హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కూల్ టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ఒడువని ముచ్చటగా మారుతోంది. ఏడేండ్లుగా ప్రమోషన్లు లేక, నాలుగేండ్లుగా బదిలీలు లేక టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాటి కోసం రెండేండ్లుగా టీచర్ల సంఘాలు పోరాడుతున్నాయి. అయితే సర్కారు మాత్రం వివిధ కారణాలు చూపి, కాలయాపన చేస్తోంది. ప్రస్తుతం ఎన్నికల టైమ్ కావడంతో టీచర్ల సంఘాల లీడర్లు సర్కారుపై ఒత్తిడి పెంచుతున్నారు. రాష్ట్రంలో 26 వేలకుపైగా సర్కారు స్కూళ్లున్నాయి. వాటిలో 1.05 లక్షల మంది టీచర్లు ఉన్నారు. స్టేట్‌లో చివరిసారిగా 2015లో పదోన్నతులు ఇవ్వగా, 2018లో బదిలీలు నిర్వహించారు. నిబంధనల ప్రకారం రెండేండ్లు ఒకేచోట పనిచేసిన వారు బదిలీలకు, ప్రమోషన్లకు అర్హులు. కానీ ఏండ్లుగా బదిలీలు, ప్రమోషన్లు లేకపోవడంతో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. పండిట్, పీఈటీల అప్‌గ్రేడేషన్ ప్రక్రియ కూడా పెండింగ్‌లో పడింది. జీవో 317తో కొంతమందిని సొంత జిల్లాలకు పంపినా, ఇంకా వందలాది అప్పీల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. జీవో 317 కింద 19 జిల్లాలకు మాత్రమే సర్కారు స్పౌజ్ బదిలీలు నిర్వహించి, మరో 13 జిల్లాలను బ్లాక్‌లో పెట్టింది. వారంతా ప్రస్తుతం ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా..
టీచర్ల సంఘాలతో సీఎం కేసీఆర్ గతంలో సమావేశమైన సందర్భంలో రెగ్యులర్‌గా బదిలీలు, ప్రమోషన్లు నిర్వహిస్తామని, భార్యాభర్తలు ఒకేచోట ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ టీచర్లకు బదిలీలు, ప్రమోషన్లు త్వరలోనే నిర్వహిస్తామని ప్రకటించినా, ఇప్పటికీ ఈ ప్రక్రియ మొదలేకాలేదు. బదిలీలు, ట్రాన్స్ఫర్ల కోసం టీచర్ల సంఘాలు అనేక పోరాటాలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. మేనేజ్మెంట్ల వారిగా ఈ ప్రక్రియ నిర్వహించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, ప్రభుత్వం కావాలనే నాన్చుతుందని టీచర్లు మండిపడుతున్నారు. దీంతో ఏండ్లుగా ఒకేచోట పనిచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అయితే ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నికతో పాటు త్వరలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో విద్యాశాఖలో బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ హాట్ టాపిక్‌గా మారింది.
సర్కారుపై ఒత్తిడి పెంచిన సంఘాలు
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పలు టీచర్ల సంఘాల లీడర్లు మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు మంత్రులను కలుస్తున్నారు. టీచర్ల సమస్యలు, బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ ఆలస్యంపై వివరిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయాన్ని గుర్తుచేస్తున్నారు. సర్కారుకు అనుకూలంగా ఉన్న ఓ టీచర్ సంఘం బదిలీలు, ప్రమోషన్ల ఇప్పించేలా ఒత్తిడి తేస్తోంది. లేకపోతే టీచర్ల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముందని ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందిస్తున్నారు. మిగిలిన సంఘాలు ప్రస్తుతం ఎన్నికల టైమ్ కావడంతో పోరాటాలు నిర్వహించి, సర్కారుపై ఒత్తిడి తేవాలని చూస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ ఎన్రోల్మెంట్, ప్రచారానికి వెళ్తున్న నాయకులకూ బదిలీలు, ట్రాన్స్ఫర్ల అంశం తలనొప్పిగా మారింది. వీటిని చేయిస్తేనే ఓట్లు వేస్తామని చెప్తున్నారు. ఈ టైమ్ మిస్ అయితే, జనరల్ ఎన్నికల వరకు వాయిదాపడే అవకాశం లేదని టీచర్లు చెప్తున్నారు.
సర్కారుపై ఒత్తిడి తెస్తున్నాం
టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. అప్‌గ్రెడేషన్, జీవో 317 అప్పీల్స్ కోర్టు పరిధిలో ఉన్నాయి. త్వరలోనే అది పరిష్కారం కానుంది. ఆ వెంటనే టీచర్ల ప్రమోషన్ల షెడ్యూల్ ఇస్తామనీ మంత్రి హామీ ఇచ్చారు.
- శ్రీపాల్ రెడ్డి, పీఆర్టీయూ స్టేట్ ప్రెసిడెంట్
