు చెబుతున్నారు. మరో పది రోజుల్లో అసిస్టెంట్  ప్రొఫెసర్‌‌  రిక్రూట్‌మెంట్‌  పనులన్నీ పూర్తవుతాయని, ఆ తర్వాతే స్టాఫ్  నర్స్‌ పోస్టులకు సంబంధించిన పని ప్రారంభిస్తామని పేర్కొంటున్నారు. ఎగ్జామ్ నిర్వహించే బాధ్యతను జేఎన్టీయూకు అప్పగించామని, రెండు నెలల్లో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు, దవాఖాన్లలో వేలల్లో నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉండడంతో నర్సులపై పనిభారం పెరుగుతోంది. ఆ ఎఫెక్ట్‌ పేషెంట్‌ కేర్ సర్వీసులపై పడుతోంది.