మునుగోడులో మొదలైన నామినేషన్ల పర్వం

మునుగోడులో మొదలైన నామినేషన్ల పర్వం
  • డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు
  • సభలు, సమావేశాలు వీడియో చిత్రీకరణ

నల్గొండ జిల్లా: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ప్రధానమైన నామినేషన్ల పర్వం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈనెల 14వ తేదీ వరకు నామినేషన్లు వేయడానికి అవకాశముంది. చండూరులోని తాహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 15న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉప సంహరణకు ఈనెల17వరకు గడువు ఉంది. 

ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే రాజకీయ పార్టీలతో నల్గొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమావేశం నిర్వహించి నిబంధనలను గుర్తు చేశారు. కోడ్ ఉల్లంఘనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై నేతలతో చర్చించారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన వెంటనే కోడ్ అమల్లోకి వచ్చిందని..  ప్రభుత్వ కార్యాలయాలపై ఎన్నికల ప్రచారాన్ని ప్రభావితం చేసేలా ప్రకటనలు ఉండకుండా జాగ్రత్త పడాలని సూచించారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి కోసం 16 టీమ్లు

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కోసం 16  ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేశారు. సభలు, సమావేశాలను వీడియో తీయడానికి ఏడు టీమ్ లు, డబ్బు మద్యం పంపిణీని అరికట్టేందుకు 14 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వ గెస్ట్ హౌజ్ లు, వాహనాలను ఎన్నికల  ప్రచారానికి వాడొద్దని కలెక్టర్  సూచించారు.

ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఎవరైనా.. ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే అలాంటి వారి కోసం  ప్రత్యేకంగా యాప్ తీసుకొచ్చామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. ప్రజలు ఎవరైనా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే వేగంగా స్పందించి తగిన చర్యలు తీసుకునే వీలుంటుందని పేర్కొన్నారు.